డ్యాముల భద్రత బిల్లుకు ఓకే

ABN , First Publish Date - 2021-12-03T08:52:26+05:30 IST

డ్యాం సేఫ్టీ బిల్లును పార్లమెంటులో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రాల హక్కులను హరించడమని ప్రతిపక్షాలు మం డిపడ్డాయి.

డ్యాముల భద్రత బిల్లుకు ఓకే

  • ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య రాజ్యసభ ఆమోదం..
  •  దేశంలో నిర్దిష్ట ఆనకట్టలు కేంద్రం పరిధిలోకి
  • నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ, జాతీయ కమిటీ ఏర్పాటు
  • రాష్ట్ర స్థాయిలోనూ ఇటువంటి విభాగాలు
  •  సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న విపక్షాలు 
  • డ్యాములు రాష్ట్ర జాబితాలోని అంశం
  • కేంద్రం చట్టాలు చేయడమా?: విపక్షాలు


న్యూఢిల్లీ, డిసెంబరు 2: డ్యాం సేఫ్టీ బిల్లును పార్లమెంటులో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రాల హక్కులను హరించడమని ప్రతిపక్షాలు మం డిపడ్డాయి. దానిని సెలక్ట్‌ కమిటీ పరిశీలనకు పంపాలని కాంగ్రెస్‌, తృణమూల్‌ సహా డీఎంకే డిమాండ్‌ చేశాయి. డ్యాములు రాష్ట్ర పరిధిలోని అంశమని, వాటి పై కేంద్రం చట్టాలు చేయజాలదని స్పష్టం చేశారు. డ్యాముల భద్రత, నిర్వహణను రాష్ట్రాలు చూసుకోగలవని తెలిపారు. కానీ, ప్రతిపక్షాల ఆందోళనలను పట్టించుకోకుండానే దేశంలో నిర్దిష్ట డ్యాముల భద్రతకు సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న బిల్లును రాజ్యసభ ఆమోదించింది. నిజానికి, 2019 ఆగస్టు 2వ తేదీన డ్యాం భద్రత బిల్లు, 2019కు లోక్‌సభ అంగీకారం తెలిపింది. రెండు సవరణలతో రాజ్యసభ కూడా గురువారం ఆమోదం తెలిపింది. వాటిలో ఒకటి బిల్లు పేరులో ‘2019’ సంవత్సరాన్ని ‘2021’గా మార్చారు. రాజ్యసభలో సవరణలు చేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ బిల్లు మరోసారి లోక్‌సభకు వెళ్లనుంది.


బిల్లులో ఏముంది..!?

డ్యాములు కొట్టుకుపోయి భారీ విపత్తులు సంభవిస్తూ ఉంటాయి కదా! అటువంటి వాటిని నివారించడానికి దేశంలోని నిర్దిష్ట డ్యాములపై నిఘా పెట్టడం, తనిఖీ చేయడం, ఆపరేషన్‌, నిర్వహణ తదితరాలను చూడడమే బిల్లు లక్ష్యం. ఇందుకు జాతీయ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు డ్యాముల భద్రతకు సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమూ ఇందులో భాగమే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని డ్యాములను బోర్డుల ద్వారా కేంద్రం తన అధీనంలోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లు ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పడుతుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన రాష్ట్రాలు, వ్యక్తులపై జరిమానాలు విధించే అధికారం ఆ యంత్రాంగానికి ఉంటుందని చెప్పారు. ఇక, డ్యాముల భద్రతపై జాతీయ కమిటీ (ఎన్సీడీఎస్‌) జాతీయ స్థాయిలో మేథో మధన విభాగంగా పని చేస్తుందని చెప్పారు. దాని సిఫారసుల అమలును నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ, ఎన్సీడీఎస్‌ వంటి విభాగాలనే రాష్ట్ర స్థాయిలోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థాయీ సంఘం నివేదికను ప్రామాణికంగా తీసుకుని బిల్లును రూపొందించామని చెప్పారు. 


డ్యాములు కొట్టుకుపోయినప్పుడు భారీగా ప్రాణ నష్టం జరుగుతోందని, ఇటువంటి సమయంలో విధుల  గురించి ఆలోచించాలి తప్పితే హక్కుల గురించి కాదని హితవు పలికారు. అయితే, బిల్లుపై డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి సరఫరా, డ్రైనేజీ తదితర అంశాలన్నీ రాష్ట్ర జాబితా పరిధిలోకి వస్తాయని, వాటిపై రాష్ట్రాలే చట్టాలు చేయాలని, అందువల్ల, బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశారు.  రాష్ట్రాల హక్కులను ఈ బిల్లు హరిస్తుందని స్పష్టం చేశారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని కోర్టుల్లో సవాల్‌ చేయవచ్చని కాంగ్రెస్‌ సభ్యుడు శక్తి సిన్హ్‌ గోహిల్‌ అన్నారు. టీడీపీ సభ్యుడు కె.రవీంద్ర కుమార్‌, ఎండీఎంకే సభ్యుడు వైకో, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ కుమార్‌ ఝా కూడా ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశారు. అయితే, సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న వాదనకు కేవలం 26 మంది మాత్రమే ఓటు వేయగా, దానికి వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు. దాంతో, ప్రతిపక్షాల సవరణలు కూడా వీగిపోయాయి. 

Updated Date - 2021-12-03T08:52:26+05:30 IST