చిత్రహింసలు పెట్టిన కొడుకు, కోడలిపై వృద్ధ దంపతుల న్యాయపోరాటం..

ABN , First Publish Date - 2022-06-28T19:45:51+05:30 IST

తల్లి నవమాసాలు మోసి పురుటి నొప్పులను భరించి జన్మనిస్తే.. తండ్రి అన్నీ తానై తన కొడుకుని భుజాలపై ఎత్తుకుని ప్రపంచాన్ని చూపిస్తాడు.

చిత్రహింసలు పెట్టిన కొడుకు, కోడలిపై వృద్ధ దంపతుల న్యాయపోరాటం..

హైదరాబాద్ : తల్లి నవమాసాలు మోసి పురుటి నొప్పులను భరించి జన్మనిస్తే.. తండ్రి అన్నీ తానై తన కొడుకుని భుజాలపై ఎత్తుకుని ప్రపంచాన్ని చూపిస్తాడు. ఇక తల్లిదండ్రులకు కొడుకే ప్రపంచం. వాడిని పెంచి ప్రయోజకుడిని చేయడమే వారి లక్ష్యం. దీని కోసం తినీతినక నానా తిప్పలు పడతారు. చివరకు ఆ కొడుకు పెళ్లి చేసుకుని ఆ తల్లిదండ్రులకు నరకం చూపించి వారిని ఇంటి నుంచి గెంటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొందరు తల్లిదండ్రులు(Parents) ఎవరికీ చెప్పలేక తమలో తామే కుమిలిపోతారు. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం అలా కుమిలిపోలేదు. తమను చీకటి గదిలో బంధించి చిత్ర హింసలకు గురి చేసి ఇంటి నుంచి తరిమేసిన కొడుకు కోడలిపై వృద్ద దంపతుల న్యాయపోరాటానికి దిగారు.



వృద్ధ దంపతులు కొడుకూకోడలిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మన్సూరాబాద్‌లో నివాసం ఉండే కావేటి కౌసల్యాదేవికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు తమను ఇంటి నుంచి పంపించేసి వేధింపులకు గురిచేస్తున్నాడని ఈ వృద్ధ దంపతులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొడుకు, కోడలు తమను చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వృద్ధ దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వృద్ధుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విచారణ జరిపించారు. కొడుకు, కోడలి బారి నుంచి ఆ వృద్ధ దంపతులను కాపాడాలని ఆదేశించారు. ఇంటిని ఖాళీ చేయించి ఆ వృద్ధులకు అప్పగించాలని రాచకొండ సీపీ, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. రెవిన్యూ సిబ్బంది, పోలీసు అధికారులు వృద్ధులతో కలిసి ఇంటికి వెళ్లారు. ఈ విషయం ముందే తెలుసుకున్న కౌసల్య కొడుకు, కోడలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వృద్ధులు ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.

Updated Date - 2022-06-28T19:45:51+05:30 IST