103 ఏళ్ల వయసులో... మానవత్వంపై పెరిగిన మమత

ABN , First Publish Date - 2020-09-20T12:38:58+05:30 IST

ఆయన తొలితరం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. బ్రిటీషు అధికారుల దోపిడీ, పెత్తందారీల దౌర్జన్యాలపై పిడికిలి బిగించిన యోధుడు. ఇప్పుడు కరోనాపైనా పోరాడి విజేతగా నిలిచారు.

103 ఏళ్ల వయసులో... మానవత్వంపై పెరిగిన మమత

హైదరాబాద్‌: ఆయన తొలితరం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. బ్రిటీషు అధికారుల దోపిడీ, పెత్తందారీల దౌర్జన్యాలపై పిడికిలి బిగించిన యోధుడు. ఇప్పుడు కరోనాపైనా పోరాడి విజేతగా నిలిచారు. ఆయనే 103 ఏళ్ల పరుచూరి రామస్వామి. ‘కరోనా నాకు రాదనుకున్నా. కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరాక, తిరిగి ఇంటికెళ్లననుకున్నా. నర్సులు, డాక్టర్ల మానవత్వమే నన్ను బతికించింది. కరోనాపై యుద్ధంలో నన్ను గెలిపించింది’’ అంటున్న రామస్వామి కొవిడ్‌ అనుభవం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.!


ఇప్పుడు నా వయసు 103 ఏళ్లు. షుగరు, బీపీ వంటి ఆరోగ్య సమస్యలేమీ లేవు. కొద్ది నెలలుగా నేనూ, నా కూతురు జమున కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వశ్వరరావు వృద్ధాశ్రమంలో ఉంటున్నాం. లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. గది బయటకు వెళ్లడం కూడా మానేశా! హోమ్‌లోనూ ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆగస్టు రెండో వారంలో మొదటగా మా అందరికీ ఆశ్రమంలో కరోనా పరీక్షలు చేశారు. అప్పుడు నాకు నెగెటివ్‌ వచ్చింది. కరోనా నాకు రాదులే అనే గట్టి నమ్మకంతో ఉన్నా. ఆగస్టు 27న మళ్లీ పరీక్ష చేస్తే, అప్పుడు పాజిటివ్‌ అని తేలింది. కానీ కొవిడ్‌ లక్షణాలేమీ నాలో లేవు. కానీ, నాలో ఏదో తెలియని బెంగ మొదలైంది. అదే రోజు సాయంత్రం నాలుగింటికి మమ్మల్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లేప్పుడు మాత్రం దుఃఖమొచ్చింది. అప్పుడు నా కూతురిని పిలిచి ‘అమ్మాయి.. ఇక నేను అటు నుంచి అటే. తిరిగొస్తానన్న నమ్మకం లేదు. జీవితం అంటే ఇట్లానే ఉంటది. నీవు జాగ్రత్తమ్మా.!’ అని దూరం నుంచే ఆమెకు చెబుతూ, కన్నీళ్లు పెట్టుకున్నా. ఆ అంబులెన్స్‌లో నాతో పాటు మరికొందరు బాధితులున్నారు. వాళ్లు మమ్మల్ని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికని, మరో ఆస్పత్రికని అటూ ఇటూ తిప్పి, చివరికి రాత్రి ఒంటి గంట సమయంలో గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. అన్నం చాలా తక్కువ తింటాను, అదీ మెత్తగా ఉంటేనే తినగలను. ఇక మొదటి నుంచి వేడినీళ్లతో స్నానం చేయడం నాకు అలవాటు. టిమ్స్‌లో వేడినీళ్లూ దొరకవు. మెత్తటి అన్నమూ ఇవ్వరు. దాంతో చాలా ఇబ్బంది పడ్డాను. నా అవస్థ చూసి, ఒక నర్సు బొప్పాయి పండు, వేడినీళ్లు తెచ్చి ఇచ్చారు. ఆ సంగతి తెలిసిన ఒక పెద్ద డాక్టరు ‘అలా ఇవ్వద్దు. మిగతా వాళ్లూ అడుగుతారు’ అని ఆ నర్సుతో అన్నారు. అయినా, ఆమె నాకు సాయం చేయడం మాత్రం మానలేదు.


గాంధీకి మార్చారు...

టిమ్స్‌లో నాకు ఆరోగ్య పరీక్షలన్నీ చేశారు. హిమోగ్లోబిన్‌ 5.5 శాతం మాత్రమే ఉందన్నారు. దాంతో ఏక్షణమైనా ఆరోగ్య సమస్యలు రావచ్చని, రెండు రోజుల తర్వాత నన్ను గాంధీ ఆస్పత్రికి మార్చారు. నా పనులన్నీ నేను చేసుకుంటున్నప్పటికీ, అప్పుడప్పుడు ఇతరుల సాయం అవసరమవుతుంది కదా.! మొదట్లో బాగా ఒంటరితనంగా ఫీలయ్యా. కానీ మనిషి సంఘజీవి. కనుక మనిషికి మనిషే తోడు అన్నట్టు, నేనున్న వార్డులోనే వరంగల్‌కి చెందిన ఒక రిటైర్డ్‌ ఇంజినీరు దంపతులు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. వాళ్లు వచ్చేప్పుడు ఇంటి నుంచి ఒక బుట్ట దానిమ్మ పండ్లు తెచ్చుకున్నారు. వాళ్లు రోజూ దానిమ్మ విత్తనాలు తినమని బతిమాలేవాళ్లు. నాకు వద్దన్నా, వినేవాళ్లు కాదు. ‘మీరు తినకుంటే, మేమూ తినము’ అని నాచేత తినిపించేవాళ్లు. ఆస్పత్రిలోని ఒక నర్సు నన్ను కన్నతండ్రి కన్నా మిన్నగా చూసుకుంది. ఆమె నా పట్ల చూపిన కరుణ, ప్రేమాభిమానాలే నన్ను మామూలు మనిషిని చేశాయి. రోజూ మూడు పూటలా నాచేత ఆమె భోజనం తినిపించేది. నేనేమి తినగలనో, అవే తెచ్చిపెట్టే వాళ్లు. ‘పెద్దాయన మీరు. బాగా తినాలి. మంచి ఆహారం తీసుకుంటే, త్వరగా కోలుకుని ఇంటికెళతారు’ అని రోజూ ఒక డాక్టరమ్మ నా యోగక్షేమాలు విచారించేది. గాంధీ ఆస్పత్రిలో సుమారు పన్నెండు రోజులున్నాను. రోజూ ఉదయం ఒక జొన్నరొట్టె, పాలు తీసుకున్నా. మధ్యాహ్నం భోజనంలోకి పెరుగు, రెండు స్ఫూన్లు మెత్తటి అన్నం మాత్రమే తిన్నా. సాయంత్రం డ్రైఫ్రూట్స్‌ ఇచ్చేవాళ్లు. రాత్రిపూట ఒక గోధుమ రొట్టె, పాలు తీసుకునేవాడిని. నా నర్సు కూతురు (ఆమెను కూతురిగా భావిస్తూ...)రోజూ దానిమ్మ ఒలిచి, మాచేత తినిపించేది. ఆమె వాత్సల్యం, ఇంజినీరు దంపతుల స్నేహశీలత నన్ను ఒంటరితనం నుంచి బయట పడేశాయి. సెప్టెంబరు ఏడున డిశ్చార్జి అయ్యాను.


పైసా ఖర్చు లేకుండా...

ఆస్పత్రికెళ్లేప్పుడు నా జేబులో ఒక్క రూపాయి లేదు. పన్నెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నా, పైసా ఖర్చు కాలేదు. రూపాయి బిల్లు కట్టేపనిలేకుండా, ప్రభుత్వ ఆస్పత్రిలో మంచి చికిత్స తీసుకొని ప్రాణాలతో బయటపడ్డా. నా మరణానంతరం డెడ్‌బాడీని గాంధీ ఆస్పత్రికివ్వాలని ఇరవై ఏళ్ల కిందటే నా వీలునామాలో రాసుకున్నా. మూడేళ్ల కిందట నా భార్య అరుంధతీ భౌతికకాయాన్ని అదే ఆస్పత్రికి అందజేశాం. వాస్తవానికి, నన్ను టిమ్స్‌ నుంచి గాంధీకి తీసుకెళుతున్నారనగానే...అదే నా ఆఖరి మజిలీ అనుకున్నాను. ప్రాణాలతో తిరిగి రాననుకున్న నన్ను ఆరోగ్యవంతుడిని చేసిన గాంధీ ఆస్పత్రి వైద్యులు, నర్సులు, ఆయాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 


విశ్రాంతి తీసుకుంటున్నా..

ప్రస్తుతం తార్నాకలోని మా అబ్బాయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా. నా కూతురూ కొవిడ్‌ను జయించింది. ఇప్పుడు ఇద్దరం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాం. నేను ఆస్పత్రికెళ్లేప్పుడు, నా కూతురు నాకొక ఒక ఉత్తరం చేతికిచ్చింది. అందులో ‘నీవు భయపడకు. నీకేమీ కాదు. డాక్టర్లు చెప్పినట్లు విను’ అని ఆమె రాసింది. ఆ అక్షరాలను నేను తూచా తప్పక పాటించడం వల్లే ఈ రోజు నేను మీముందున్నాను.

Updated Date - 2020-09-20T12:38:58+05:30 IST