45 ఏళ్ళుగా తేనీరు, నీళ్లతో జీవిస్తున్న Old Man

ABN , First Publish Date - 2022-06-20T18:00:35+05:30 IST

పుదుక్కోట్టై జిల్లాలో 80 యేళ్ళ వృద్ధుడు 45 యేళ్ళుగా కేవలం తేనీరు, నీళ్లను మాత్రమే తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

45 ఏళ్ళుగా తేనీరు, నీళ్లతో జీవిస్తున్న Old Man

చెన్నై/అడయార్‌: పుదుక్కోట్టై జిల్లాలో 80 యేళ్ళ వృద్ధుడు 45 యేళ్ళుగా కేవలం తేనీరు, నీళ్లను మాత్రమే తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పొన్నమరవతి సమీపంలో కట్టైయాన్‌పట్టికి చెందిన నల్లు (80) అనే వృద్ధుడు నివసిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. పిల్లల చిన్నతనంలోనే భార్య అళగి కన్నుమూశారు. అప్పటికే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న నల్లు భార్య మృతి చెందిన తర్వాత పిల్లలను పోషించేందుకు అష్టకట్టాలు పడ్డారు. ఆ సమయంలో తనకు లభించిన ఆహారాన్ని పిల్లలకు పెట్టి తాను వస్తులుండేవారు. అలా ఆరంభంలో వేళకు తినడం మానేసి ఒక్కపూటే భోజనం చేసేవాడు. కాలక్రమంలో అదికూడా మానేశారు. కేవలం నీరు, టీ మాత్రమే తాగి, తనకు లభించిన ఆహారాన్ని పిల్లలకుపెట్టి పోషించారు. పిల్లలు పెరిగి పెద్దవారైనా నల్లు మాత్రం అన్నంపై కన్నెత్తి చూడలేదు. గ్రామం లేదా బంధువుల వివాహాది శుభకార్యాలకు వెళ్ళినా ఆయన భోజనం చేయరు.


కేవలం నీరు మాత్రమే తాగి వచ్చేవారు. అలా నాలుగున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ క్రమంలో ఇటీవల కుమారులు తమ తండ్రికి వైద్య పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో నల్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు చెప్పారు. దీనిపై నల్లు మాట్లాడుతూ, తేనీరు, నీటితో జీవించడం తనకు దేవుడు ఇచ్చిన వరమన్నారు. తన కుటుంబ పరిస్థితుల కారణంగా ఆరంభంలో వేళకు తినేవాడిని కాదని, కాలక్రమంలో టీ, నీటితోనే 45 యేళ్ళు గడిచిపోయాయని, తానిప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు ఆయన చెప్పారు. 

Updated Date - 2022-06-20T18:00:35+05:30 IST