ఒకేబాటలో.. గ్లాసు, కమలం.. బెజవాడలో జనసేన బతకాలంటే..

ABN , First Publish Date - 2022-06-23T06:25:48+05:30 IST

బీజేపీ, జనసేన ఒకే గూటి కింద ఉన్న పార్టీలు. ప్రస్తుతం కలిసి నడుస్తున్నాయి. విజయవాడలో మాత్రం ఈ రెండు పార్టీల తీరు దేనికీ..

ఒకేబాటలో.. గ్లాసు, కమలం.. బెజవాడలో జనసేన బతకాలంటే..

- జనసేనలో అంతర్గత అలకలు

- పోతిన వన్‌మెన్‌ షో

- బీజేపీదీ అదే తీరు

- చిరునామా లేని జిల్లా అధ్యక్షుడు బొబ్బూరి

- నేటికీ ఏర్పాటు కాని డివిజన్‌ కమిటీలు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ): బీజేపీ, జనసేన ఒకే గూటి కింద ఉన్న పార్టీలు. ప్రస్తుతం కలిసి నడుస్తున్నాయి. విజయవాడలో మాత్రం ఈ రెండు పార్టీల తీరు దేనికీ తీసిపోవడం లేదు. జనసేన పార్టీలో మొత్తం వన్‌మెన్‌ షో కనిపిస్తోంది. బీజేపీకి ఎన్జీఆర్‌ జిల్లా సారథిగా ఉన్న బొబ్బూరి శ్రీరామ్‌ చిరునామా ఎక్కడా కనిపించడం లేదు. పార్టీలో ప్రముఖుల పర్యటనలప్పుడు మాత్రమే ఆయన కనిపిస్తున్నారు. ఈ రెండు పార్టీల నేతల తీరుతో కార్యకర్తలు నీరసించిపోతున్నారు. పవన్‌ కల్యాణ్‌ జనసేనను ఏర్పాటు చేసిన తర్వాత 2019 ఎన్నికల్లో ఉత్సాహంగా నాయకులు ముందుకొచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఎటు వెళ్లిపోయారో తెలియని పరిస్థితి. ఆ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోతిన మహేశ్‌, తూర్పు నియోజకవర్గం బత్తిన రాము పోటీ చేశారు. సెంట్రల్‌ నియోజవర్గాన్ని పొత్తులో భాగంగా సీపీఎంకు కేటాయించారు. ఇందులో పశ్చిమ నియోజకవర్గంలో మాత్రమే పోతిన మహేశ్‌ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. తూర్పు అభ్యర్థి ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి.




ఆ ఎన్నికల్లో సెంట్రల్‌ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నలుగురైదుగురు ఆశపడ్డారు. ఆ తర్వాత నుంచి సెంట్రల్‌ నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలు ఏమీ కనిపించలేదు. ఇప్పుడిప్పుడే జనసేనకు డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. నగర కమిటీ అధ్యక్షుడు పోతిన మహేశ్‌ తీరుతో కొంతమంది నేతలు పొసగలేకపోతున్నారని ప్రచారం నడుస్తోంది. నగర కమిటీ అధ్యక్షుడితోపాటు రాష్ట్ర అధికార ప్రతినిథి పదవిలోనూ ఆయన కొనసాగుతున్నారు. ఈ పదవిలో లోగడ ఆకుల కిరణ్‌ కొనసాగేవారు. ఆయనను తప్పించి అధికార ప్రతినిథిని పోతిన చేతిలో పెట్టారు. దీని వెనుక మహేశ్‌ పాత్ర ఉందని పార్టీ వర్గాలు చెపుకుంటున్నాయి. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కిరణ్‌ సతీమణి జనసేన నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత నుంచి కిరణ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కోసం ఆశిస్తున్న మరో నేత పోతిన మహేశ్‌ తీరును విమర్శిస్తున్నట్టు సమాచారం. పార్టీ కార్యకర్తలతో సమావేశాలను మహేశ్‌ పశ్చిమలో ఉన్న తన కార్యాలయంలోనే నిర్వహించుకుంటున్నారు. జనసేన పార్టీకి నగరంలో జిల్లా కార్యాలయం లేదు. దాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన సారథుల్లో ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే నిరసన కార్యక్రమాలను మహేశ్‌ పశ్చిమ నియోజకవర్గంలోనే చేపడుతున్నారు. నగర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కలిపి నిరసన కార్యక్రమాలు, ఆందోళనలను నిర్వహించిన దాఖలాలేవు.




నేతల తీరు ఈవిధంగా ఉంటే, కార్యకర్తల్లో కొత్త జోష్‌ ఎక్కడి నుంచి వస్తుందన్న అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. బీజేపీ ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ పరిస్థితి మాత్రం జనసేన కంటే దారుణంగా ఉంది. జిల్లా విభజనకు ముందు విజయవాడకు చెందిన బొబ్బూరి శ్రీరామ్‌ను విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటుతో ఆయన జిల్లా అధ్యక్షుడిగా మారిపోయారు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాస్థాయి సమావేశాలు గానీ, నియోజకవర్గ స్థాయి సమావేశాలు గానీ నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు. ఇంతవరకు విజయవాడ నగరంలో డివిజన్లకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేయలేదు. బీజేపీ, జనసేన రాష్ట్రంలో దోస్తీగా ఉన్న ఈ రెండు పార్టీల నేతలు నగరంలో సంయుక్తంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టలేదు. నగరానికి ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉన్న కార్పొరేషన్‌లో జరుగుతున్న అక్రమాలపై జనసేన నేతలు నోరు విప్పుతున్నా, కమలనాథులు మాత్రం మౌనవ్రతం చేస్తున్నారు.




నగరంలో బీజేపీ రాష్ట్ర కమిటీ చేసిన ఆందోళనలు తప్ప జిల్లా కమిటీ సొంతం గా ఏ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించలేకపోవడంతో పార్టీలోని పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. బొబ్బూరి శ్రీరాం కేంద్రమంత్రులు వచ్చినప్పుడు, జాతీయస్థాయి నేతలు వచ్చినప్పుడు కాసేపు హడావుడి చేసి మాయమవుతున్నారని రాష్ట్ర కమిటీ నేతలే చెబుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో పార్టీ సమస్త బాధ్యతలను తానే చూసుకుంటానని భుజాన వేసుకున్న బొబ్బూరి తీరు ఇప్పుడు పార్టీలోని సీనియర్లకు, అగ్రనేతలకు నచ్చడం లేదు. జనసేన, బీజేపీ నేతలు తీరు మార్చుకుని ప్రజల్లోకి వెళ్తారా, మా మాటే శాసనం అన్నట్టుగా వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.

Updated Date - 2022-06-23T06:25:48+05:30 IST