పాతబస్తీకి కొత్త హంగులు

ABN , First Publish Date - 2022-04-19T17:00:47+05:30 IST

పాతబస్తీ కొత్త హంగులు అద్దుకుంటోంది. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. వంతెనలు, ఆర్‌ఓబీల నిర్మాణంతో పాటు వారసత్వ నిర్మాణాల

పాతబస్తీకి కొత్త హంగులు

నేడు బహదూర్‌పురా వంతెన ప్రారంభం

రూ.495 కోట్ల పనులకు శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు


హైదరాబాద్‌ సిటీ: పాతబస్తీ కొత్త హంగులు అద్దుకుంటోంది. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. వంతెనలు, ఆర్‌ఓబీల నిర్మాణంతో పాటు వారసత్వ నిర్మాణాల పునరుద్ధరణ, ఆధునికీకరణకు కసరత్తు మొదలైంది. మంగళవారం రూ.495 కోట్లతో వివిధ పనుల ప్రారంభోత్సవాలు, జరగనున్నాయి. చార్మినార్‌ జోన్‌ పరిధిలో ఇప్పటికే ఫలక్‌నుమా ఆర్‌ఓబీ, డీఆర్‌డీఎల్‌ గ్రేడ్‌ సెపరేటర్‌లు ప్రారంభం అయ్యాయి. మరో వంతెన అందుబాటులోకి రానుంది. రూ.108 కోట్లతో నిర్మించిన బహదూర్‌పురా ఫ్లై ఓవర్‌ను మంత్రి కె. తారక రామారావు మంగళవారం ప్రారంభించనున్నారు. పలు చారిత్రక కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులకూ శంకుస్థాపన చేయనున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా మొదటి దశలో చేపట్టిన బహదూర్‌పురా వంతెన నిర్మాణం ఆస్తుల సేకరణ ఇబ్బందులతో ఆలస్యమైంది. తొలి విడతలో 47 పనులు చేపట్టగా 30 పనులు పూర్తయ్యాయి. అందులో 13 వంతెనలు, ఏడు అండర్‌పా్‌స/ఆర్‌యూబీలు అందుబాటులోకి వచ్చాయి. 


చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు..

పలు చారిత్రక కట్టడాల పరిరక్షణ/పునరుద్ధరణ పనులు రూ.90.45 కోట్లతో చేపట్టనున్నారు. చారిత్రక సర్ధార్‌ మహల్‌ను పునరుద్ధరిస్తూ సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఆర్‌ఎ్‌ఫపీ పిలవగా పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఆ ఏజెన్సీలు సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా ఒక సంస్థను ఎంపిక చేయనున్నారు. రూ.30 కోట్లతో చేపట్టనున్న సర్ధార్‌ మహల్‌ అభివృద్ధి, మహబూబ్‌ చౌక్‌ వద్ద రూ.36 కోట్లతో చేపట్టనున్న ముర్గిచౌక్‌, రూ.21.90 కోట్లతో మీరాలం మండి పునరుద్ధరణ/ఆధునికీకరణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. రూ.2.55 కోట్లతో మీరాలం చెరువులో అభివృద్ధి చేసిన మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను ప్రారంభిస్తారు. కార్వాన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో వాటర్‌బోర్డు చేపట్టనున్న సివరేజీ పైపులైన్‌, కాలాపత్తర్‌ పోలీ్‌సస్టేషన్‌ నిర్మాణ పనులకూ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే కేటీఆర్‌ పర్యటన మధ్యాహ్నం 12.15 గంటల వరకు సాగనుంది. 


సాఫీగా సాగిపోయేలా..

బహదూర్‌పురా వంతెన అందుబాటులోకి వస్తే పాతబస్తీ నుంచి అరాంఘర్‌ వైపు వెళ్లే మార్గంలో సిగ్నల్‌ చిక్కులు లేకుండా ప్రయాణించవచ్చు. ఎంజీబీఎస్‌ నుంచి జూపార్కు, బెంగళూరు రహదారి మీదుగా శంషాబాద్‌ వైపునకు సాఫీగా సాగిపోవచ్చు. దీంతో అరగంటకుపైగా సమయం, ఇంధనం ఆదా అవుతుందని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం వర్గాలు చెబుతున్నాయి. అలాగే బహదూర్‌పురా జంక్షన్‌లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గనుంది. అరాంఘర్‌ నుంచి ఉప్పల్‌ వరకు ఓవైసీ జంక్షన్‌, బైరామల్‌గూడ, ఎల్‌బీ నగర్‌ చౌరస్తా, కామినేనిల వద్ద అందుబాటులోకి వచ్చిన వంతెనల మీదుగా గతంతో పోలిస్తే ప్రయాణం సాఫీగా సాగుతోంది.

Updated Date - 2022-04-19T17:00:47+05:30 IST