Abn logo
Aug 5 2020 @ 03:30AM

ఒక సూర్యుండు..

‘నిన్ను నీవు తెలుసుకుంటే, అన్నీ తెలుసుకున్నట్లే’! ఎంత నిజం? మనం ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టి అన్నీ తెలుసుకుంటాం. ఆ ప్రయత్నంలో మనల్ని మనం మరచిపోతాం! చివరికి మనమేమిటో తెలుసుకోకుండానే మరణిస్తాం. అదే విధంగా ఒక్కోరోజు ఎంతో ఆనందంగా నిద్ర లేస్తాం. మరొకరోజు కారణం లేకుండానే ఎంతో విచారంగా, దుఃఖంగా, నిరాశగా నిద్ర లేస్తాం. రోజేమిటి! ఒక క్షణం విచారం, మరుక్షణమే పట్టలేనంత ఆనందం మనల్ని మరపింపచేస్తాయి. జీవితం మనం కోరుకున్నట్లుగా, అనుకూలంగా, నీటివాలు ప్రవాహంలా సాగినంతసేపూ, అంతా మన ప్రయోజకత్వమని అనుకుంటాం. అనుకున్నదాని కంటే కాస్త భిన్నంగా జరిగితే, చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ, సమాజాన్నీ, కుటుంబాన్నీ, కనబడని దైవాన్నీ నిందిస్తాం. కలలు కంటాం. వాస్తవ స్థితి భిన్నంగా ఉన్నప్పుడు నిరాశ చెందుతాం. ఎత్తుపల్లాలు, చీకటి వెలుగులు, కలిమి లేములు, ఆనంద విషాదాలు, జనన మరణాలు మనను నిరంతరం ఆడిస్తుంటాయి. ఇది ఈనాటి మాట కాదు. మానవుడు నాగరికతత నేర్చిన క్షణం నుంచీ సాగుతున్నదే. అయితే మానవుణ్ని ఈ మానసిక స్థితి నుంచి, శాశ్వత ఆనందం వైపు, నిజమైన సుఖం వైపు నడిపించడానికి ఆయా దేశ, కాల పరిస్థితుల ననుసరించి, మహా పురుషుడొకడు అవతరించి, జాతిని కర్తవ్యోన్ముఖుణ్ని చేస్తాడు.


ఆధ్యాత్మ కేవలం వయసు మళ్లిన వారికేనని, మరణానంతర కైవల్యం కోరిన వారికని, పుణ్యలోక ప్రాప్తికని భావించినవారికి నిజమైన ఆధ్యాత్మ మనం మనంగా, అంటే మనిషి మనిషిగా బ్రతకడమని, ఈ ప్రపంచంలోనే ఉండి, మనల్ని మనం సంస్కరించుకోవాలని,  తెలియజెప్పిన జ్ఞానమూర్తి సత్యసాయి. సుఖమంటే దుఃఖం లేకపోవటం కాదని, సంతోషమంటే వస్తువులిచ్చే సంతోషం కాదని, ఆనందం, హృదయానికి సంబంధించినదని, మాటలన్నీ, ‘అసలు’ను దాచి ఉంచే పొరలనీ, తెరలనీ, మౌనం శక్తిమంతమైనదని, మౌనం మనను మన లోపలకు ప్రయాణం చేయించే ‘నావ’ అని, జరగవలసినది జరుగక మానదని, జరగకూడనిది ఎంత ప్రయత్నించినా, మనమనుకున్నట్లు జరగదని.. తన జీవన విధానమే ఆధారంగా, సోదాహరణంగా చెప్పిన మహాద్భుతమూర్తి ఆయన.


చేసే పనులన్నీ అనందంగా, ఇష్టపూర్వకంగా చేయాలని.. అనుకున్నట్లు జరగనపుడు కుంగిపోరాదని విశదపరచిన మధురమూర్తి. మానవత్వం పరిపూర్ణంగా వికసిస్తే, ఆచరణలో అభివ్యక్తమైతే అదే దైవత్వమని సూత్రీకరించిన స్వామి.. ఏది నీ ఆనందాన్ని అడ్డుకుంటున్నదో, ఏది నీ దుఃఖానికి కారణమౌతున్నదో, ఆ మనసును గుర్తెరిగి, ఆలోచనలు నియంత్రించుకుని మనసును అదుపులో ఉంచుకుని, సుఖదుఃఖాలకు అదరని, బెదరని, చెదరని మనోస్థితిని సాధించుకోవాలని బోధించారు. సర్వ మానవులు, సర్వజీవులూ ఆత్మ స్వరూపాలేనని, సర్వజీవ సమభావన అందరూ ఆచరించవలసిన అధ్యాత్మయోగమని అభిలషించిన అద్వైతమూర్తి స్వామి. జీవితం చివరి రోజుల్లో ఎదురుచూసే ఆ జ్ఞానయోగ ఫలితాన్ని, చిన్న వయసు నుండే పొందటం ప్రారంభిస్తే, జీవితమంతా ఆనందమయమేననే మహాపరిసత్యాన్ని బోధించి, ఆచరించి మార్గం చూపిన సత్యబోధకుడు స్వామి.

 వి.ఎ‌స్‌.ఆర్‌.మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Advertisement
Advertisement
Advertisement