ఒక ఉపాధ్యాయుడి స్వగతం

ABN , First Publish Date - 2022-08-01T06:08:16+05:30 IST

తెలియజేయడం ఉపాధ్యాయుడిగా నా బాధ్యత అని తెలుసుకున్నాక అంతవరకూ ఏమేమి ఎంతెంత తెలుసుకున్నానో...

ఒక ఉపాధ్యాయుడి స్వగతం

తెలియజేయడం ఉపాధ్యాయుడిగా నా బాధ్యత అని 

తెలుసుకున్నాక అంతవరకూ ఏమేమి ఎంతెంత తెలుసుకున్నానో 

తెలుసుకోవడం మొదలుపెట్టాను


తెలుసుకున్నది అత్యల్పమని ఆత్మగతంగా తెలియడమే 

తొల్దొల్తగా తెలుసుకోవాల్సిన సంగతని తెలుసుకున్నాను

తెలిసీ తెలియని దాన్ని అంతా తెలిసినట్టు తెలపబోవడం 

తెలివిమాలిన పని అని మెలమెల్లని మెలకువలో తెలుసుకున్నాను 


తేటతెల్లంగానే తెలుపుతున్నానని నేనెంత తలచినా ఒకోపరి

తమకు తెలియట్లేదని ఛాత్రులు దిగులు చూపుల్తో తెలిపినపుడు 

తెలియడమే కాదు తేటగా తెలపడానికి తగు తెరువేమిటో కూడా

తర్కించి తర్కించి తెలుసుకోవాలని తెలుసుకున్నాను


తెలుసుకున్నాననుకున్నది పూర్ణంగా తెలుసుకున్నట్టు కాదని

తెలుసుకునే ప్రయాణంలో అసలు దేన్నీ పూర్ణంగా తెలుసుకోలేమని 

తెలుసుకున్నాను 


తెలివిడి గడించిన విజ్ఞులు ముఖతః తెలపదలచనివో 

తెలపదలచినా తెలపలేకపోయినవో తపనతో గ్రంథపత్రాల్లో కూర్చి 

తెలిపారని వాటిని తరచు తరచూ తెరిచి తెరిచీ తెలుసుకున్నాను


తాళపత్రాలూ పొత్తాలూ తెలియజేయని పలు తత్వాల్నీతాత్పర్యాల్నీ

తళుకుల కళ్లూ కరచాలనాలూ కల్మిడులూ కలబోతలూ తెలుపుతాయని

తరాల విద్యార్థిగణాల్తో సహయానం చేస్తూచూస్తూ తెలుసుకున్నాను

తెలిపే వేళల్లోనే ఎదుటి తెలివిడి నుంచి తెలుసుకోవడం 

తప్పని సరి అని తరగతుల పదగతుల నుంచి తెలుసుకున్నాను


తరగతి గదిలో తెలపడం కోసం దూర దూరాల తీరు తీరైన లోకాల్ని 

తనివి తీరా తిరిగీ తిరిగీ లోతుల్ని తెలుసుకుని రావాలని 

తీర్థవాసినై సంచారానుభవ సంపద పొంది తెలుసుకున్నాను


తెలుసుకునీ తెలుసుకునీ తెలుసుకోవడమే అసలు తెలివిడి అని 

తెలుసుకున్న ఉత్తర క్షణాన్నే విశేష తత్వజ్ఞుడొకరు 

తనకున్న ‘విశ్వోపాధ్యాయ’ గౌరవపీఠాన్ని తటాలున త్యజించాడని

తొల్లి నేను తెలుసుకున్న సత్యకథనంలోని తాత్విక సారాంశాన్ని

తోవ చాలా నడిచాక పరుచుకున్న వెలుతురులో తెలుసుకున్నాను


తెలపడమనే తపస్సులో తన్మయమవుతూనే ఎప్పుడూ ఎంతెంతో

తెలుసుకునే ఒక పవిత్ర యాత్రే బోధన అని కడకు తెలుసుకున్నాను


తీరిగ్గా ఇపుడీ విశ్రాంత తీరంలో తిరుగాడుతూ వెనక్కి తిరిగి 

తరచి తరగతి గదిని తెరిచి తలుచుకుంటున్నపుడు 

తెలిపిందేమిటో అంతగా నా స్మృతికి అందడం లేదు కానీ

తెలుసుకున్నదే తెలుపు దారై నన్ను నడిపిస్తున్నది


తెరువరి ఒకడిపుడే నాకెదురై నమస్కరించి అన్నాడు కదా!

‘‘తదేక నిష్ఠతో మీరు చేసిన జ్ఞానబోధనే నా బతుక్కి ఒక 

తెరువును చూపింది ఆరని దీపమై, ధన్యవాదాలు గురువు గారూ!’’


తలపుల జల్లులో ఉల్లాసంగా తడుస్తూ అతనితో అన్నానిలా-

‘‘తెలుసుకున్నదాన్నే నీకు బోధించాను, తెలుసుకుని తీరాలనే 

తరగని తపనే నిన్ను తెలుసుకునేలా చేసిందని తెలుసుకోవయ్యా

తెలుసుకోవడం నిరంతర జీవనావసరం, తెలుసుకుంటూ సాగు’’ 


తృప్తిచూపుతో సాగిపోయాడతను, మరో మారు ప్రణమిల్లి-


తెలుసు నాకు - అతని కృతజ్ఞతాపూర్వక వినమ్ర ప్రణామం 

తెరల్లేని అత్యుత్తమ బోధనాశాల ఐన 

                  ఈ అద్భుత విశ్వానికే చెందుతుందని-

తానూ బహుశా తెలుసుకుంటాడు, 

                   ఏదో ఒక మజిలీ దగ్గర లోచింతనలో!

దర్భశయనం శ్రీనివాసాచార్య, 94404 19039


Updated Date - 2022-08-01T06:08:16+05:30 IST