ఓలా, ఉబర్‌ విలీనం!?

ABN , First Publish Date - 2022-07-30T08:58:53+05:30 IST

దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్‌ క్యాబ్‌ అగ్రిగేటర్లు ఓలా, ఉబర్‌ ఒక్కటి కాబోతున్నాయని సమాచారం.

ఓలా, ఉబర్‌ విలీనం!?

ఇరువర్గాల మధ్య చర్చలు షురూ 

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్‌ క్యాబ్‌ అగ్రిగేటర్లు ఓలా, ఉబర్‌ ఒక్కటి కాబోతున్నాయని సమాచారం. ఇరువర్గాల మధ్య చర్చలిప్పటికే ప్రారంభమయ్యాయని తెలిసింది. ఓలా  సహ వ్యవస్థాపకులు, సీఈఓ భవిశ్‌ అగర్వాల్‌ ఈ మధ్యనే ఉబర్‌ యాజమాన్య ప్రతినిధులతో భేటీ అయ్యారంటూ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ది ఎకనామిక్‌ టైమ్స్‌’ తాజా కథనం పేర్కొంది. నాలుగేళ్ల క్రితమే ఈ రెండు కంపెనీలు విలీనం దిశగా చర్చలు జరిపాయి. ఈ రెండు కంపెనీల్లోనూ పెట్టుబడులు కలిగిన అంతర్జాతీయ టెక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ ఈ దిశగా ప్రోత్సహించింది. అయితే, అప్పట్లో చర్చలు ఫలప్రదం కాలేదు. కానీ, కరోనా తర్వాత పరిస్థితుల్లో భారీ మార్పులొచ్చాయి.


ఆన్‌లైన్‌ క్యాబ్‌ అగ్రిగేటర్ల సేవలకు డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. ఇంధన రేట్లు భారీగా పెరగడం ఇబ్బందులను మరింత పెంచింది. పైగా, ఈమధ్య కాలంలో మార్కెట్లోకి వచ్చిన పలు కొత్త స్టార్ట్‌పల నుంచి పోటీ పెరుగుతుండటంతో వ్యాపార వృద్ధిపై అనిశ్చితి నెలకొంది. దాంతో భారత మార్కెట్లో ఉనికిని కాపాడుకునేందుకు ఒక్కటవడమే ఉత్తమమని రెండు కంపెనీల ప్రతినిధులు భావిస్తున్నట్లుగా తెలిసింది. అయితే, ఈ విషయంపై స్పందించేందుకు రెండు కంపెనీల ప్రతినిధులు నిరాకరించారు. మరోవైపు ఎప్పటికీ విలీనం కాబోమని భవిష్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. భార త మార్కెట్లో అధిపత్యం కోసం ఓలా, ఉబర్‌ మధ్య గట్టి పోటీ సాగింది. ప్రయాణికులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లు, డ్రైవర్ల ప్రోత్సాహకాల కోసం వందల కోట్లు వెచ్చించాయి. కరోనా తర్వాత యాప్‌ ఆధారిత క్యాబ్‌ బుకింగ్‌ సర్వీసులకు డిమాండ్‌ భారీగా తగ్గడంతో ఈ రెండు కంపెనీల మధ్య పోటీ కూడా తగ్గింది. ప్రతికూలతలు పెరగడంతో వ్యయాల నియంత్రణపైనే ప్రధానంగా దృష్టి సారించాల్సి వచ్చింది. మరోవైపు ఓలా క్విక్‌ కామర్స్‌ సేవలు, యూజ్డ్‌ కార్ల వ్యాపారాల నుంచి వైదొలిగింది.1,000మంది ఉద్యోగులకూ ఉద్వాసన పలికింది. 

Updated Date - 2022-07-30T08:58:53+05:30 IST