వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త వ్యూహం? ఆ నలుగురితో సరి!

ABN , First Publish Date - 2022-01-22T07:48:42+05:30 IST

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు విషయాలు బయటపడకుండా ‘వాదనల వ్యూహం’ రచించారా? పెద్ద తలలను కాపాడుతూ...

వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త వ్యూహం? ఆ నలుగురితో సరి!

దస్తగిరి అప్రూవర్‌పై వింత వాదనలు

క్లైంటునే హంతకుడిగా తేల్చేలా

వాదించిన నిరంజన్‌ రెడ్డి

వాచ్‌మ్యాన్‌ రంగయ్యే సాక్ష్యమని వెల్లడి

‘పెద్దల’ పేర్లు బయటికి రావొద్దనేనా?

వాదనల తీరుపై న్యాయ వర్గాల్లో చర్చ


అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు విషయాలు బయటపడకుండా ‘వాదనల వ్యూహం’ రచించారా? పెద్ద తలలను కాపాడుతూ... ఇతరులనే దోషలుగా చూపించి, ‘వీరే హంతకులు. అంతటితో సరిపెట్టండి’  అనేలా ‘క్లూ’లు ఇస్తున్నారు. ఈ కేసులో దస్తగిరిని అప్రూవర్‌గా మార్చొద్దంటూ 

హైకోర్టులో జరిగిన వాదనల తీరు చూస్తే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. ఈ కేసులో దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవద్దంటూ మిగిలిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. స్థానిక కోర్టు వీరి వాదనలను తోసిపుచ్చింది. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించింది. దీనిని గంగిరెడ్డి, ఉమా శంకర్‌ రెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసులో గురువారం విచారణ జరిగింది. ఉమాశంకర్‌ రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదించారు.


 ఆయన గతంలో అక్రమాస్తుల కేసుల్లో జగన్‌ తరఫున వాదనలు వినిపించారు. వైసీపీ సర్కారు ఆయనకు మెచ్చి పలు ప్రభుత్వ కేసులు అప్పగించి, భారీగా ఫీజులు కూడా చెల్లించింది. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చేందుకు వీల్లేదని చెబుతూ... పరోక్షంగా, తన క్లైంటు ఉమా శంకర్‌ రెడ్డి కూడా హంతకుల్లో ఒకరనేలా నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఆ రోజు నలుగురు నిందితులు వివేకానంద రెడ్డి ఇంట్లోకి వెళ్లడం వాచ్‌మ్యాన్‌ రంగయ్య చూశారు. ఆ నలుగురు ఇంట్లో నుంచి తిరిగి రావడం కూడా చూశాడు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా... వివేకానంద రెడ్డి మృతదేహం కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడే నిందితులను అప్రూవర్‌గా మార్చాలి. ఈ కేసులో వాచ్‌మ్యాన్‌ రంగయ్య ప్రత్యక్షసాక్షిగా ఉండగా... కోట్లు కిరాయి తీసుకుని హత్య చేసిన దస్తగిరిని అప్రూర్‌గా ఎలా అనుమతిస్తారు?’’... ఇదీ స్థూలంగా నిరంజన్‌ రెడ్డి వినిపించిన వాదన. వెరసి... వివేకానంద రెడ్డిని ఆ నలుగురే చంపేశారని ఆయన చెప్పినట్లయింది. మరి ఈ వాదనలను రికార్డు చేయమంటారా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించినప్పుడు ఆయన సూటిగా స్పందించకుండా దాటవేశారు.


అంతకుమించి పోకుండా...

ఈ కేసును ఆ నలుగురికే పరిమితం చేసి... ‘ఆపైన’ ఉన్న వారి పేర్లు బయటికి రాకుండా చూస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ దర్యాప్తు సంస్థ అయినా ‘వీళ్లే హంతకులు’ అని కేసు మూసేయదు. హత్య వెనుక ఎవరున్నారు? చంపేందుకు డబ్బులు ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఇలాంటివి తేల్చాలి. నేరం వెనుక ‘ఉద్దేశం/లక్ష్యం’ (మోటివ్‌) తేల్చడం చాలా ముఖ్యం. వివేకానంద రెడ్డి హత్యకేసులో ఈ ‘మోటివ్‌’ తేల్చి, అసలు సూత్రధారులను గుర్తించే దిశగా సీబీఐ చురుగ్గా కదులుతోంది. నలుగురు నిందితులు లోపలికి వెళ్లి, బయటికి రావడం వరకే వాచ్‌మ్యాన్‌ రంగయ్య చూశాడు. హత్యకు ఆయన ప్రత్యక్ష సాక్షి కాదు. పైగా... వివేకానంద రెడ్డిని ఎవరు, ఎందుకు చంపించారనేది ఆయనకూ తెలియదు. అవి చెప్పగలిగేది దస్తగిరి మాత్రమే. అందుకే... దస్తగిరిని అప్రూవర్‌గా మార్చాలని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి ప్రమేయం గురించి బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు... అవినాశ్‌ రెడ్డిని నేరుగా ముఖ్యమంత్రి జగన్‌ వెనకేసుకొచ్చారు. ‘ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా’ అంటూ అవినాశ్‌ రెడ్డికి ఈ హత్యతో ఏమాత్రం సంబంధంలేదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో... అప్రూవర్‌పై వాదనల సందర్భంగా ఈ కేసును నలుగురికే పరిమితం చేసే ప్రయత్నం జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇంకెవరి పేర్లూ బయటికి రాకుండా, అక్కడితో ముగించి, సాదాసీదా వ్యక్తులకే శిక్ష పడేలా చేసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగమని చెబుతున్నారు.



Updated Date - 2022-01-22T07:48:42+05:30 IST