పంద్రాగస్టుకు పాత డ్రెస్సేనా!

ABN , First Publish Date - 2022-08-12T05:30:00+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను రెండు వారాలపాటు అత్యంత వైభవంగా

పంద్రాగస్టుకు పాత డ్రెస్సేనా!
శంకర్‌పల్లి : యూనిఫామ్‌ లేకుండా కొండకల్‌ ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థులు

  • ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందని యూనిఫామ్‌
  • డ్రెస్సులు కుట్టేందుకు కూలి గిట్టుబాటు కాదంటున్న ఎస్‌హెచ్‌జీ సభ్యులు
  • జిల్లాలో 1,44538 మంది విద్యార్థులు ఎదురుచూపు


స్వాతంత్య్ర వజ్రోత్సవాలను రెండు వారాలపాటు అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. పాఠశాల విద్యార్థులు సైతం ఇందులో భాగస్వాములను చేస్తున్నాయి. విద్యార్థుల్లో దేశభక్తిని పెంచేలా అన్ని థియేటర్లలో ‘గాంధీ’ మూవీ ఉచితంగా సినిమాను చూపిస్తున్నారు. ఇలాంటి కీలక సందర్భంలో వస్తున్న జెండా పండుగకు కూడా విద్యార్థులకు యూనిఫాం అందలేదు. పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకున్న దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. కొన్నిచోట్ల యూనిఫాం కోసం వస్త్రం వచ్చినా వాటిని దర్జీలకు ఇచ్చి కుట్టించడంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో పంద్రాగస్టు వేడుకలకు విద్యార్థులు పాత బట్టలతోనే హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది.


రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 12 : పాఠశాల విద్యార్థులకు యూనిఫాం పంపిణీలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటిపోయినా ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ధనిక, పేద తేడా ఉండకూడదనే ఉద్దేశంతో అందరికీ ఒకేరకమైన యూనిఫామ్స్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కానీ.. ఇంతవరకు విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయకపోవడంతో పాత బట్టలతోనే బడులకు హాజరవుతున్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా సరైన ప్రణాళిక లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఏటా విద్యాసంవత్సరం ముగిసే నాటికి యూనిఫాంలకు అవసరమైన వస్ర్తాన్ని టెస్కో నుంచి జిల్లాకు పంపించాలి. కానీ.. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాంల కోసం బట్టలు సరఫరా చేయడంతో తీవ్ర జాప్యం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఈసారి యూనిఫాం కలర్‌ మార్చారు. 


సమస్యగా మారిన కుట్టుకూలి..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థుల యూనిఫాం కోసం అధికారులు వస్ర్తాలను పంపిణీ చేస్తారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు బాలబాలికలకు కొలతలు తీసుకుని కుట్టించే బాధ్యతను ఎస్‌ఎంసీలకు ఇంతకు ముందు అప్పగించారు. 1 నుంచి 7వ తరగతి వరకు షర్ట్‌, నిక్కర్‌, 8వ తరగతి నుంచి షర్ట్‌, ప్యాంట్‌ బాలుర కోసం కుట్టించి ఇవ్వాలి. వీటిని కుట్టేందుకు టైలర్లకు ఒక జతకు ప్రభుత్వం ఇస్తున్న కూలి రూ.50, ఇది ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల సభ్యులు చేతులెత్తాశారు. యూనిఫాంలను కుట్టేందుకు జిల్లాలో ముందుకు వచ్చిన ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించారు. రెండు జతలకు సంబంధించిన క్లాత్‌ ఇవ్వాల్సి ఉండగా ఒకే జతకు సంబంధించిన క్లాత్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఒక్క జత కుట్టేందుకు కూడా ఏజెన్సీలకు డబ్బులు రిలీజ్‌ కాలేదంటున్నారు. కొందరు ఏజెన్సీ వాళ్లు రూ.50కు షర్ట్‌, ప్యాంట్‌ గిట్టుబాటు అవ్వడం లేదని తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పూర్తి స్థాయిలో యూనిఫాం తయారు కావడంలో మరింత ఆలస్యం జరిగే అవకాశముంది. 


పంద్రాగస్టుకూ అనుమానమే..

కుట్టు కూలి తక్కువ చెల్లిస్తుండటంతో యూనిఫాంలను దర్జీలు నాసిరకంగా కుడుతుండడంతో అవి స్వల్ప కాలంలోనే చినిగిపోయేవి. కుట్లు పోయేవి. కొలతలు సైతం ఇష్టానుసారంగా ఉండటం వల్ల గుండీలు ఊడిపోవడం, ప్యాంటు, చొక్కాలు పనికిరాకుండా పోయేవి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాల సంబరాలకైనా మంచి దుస్తులు అందుతాయనుకుంటే నిరాశే ఎదురయ్యేలా ఉందని విద్యార్థులు వాపోతున్నారు.


పంద్రాగస్టుకు పంపిణీ చేస్తాం

యూనిఫాంకు సంబంధించి క్లాత్‌ వచ్చింది. దర్జీలకు కూడా ఇచ్చాం. కుట్టడం కూడా పూర్తయింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పంద్రాగస్టుకు డ్రెస్సులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఈ సారి ప్రభుత్వ బడులకు మంచి స్పందన లభిస్తుంది. అడ్మిషన్లు కూడా విపరీతంగా పెరిగాయి. 

- సుశీందర్‌రావు, జిల్లా విద్యాధికారి


యూనిఫాం త్వరగా అందించాలి

బడులు తెరిచి దాదాపు 3 నెలలు గడుస్తున్నా నేటికీ విద్యార్థులకు యూనిఫాం అందించక పోవడం శోచనీయం. దుస్తులు కుట్టడానికి జతకు కేవలం రూ.50 అందించడంతో నాణ్యత కొరవడి దుస్తుల కుట్లు ఊడిపోతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే సరైన ప్రణాళికతో బడులు తెరిచేనాటికి దుస్తులు అందించాలి. 

- ఏవీ. సుధాకర్‌, ఎస్టీయూ టీఎస్‌ అసోసియేట్‌ అధ్యక్షుడు



Updated Date - 2022-08-12T05:30:00+05:30 IST