Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెద్దలను కాపాడుకుందాం!

ఆంధ్రజ్యోతి(21-07-2020)

ఇంట్లో పెద్దలు ఉంటే, వారిని చంటి పాపల్లా కాపాడుకుంటూ ఉంటాం! కరోనా ప్రబలిన సమయంలో వారిని కంటికి రెప్పల్లా కాచుకోక తప్పదు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ తేలికగా సోకే ప్రమాదం కూడా వీరికే ఎక్కువ కాబట్టి.... పెద్దల పట్ల తీసుకునే జాగ్రత్తల్లో ప్రత్యేక లకువలు పాటించాలి! ఇన్‌ఫెక్షన్‌ సోకే వీలు లేకుండా ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి!


60+ వయస్కులకు...

పెద్దల్లో చలాకీగా, హుషారుగా ఉండేవారూ ఉంటారు. ఇంటికే పరిమితమై విశ్రాంతంగా గడిపేవారూ ఉంటారు. గదికే పరిమితమై, మంచం మీద నుంచి కదలలేని వారూ ఉంటారు. వీరికి మధుమేహం, అధిక రక్తపోటు ఇతరత్రా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలూ ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పటివరకూ వీరికి సమయానికి ఆహారం, మందులు అందిస్తూ, అవసరాలు తీరిస్తే సరిపోయేది. కానీ కరోనా కాలంలో వీరికి అదనపు సేవలు అందించక తప్పదు. 60 ఏళ్లు దాటిన పెద్దలకు కరోనా ఇన్‌ఫెక్షన్‌ తేలికగా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి పెద్దల బాగోగుల విషయంలో రెట్టింపు శ్రద్ధ కనబరచాలి.


వీరికి ఎంతో కొంత ఓపిక ఉంటుంది. ఇల్లంతా తిరుగుతూ, తమ పనులు తాము చేసుకోగలుగుతారు. ఈ వయసు పెద్దలకు అధిక రక్తపోటు లాంటి ఆరోగ్య సమస్యలు సహజం. వాటికి అవసరమైన మందులు తీసుకుంటూ ఉంటారు. అయినా కుటుంబసభ్యులు కొన్ని అదనపు జాగ్రత్తలు పాటించాలి.


ఈ పెద్దల వ్యాధినిరోధకశక్తి పెంచడం కోసం మాంసకృత్తులు ఎక్కువగా ఉండే గుడ్డు తెల్లసొన, చికెన్‌, చేపలు మొదలైన వైట్‌ మీట్‌ ఎక్కువగా ఇవ్వాలి. మటన్‌ తగ్గించాలి. శాకాహారులైతే కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పులు రోజూ ఇవ్వాలి.

తాజా కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

మధుమేహం, అధిక రక్తపోటులకు మందులు వాడుతూనే ఉన్నా, తరచుగా వైద్య పరీక్షలు చేయిస్తూ, వాటిలో ఏమాత్రం హెచ్చుతగ్గులు రాకుండా చూసుకోవాలి.

నడక అలవాటు ఉంటే ఇంట్లో లేదా డాబా పైన రోజుకు కనీసం అరగంట పాటు నడిచేలా ప్రోత్సహించాలి.

పెద్దల గదిని శుభ్రంగా ఉంచాలి. 

పెద్దలు గది దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ మూడు పొరల మాస్క్‌ తప్పక ధరించేలా అలవాటు చేయాలి.

రోజు మొత్తంలో రెండు లీటర్ల మంచినీళ్లు తాగేలా చూడాలి.

పెద్దల ఆసక్తి మేరకు వారి చేత యోగా, ప్రాణాయామం చేయించాలి.


70+ వయస్కులకు...

ఈ వయసు వారు ఎక్కువ సమయం పాటు విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఎక్కువ సమయం పాటు మంచానికే పరిమితమైతే శరీరంలో స్రావాలు పేరుకుపోతాయి. ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గుతుంది. ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ వయసు పెద్దల విషయంలో....


బలవంతంగా అయినా వారికి వ్యాయామం అందేలా స్వల్ప సమయాల పాటు నడిపించాలి. వారికి ఉన్న ఓపికను బట్టి, ప్రాణాయామం కూడా చేయించాలి.

తేలికగా అరిగే వీలున్న మెత్తని పదార్థాలు తినిపించాలి.

ఆహారంలో తప్పనిసరిగా మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి.

వీలైనంత వరకూ గది దాటి రాకుండా చూసుకోవాలి.

గదిలోనే కాలకృత్యాలు తీర్చుకునే ఏర్పాట్లు చేయాలి.

పళ్లరసాలు, నీళ్లు ఎక్కువగా తాగించాలి.

గదిని పరిశుభ్రంగా ఉంచాలి. ఆ గదిలోకి కుటుంబసభ్యుల ప్రవేశాన్ని పరిమితం చేయాలి.

పెద్దలు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు తప్ప, మిగతా సమయాల్లో మాస్క్‌ తప్పనిసరిగా ధరించేలా చూడాలి.

పెద్దల గదిలోకి వెళ్లినప్పుడు సామాజిక దూరం తప్పక పాటించాలి. 


80+, మంచానికే పరిమితం అయినవారికి...

వీరి పట్ల రెట్టింపు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలను నూటికి నూరు శాతం అడ్డుకోవాలి. ఇందుకోసం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా నడుచుకోవాలి.


ఇందుకోసం...

జీర్ణశక్తి తక్కువ కాబట్టి తేలికగా అరిగే పదార్థాలు తినిపించాలి.

మంచానికే పరిమితమైన వారి ఊపిరితిత్తులలోకి ఎక్కువ గాలి చొరబడేలా చేయడం కోసం రోజులో అప్పుడప్పుడూ అరగంట పాటు బోర్లా పడుకోబెడుతూ ఉండాలి. 

ఉడకబెట్టి, ముద్దగా చేసిన పళ్ల గుజ్జు పెరుగుతో కలిపి తినిపించాలి.

పళ్లరసాలు తాగించాలి.

జావలు తాగించవచ్చు.

చల్లని పదార్థాలకు బదులుగా వేడిగా తినిపించాలి.

మెత్తగా ఉడికించిన కూరగాయలు తినిపించాలి.

ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగేలా వారి చేత స్పైరో మీటరు సాధన చేయించాలి.

మాంసకృత్తుల లోపం ఏర్పడకుండా పౌడర్ల రూపంలో ఉండే ప్రొటీన్‌ సప్లిమెంట్లు ఇవ్వాలి.

హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తితో కుటుంబసభ్యులు మెలిగే విధంగానే ఈ కోవకు చెందిన పెద్దలతోనూ మసలుకోవాలి.


కుటుంబ సభ్యులు ఇలా!

పెద్దలు ఆరోగ్యంగా ఉన్నా, అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ అదుపులోనే ఉన్నా కుటుంబసభ్యులు వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబసభ్యులు తరచుగా ఇల్లు దాటి బయట సంచరించడం తగ్గించాలి. ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతిసారీ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. పెద్దల గది బయటే శానిటైజర్‌ ఏర్పాటు చేసుకుని, దాంతో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే వారి గదిలోకి అడుగు పెట్టాలి. రెండు పొరలున్న మాస్క్‌ ధరించాలి. పనివాళ్లను ఇంట్లో అడుగు పెట్టనీయకూడదు. పెద్దలు బయటకు వెళ్లే వీలు లేకుండా, వారికి అవసరమైన వస్తువులన్నీ సమకూర్చిపెట్టాలి. కుటుంబసభ్యులందరూ తప్పక మాస్క్‌లు ధరిస్తూ, పెద్దల నుంచి కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలి.


ఈ లక్షణాలు కనిపెట్టాలి!

పెద్దల్లో కరోనా లక్షణాలు భిన్నంగా బయల్పడతాయి. సాధారణ కరోనా లక్షణాలైన దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో పాటు, లేదా ఆ లక్షణాలకు బదులుగా ఇతర లక్షణాల ద్వారా కరోనా ఇన్‌ఫెక్షన్‌ బయల్పడుతూ ఉంటుంది. అవేంటంటే.... 


ఆకలి తగ్గిపోవడం ఫ నీరసం, నిస్సత్తువ

ఒళ్లు నొప్పులు ఫ విరేచనాలు ఫ వాంతులు

రుచి కోల్పోవడం ఫ వాసన కోల్పోవడం

మత్తుగా ఉంటూ, ఎక్కువ సమయం పాటు నిద్రపోతూ ఉండడం


- డాక్టర్‌ కె. శశికిరణ్‌

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, 

యశోద హాస్పిటల్స్‌, 

సోమాజిగూడ, హైదరాబాద్‌.


పిల్లలు ఉంటే...

పెద్దలకూ పిల్లలకూ మధ్య అనుబంధం ఎక్కువ. లాక్‌డౌన్‌ మూలంగా బడులు మూతపడి పిల్లలు ఇంటికే పరిమితం అయిన ప్రస్తుత సమయంలో పెద్దల నుంచి పిల్లలను దూరం పెట్టడం కొంత కష్టం. అయినా కరోనా నుంచి పెద్దలను కాపాడుకోవాలంటే, పిల్లలు తరచుగా వారితో సన్నిహితంగా మెలగకుండా చూసుకోవాలి. ఈ విషయం పట్ల పిల్లలకు అవగాహన కల్పించి, శానిటైజర్‌ వాడకం అలవాటు చేయాలి. పెద్దలతో సామాజిక దూరం పాటించేలా పిల్లలకు శిక్షణ నివ్వాలి.


మానసిక తోడ్పాటు అవసరం!

వార్తల ద్వారా తమకు కరోనా తేలికగా సోకే వీలుందనే విషయాన్ని పెద్దలు గ్రహిస్తారు. ఇది ఒక విధంగా మంచిదే అయినా, తమకు ఆ వ్యాధి తమకు ప్రాణాంతకం అనే భయం వారిలో గూడుకట్టుకునే వీలూ ఉంది. దాంతో పెద్దలు భయాందోళనలకు లోనవుతారు. మానసికంగా కుంగిపోతారు. ఇంటికే పరిమితం కావలసిరావడం, ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల వారిలో అసహనం, చీకాకు లాంటి లక్షణాలూ తలెత్తుతాయి. అయితే ఈ సమయంలో పెద్దల ప్రవర్తనకు మిగతా కుటుంబసభ్యులు విసుక్కోకుండా, ఓపికగా వ్యవహరించాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి, అండగా నిలవాలి. ఇందుకోసం....


పెద్దలకు ఒంటరి భావన కలగకుండా వారితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి.

వారితో పాటే వారి గదిలో గడిపేటప్పుడు కూడా సామాజిక దూరం పాటించాలి, మాస్క్‌ ధరించాలి.

పెద్దల గదిలో కాలక్షేపం కోసం టి.వి, పుస్తకాలు ఏర్పాటు చేయాలి.

వార్తా ఛానళ్లు కాకుండా, ఇతరత్రా సినిమా ఛానళ్లు చూసేలా వారిని ప్రోత్సహించాలి.

చెస్‌, లూడో లాంటి ఆటలు వారితో ఆడించాలి.

సాధ్యమైనంత వరకూ కబుర్లతో, సరదా సంగతులతో కాలక్షేపం కలిగిస్తూ, వారిని ఉల్లాసంగా ఉంచాలి.


ఇక్కడ ఎక్కువ!

తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో 30ు నుంచి 40ు మంది 60 ఏళ్లు దాటిన పెద్దలు ఉన్నారు. వీరిలో అధికశాతం మంది మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాలు, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కలిగినవారే!

Advertisement
Advertisement