రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాలకు ఓకే

ABN , First Publish Date - 2020-05-23T09:04:44+05:30 IST

జూన్‌ ఒకటో తేదీ నుంచి కొన్ని రైళ్లని ప్రారంభిస్తోన్న రైల్వే శాఖ ఈ-టిక్కెట్‌ బుకింగ్‌ ప్రక్రియలో

రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాలకు ఓకే

జిల్లాలో నాలుగు కేంద్రాలు ప్రారంభం

ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం

గుంటూరు, నంబూరు, మంగళగిరి, కృష్ణాకెనాల్‌లో బుకింగ్‌ సౌకర్యం


గుంటూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): జూన్‌ ఒకటో తేదీ నుంచి కొన్ని రైళ్లని ప్రారంభిస్తోన్న రైల్వే శాఖ ఈ-టిక్కెట్‌ బుకింగ్‌ ప్రక్రియలో ప్రయాణికుల ఇబ్బందులు దృష్ట్యా కొన్ని పీఆర్‌ఎస్‌ కౌంటర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం ఉదయం నుంచే జిల్లాలో నాలుగు ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ కేంద్రాలను తెరిచింది. అవి గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో గుంటూరు, మంగళగిరి, నంబూరు కాగా విజయవాడ డివిజన్‌ పరిధిలో కృష్ణాకెనాల్‌ ఉన్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన రైలు సర్వీసులను సాధారణ స్థితికి తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. తొలుత ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌/మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే బుకింగ్‌ని అనుమతిస్తామని చెప్పిన అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం పరిమిత సంఖ్యలో పీఆర్‌ఎస్‌ కౌంటర్లు కూడా తెరవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఈ విషయం తెలియక చాలామంది టిక్కెట్‌ కౌంటర్ల వద్దకు రాలేకపోయారు.


రైల్వేకి రిజర్వేషన్‌ టిక్కెట్‌ రూపంలో ప్రధాన ఆదాయ వనరు. అదే ఐఆర్‌సీటీసీ బుకింగ్‌ ద్వారా అయితే కొన్ని చార్జీలు వాళ్లకి చెల్లించాలి.  ప్రయాణికులు ఒక్కో స్లీపర్‌ క్లాస్‌ టిక్కెట్‌పై రూ.17కు పైగా చెల్లించాలి. అదే ఏసీ తరగతులు అయితే రూ.30 నుంచి 35 వరకు సర్వీసు ట్యాక్స్‌ చెల్లించాలి. గుంటూరు - విజయవాడ ప్రత్యేక రైలు బుకింగ్‌ టిక్కెట్‌ రూ.25 కాగా ఐఆర్‌సీటీసీ చార్జీలు కలుపుకుని అది రూ. 43కు చేరుకొన్నది. అదే పీఆర్‌ఎస్‌ కౌంటర్‌లో బుకింగ్‌ చేసుకొంటే రూ.25తోనే టిక్కెట్‌ పొందవచ్చు.


వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొన్న రైల్వే శాఖ పీఆర్‌ఎస్‌ కౌంటర్లను ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకొన్నది. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో రైల్వే టిక్కెట్‌ కౌంటర్‌ సాయంత్రం 6 వరకు తెరిచి ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రైల్వే టిక్కెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలని బఫర్‌ ఏరియాల్లో నివాసం ఉంటోన్న వారు కోరుతున్నారు. పీఆర్‌ఎస్‌ కౌంటర్లతో పాటు కామన్‌ సర్వీసు సెంటర్లు, టిక్కెటింగ్‌ ఏజెంట్లు, పోస్టాఫీసులు, యాత్రీ టికెట్‌ సువిధ కేంద్ర, ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా కూడా బుకింగ్‌కు అవకాశం కల్పించారు. పీఆర్‌ఎస్‌ కౌంటర్లలో కూడా సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరిస్తేనే అనుమతిస్తామని అదికారులు తెలిపారు. అలానే శానిటైజర్లు కూడా వినియోగించాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-05-23T09:04:44+05:30 IST