Abn logo
May 21 2020 @ 23:41PM

పోస్ట్‌ ప్రొడక్షన్‌కు ఓకె.. షూటింగ్స్‌పై త్వరలో నిర్ణయం

మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో గురువారం ఉదయం తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న సినిమాల షూటింగ్స్‌ ఎప్పుడు ప్రారంభించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం శ్రీనివాస యాదవ్‌ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ ‘‘సినిమా పరిశ్రమ విషయంలో రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ నెలాఖరువరకూ లాక్‌ డౌన్‌ ఉంది. అయితే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎలాంటి అడ్డంకులూ లేవు. రేపటి నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకోవడానికి  అనుమతించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్కులు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. భౌతిక దూరం పాటించాలి.  షూటింగ్‌ ప్రదేశాల్లో ముందస్తు జాగ్రత్తలపై పరిశ్రమ పెద్దలు మాట్లాడారు. లాక్‌డౌన్‌ లోపు జాగ్రత్తలు పాటిస్తూ చిత్ర పరిశ్రమ చేసే మాక్‌ షూటింగ్‌కు అవసరమైన సహకారం అందిస్తాం. థియేటర్లు ప్రారంభం కాగానే ప్రేక్షకులు వస్తారా? లేదా? అనేది ఒక సమస్యగా ఉంది. షూటింగులకు అనుమతి ఇచ్చే విషయాన్నీ, థియేటర్లు తెరిచే అంశాన్నీ ముఖ్యమంత్రిగారితో చర్చిస్తాం. ఒకట్రెండు రోజుల్లో అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకుంటాం’’ అన్నారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, సురేశ్‌బాబు, సి.కల్యాణ్‌, దిల్‌ రాజు, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, ఎస్‌.రాధాకృష్ణ, సుప్రియ, రవికిశోర్‌, కిరణ్‌, రాజమౌళి, వివి వినాయక్‌, త్రివిక్రమ్‌, కొరటాల శివ, ఎన్‌.శంకర్‌, రామ్మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 


లాక్‌డౌన్‌ పూర్తి కావస్తున్న తరుణంలో ప్రభుత్వం కొన్ని రకాల పరిశ్రమలకు,  సంస్థలకు  కొన్ని మినహాయింపులు ఇచ్చి పని చేసుకోవడానికి అవకాశం కల్పించింది.  మనం షూటింగులు ప్రారంభించడానికి ఎవరి అనుమతీ అవసరం లేదు. కానీ కరోనా వ్యాప్తి చెందడానికి మనం కారణం కాకూడదనే చిన్న భీతితో ప్రభుత్వం చెప్పే నియమనిబంధనలకు అనుగుణంగా, అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సినిమా షూటింగ్‌ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న పది పదిహేను చిత్రాల కోసమో, షూటింగ్‌ మధ్యలో ఉన్న నిర్మాతల కోసమో కాకుండా  సినిమాల మీదే ఆధారపడిన 14 వేల మంది సినీ కార్మికులను  దృష్టిలో పెట్టుకుని షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కోరుతున్నాం. 

చిరంజీవి


వేలాది జనంతో షూటింగ్‌ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రభుత్వం అనుమతి ఇస్తే  మొదట తక్కువ మంది ఆర్టిస్టులతో చిన్న సీన్లు, తక్కువ మంది టెక్నీషియన్లతో షూటింగ్‌ చేస్తాం. 

రాజమౌళి


రేపటి నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసుకొనేవిధంగా మంత్రి శ్రీనివాస యాదవ్‌  అనుమతి ఇచ్చారు. షూటింగ్స్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వివరిస్తూ అవుట్‌డోర్‌, ఇండోర్‌ షూటింగ్‌లకు సంబంధించిన  మాక్‌ వీడియో తీసి ప్రభుత్వానికి పంపిస్తాం. ఏ ఏ చిత్రాల షూటింగ్స్‌ ఎన్ని రోజులు పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను చిరంజీవిగారితో కూర్చుని చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సినిమా థియేటర్లు ఎప్పటినుంచి ప్రారంభించాలో అనేది పరిశ్రమే ఒక నిర్ణయం తీసుకొని చెప్పాలని మంత్రి కోరారు. 

సి. కల్యాణ్‌, నిర్మాతల మండలి అధ్యక్షుడు


Advertisement
Advertisement
Advertisement