కొత్త తరగతిలో పాత పాఠాలు

ABN , First Publish Date - 2021-06-11T09:24:27+05:30 IST

రోజువారీ పాఠశాలకు వెళ్లి.. అన్ని తరగతులకు హాజరై.. పరీక్షలు రాసి ఉత్తీర్ణులై.. పై క్లాసులకు వెళ్లిన సందర్భాల్లోనే గతేడాది పాఠాలను మర్చిపోతుంటాం! అలాంటిది కరోనా కారణంగా పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో సాగిన తరగతుల ద్వారా విద్యార్థులకు నిరుటి పాఠ్యాంశాలు..

కొత్త తరగతిలో పాత పాఠాలు

30- 50 ఆన్‌లైన్‌ పునశ్చరణ క్లాసులు..

గత తరగతిలోని కీలక పాఠాల బోధన

విద్యార్థులకు పట్టు చిక్కేలా ప్రయత్నం

1 నుంచి 10వ తరగతి దాకా అందరికీ

సబ్జెక్టుల వారీ ప్రత్యేక పాఠ్య ప్రణాళిక


హైదరాబాద్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): రోజువారీ పాఠశాలకు వెళ్లి.. అన్ని తరగతులకు హాజరై.. పరీక్షలు రాసి ఉత్తీర్ణులై.. పై క్లాసులకు వెళ్లిన సందర్భాల్లోనే గతేడాది పాఠాలను మర్చిపోతుంటాం! అలాంటిది కరోనా కారణంగా పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో సాగిన తరగతుల ద్వారా విద్యార్థులకు నిరుటి పాఠ్యాంశాలు.. అందులోని కీలక విషయాలు ఏమేరకు గుర్తున్నాయో అంచనా వేయలేం. అంతేకాక గతేడాది పరీక్షలు కూడా నిర్వహించకుండానే ఉత్తీర్ణులను చేయడంతో వారి అభ్యసనా సామర్థ్యాలు ఎలా ఉన్నాయనేదీ చెప్పలేం. ఉపాధ్యాయులు కూడా ఒక అవగాహనకు రాలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది మళ్లీ ఆన్‌లైన్‌ విధానంలో బోధన సాగితే విద్యార్థులు ఇబ్బంది పడతారని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పునశ్చరణ తరహాలో.. గతేడాది తరగతులనే ప్రస్తుత తరగతిలో కొద్ది రోజులు బోధించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమైతే కనీసం 30 నుంచి 50 రోజులు పాత పాఠాలను చెప్పనున్నారు.


సబ్జెక్టుల వారీగా నిపుణుల బృందం

గతేడాదంతా బోధన ఆన్‌లైన్లోనే సాగింది. ప్రత్యక్ష తరగతులకు ఇవి ఏమాత్రం ప్రత్యామ్నాయం కాకపోయినా.. విద్యార్థులు చదువుకు పూర్తిగా దూరం కాకుండా ఉండేందుకు కొనసాగించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 30-40 రోజులు ప్రత్యక్ష తరగతులు జరిగినా పెద్దగా ఉప యోగం లేకుండా పోయింది. ఆన్‌లైన్‌ విధానంతో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువ నష్టపోయారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో ఈసారీ ఆన్‌లైన్‌లోనే తరగతుల నిర్వహణకు విద్యా శాఖ సిద్ధమవుతోంది. అయితే, గతేడాది పాఠ్యాంశాలపై విద్యార్థులకు పట్టు లేకుంటే.. కొత్త తరగతిలో ఇబ్బందులు వస్తాయని అధికారులు భావించారు.


కొన్ని రోజుల పాటు గత తరగతి పాఠాలే బోధించాలని నిర్ణయించారు. 1-10 తరగతుల విద్యార్థులందరికీ పాత పాఠాల బోధన తప్పనిసరి చేశారు. దీనికోసం విద్యాశాఖ ఇప్పటికే అన్ని తరగతుల సబ్జెక్టుల నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పూర్తయిన తరగతిలోని కీలకమైన పాఠాలు.. కొత్త తరగతులతో సంబంధమున్న పాఠ్యాంశాలను వీరు ఇప్పటికే గుర్తించారు. ఈ పాఠాలకు సంబంధించిన బోధన వీడియోలు కూడా సిద్ధమయ్యాయి. 


6-10 తరగతుల వారికే కీలకం

ముఖ్యంగా 6-10 తరగతుల విద్యార్థులకు గణితం, సామాన్యశాస్త్రం సబ్జెక్టుల్లో అనుబంధ పాఠ్యాంశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. 9వ తరగతి గణిత శాస్త్రంలో సాంఖ్యక శాస్త్రం ‘‘ప్రాథమిక భావాలు’’ అధ్యాయం ఉంటుంది. దీనికి కొనసాగింపుగా పదో తరగతిలో అంక గణిత సగటు, బాహుళకం అధ్యాయాలుంటాయి. గణితం, సైన్స్‌లో ఇలాంటి అనుబంధ పాఠాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు.

Updated Date - 2021-06-11T09:24:27+05:30 IST