ఒక చలిపద్యం

ABN , First Publish Date - 2021-01-18T10:22:31+05:30 IST

బంగారు సూర్యద్రవపు పారదర్శక గ్లాసులో వేసిన మంచుముక్క...

ఒక చలిపద్యం

బంగారు సూర్యద్రవపు

పారదర్శక గ్లాసులో 

వేసిన మంచుముక్క

చూస్తుండగానే నిరాకారమై నిర్వీర్యమై 

రూపం కోల్పోయినట్టు

కంటితో ఎన్నడూ చూడని

కడుపు లోపలి పేగుల్లోంచి

మొదలవుతోంది చలి!


చుట్ట చుట్టుకునే ఆసామి

మడతలు పెట్టి కాడతోనే ముడివేసిన

పొగాకురెక్కను

కాలి బొటనవేలి మధ్య అదిమిపట్టి

పొరలుపొరలుగా విప్పదీసినట్టు

శరీరాన్ని పొద్దుపొడుపుటెండలో

బేరన్‌లో పొగాకులా వేలాడదీస్తున్నాను.


సంగీతంలో సరళీస్వరాలను 

సాధన చేస్తున్న పిల్లలగుంపులా

తెల్లవారక ముందే కువకువల వేకువస్వరాలతో

సందడి చేసే పక్షుల కోమల కంఠాలకు

కనపడని వేటగాడెవడో

చలిఉచ్చులను బిగించాడు.


జాతరకు ముందు

మంటేసి డప్పుల్ని కాకపెట్టినట్టు

ఢిల్లీలో రైతులు 

వీధి మలుపులో వేసిన చలిమంట ముందు

దేహాల్ని వెచ్చ చేసుకుంటున్నారు

వాళ్లు గమనించలేదు గానీ

ఆ గుంపులో వాళ్లకు మద్దతుగా

మబ్బుగొంగడి ముసుగేసుకుని

సూర్యుడు కూడా గొంతుక్కూచున్నాడు.


కరోన కట్టడి వీళ్ల వలన కాదని

దివి నుండి దిగివచ్చిన అశ్వనీదేవతలు 

వేసిన పరిమళభరిత ఔషధ ధూపంలా

భువి అంతటా ఆవరించిన తెలిమంచు


చలిని పులితో పోల్చడం పాత కవిసమయం

చలి ఇప్పుడు అనన్వయాలంకారం


ఇప్పుడు అక్షరాలను

చెకుముకిరాళ్లుగా చేసే పనిలో 

నిమగ్నమయి ఉన్నాను.


అమృతభాండం మాటేమో గానీ,

ఇప్పుడు ఎవరైనా చేతుల్లో

ఒక అగ్నిభాండం పెడితే బాగుండును.

శిఖామణి

Updated Date - 2021-01-18T10:22:31+05:30 IST