పాతబస్తీలో సీన్ రివర్స్..!?

ABN , First Publish Date - 2021-03-13T15:53:15+05:30 IST

హైదరాబాద్‌ నగరం శాంతిభద్రతల్లో దేశంలోనే అత్యంత సురక్షితమైన సిటీ.

పాతబస్తీలో సీన్ రివర్స్..!?

  • చాపకింద నీరులా రౌడీల దందా
  • ఆగని ఆధిపత్య పోరు.. 
  • బయట ఉన్నా, జైల్లో ఉన్నా కార్యకలాపాలు
  • కట్టడి చేయకుంటే కష్టాలే..


హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరం శాంతిభద్రతల్లో దేశంలోనే అత్యంత సురక్షితమైన సిటీ. మర్సర్‌ సర్వేలో ప్రపంచంలోనే 16వ స్థానం దక్కించుకుంది. రాష్ట్ర రాజధాని. పాతబస్తీ ఒకప్పుడు శాంతిభద్రతల పరంగా ఎంతో సున్నితమైందని భావించారు. దశాబ్ద కాలంగా పోలీసుల సంస్కరణలు, ప్రభుత్వ చర్యలు, పాలకుల ప్రత్యేక దృష్టితో శాంతిభద్రతల్లో ఎంతో మార్పు వచ్చిందని పోలీస్‌ బాస్‌లే స్వయంగా చెబుతున్నారు. కానీ, కొన్ని నెలలుగా నగరంలో చోటు చేసుకుంటున్న ఘటనలు పాతబస్తీలో  మళ్లీ రౌడీల  ఉనికిని వెల్లడిస్తున్నాయి. నగరంలోని సౌత్‌జోన్‌తోపాటు ఈస్ట్‌, వెస్ట్‌జోన్‌లోని కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో చోటుచేసుకుంటున్న హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నా్‌పలు, దాడుల్లాంటి ఘటనలతో పాతబస్తీలో పాత రౌడీయిజం మళ్లీ వేళ్లూనుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాతబస్తీ, దానికి ఆనుకుని ఉన్న రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధుల్లో సుమారు 15హత్యలు జరిగాయి. వాటికి సమానంగా హత్యాయత్నాలు జరిగాయి. ఈ ఘటనలు రౌడీల ఆధిపత్య పోరును ప్రదర్శించడాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో చాప కింద నీరులా ఇప్పటికీ రౌడీలు నగరంలో ఉన్నారని తెలుస్తోంది.


పటిష్ఠ నిఘా, అయినా..

హైదరాబాద్‌లో పటిష్ఠమైన పోలీస్‌ నిఘా. వేల సంఖ్యలో పోలీస్‌ అధికారులు, సుమారు 10వేల మంది సిబ్బందితో ఎప్పటికప్పుడు అప్రమత్తత చాటే విజిబుల్‌ పోలీసింగ్‌. దానికి తోడు ప్రతిక్షణం ప్రతి ప్రాంతంలో కదలాడే ప్రత్యేక బృందాలు, పెట్రోలింగ్‌ వాహనాలు, బ్లూకోట్స్‌, సీసీ కెమెరాల నిఘాలో నగరమంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయినా, నగరంలో పాత నేరస్థులు ఉనికి చాటే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


రౌడీల ఆగడాలు..

గ్యాంగ్‌లు ఇప్పటికీ ఉన్నాయని.. గ్యాంగ్‌స్టర్ల హవా కొనసాగుతోందని పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. అయినా వారి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పాతబస్తీతోపాటు పాతబస్తీకి ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాల్లో (సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలోని పహాడిషరీఫ్‌, బాలాపూర్‌, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌, నార్సింగ్‌, మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్ల)కూడా రౌడీషీటర్ల ఆగడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రౌడీలు బయట ఉన్నా, జైల్లో ఉన్నా, అనుచరుల ద్వారా ఏరియాలపై పట్టు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.


రౌడీల సంఖ్య తగ్గేనా?

హైదరాబాద్‌ సిటీలో మొత్తం 1500మంది రౌడీషీటర్లు ఉన్నారని అంచనా. సుమారు 300 మంది రౌడీషీటర్లు తీరు మార్చుకుని నేరాలకు దూరంగా ఉన్నారు. వారిని గుర్తించి ఇటీవల పోలీసులు కొంతమందికి రౌడీషీట్‌లు కూడా తొలగించి ఊరట కల్పించారు. మిగతా వారిలో 75శాతం మంది సౌత్‌జోన్‌, వెస్ట్‌జోన్‌లోనే ఉన్నారు. కేవలం సౌత్‌జోన్‌లోనే 500 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వారిలో మీర్‌చౌక్‌ ఏసీపీ డివిజన్‌లో ఇప్పటికీ పేరు మోసిన రౌడీల ఉనికి కనిపిస్తోంది. ఇతర పీఎ్‌సల పరిధుల్లోనూ మిగిలిన రౌడీషీటర్లు ఏదో రకంగా ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. బెదిరింపులు,  మాట వినని వారిపై దాడి, ఫిర్యాదు చేస్తే ప్రతీకారాలు, అవసరమనుకుంటే ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారికి బెదిరింపులు, సుపారీ పనులు కూడా చేస్తున్నారని సమాచారం.


కిందిస్థాయి సిబ్బందితో ‘సమ్‌’బంధాలు

పోలీసుల్లో  కొందరు కిందిస్థాయి సిబ్బందికి రౌడీషీటర్లు, వారి అనుచరులతో సత్సంబంధాలు కూడా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇలాంటి అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరముంది.


ఇటీవల జరిగిన సంఘటనలు

  • రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ సౌత్‌జోన్‌ పరిధిలో మహ్మద్‌ పర్వేజ్‌ అలియాస్‌ ఫర్రు హత్యకు గురికావడంతో రౌడీల ఉనికి ఉందని, ఆధిపత్య పోరు కొనసాగుతోందని పోలీసులకు సంకేతాలు అందాయి.  
  • అంతకు ముందు పాతబస్తీలోని మీర్‌చౌక్‌ డివిజన్‌లో వెస్ట్‌ చంద్రానగర్‌ టీ దుకాణం వద్ద కండా అలియాజ్‌ అనే రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మొగల్‌పురా పీఎస్‌ పరిధిలో జరిగిన ఓ హత్యకు ప్రతీకార హత్య ఇది అని పోలీసులు నిర్ధారించారు. 
  • మార్చి 6 హఫీజ్‌బాబానగర్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 
  • మార్చి 5 రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో రౌడీషీటర్‌ ఖోనిగౌస్‌ వీరంగం చేశాడు. పలు నేరాలకు పాల్పడ్డ ఇతడు వాదియే మహమూద్‌ బస్తీలో ఐదు ఇళ్లలో ఉన్నవారిపై దాడిచేశాడు. రాత్రి సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసి తన ముఠాతోకలసి కత్తులు, తల్వార్‌లతో వీరంగం చేసి పలువాహనాలను ధ్వంసం చేశాడు. ఇతడు గతంలో నిజాం మ్యూజియం వజ్రాల బంగారు టిఫిన్‌ బాక్స్‌ చోరీచేసి పట్టుబడ్డాడు.
  • మార్చి 2  భూవివాదంలో ఓవ్యక్తిని తన గ్యాంగ్‌తో కలిసి బెదిరించిన రౌడీషీటర్‌ అష్రఫ్‌పై హుమాయున్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

Read more