ఉత్తరాది రైతులకు సరే.. మనోళ్ల మాటేంటి?

ABN , First Publish Date - 2021-11-22T09:05:40+05:30 IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటంచేసి ప్రాణత్యాగం చేసిన 700 మంది ఉత్తరాది రైతులకు సీఎం కేసీఆర్‌ రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరాది రైతులకు సరే..  మనోళ్ల మాటేంటి?

  • రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సాయమెప్పుడు?
  • 2014-18 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 5,152 మంది రైతుల బలవన్మరణం
  • 1600 మంది అన్నదాతలవే ఆత్మహత్యలుగా గుర్తించిన సర్కారు 
  • వీరిలో 1350 మందికి రూ.6 లక్షల చొప్పున సాయం 
  • మిగిలిన 250 రైతు కుటుంబాలకు ఏడేళ్లుగా ఎదురుచూపులే..
  • బడ్జెట్‌ లేదని సర్కారు సాకు..
  • ధనిక రాష్ట్రానికి రూ.15 కోట్లు లెక్కా! 
  • హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం 
  • నేడు విచారించనున్న న్యాయస్థానం


హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటంచేసి ప్రాణత్యాగం చేసిన 700 మంది ఉత్తరాది రైతులకు సీఎం కేసీఆర్‌ రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హరియాణా, పంజాబ్‌, యూపీ రైతులకు సాయం అందించాలనే నిర్ణయం అభినందనీయమే! అయితే తెలంగాణలో రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆత్మహత్య చేసుకున్న రైతుల సంగతి ఏమిటి? ఆ బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోదా? సాయం చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదెప్పుడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతుబీమా పథకానికి ముందు అంటే 2014 జూన్‌ 2 నుంచి 2018 ఆగస్టు 14 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతుల్లో 250 మందికి ప్రభుత్వం పరిహారం ఇంకా అందలేదు. బాధిత కుటుంబానికి రూ.6లక్షల చొప్పున రూ.15 కోట్లు ఇస్తామని అప్పట్లో సర్కారు జీవో (నెంబరు 194) జారీ చేసింది. అయితే బడ్జెట్‌ లేదనే సాకులు చెబుతూ కాలయాపన చేస్తూ వస్తోంది. అధికారుల చుట్టూ తిరిగి రైతులు విసిగిపోయారు. వీరి తరఫున హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 


అది సోమవారం  హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎదుట విచారణకు రానుంది. ఇప్పుడంటే మృతిచెందిన రైతులకు రైతు బీమా పథకం కింద రూ.5లక్షల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నారు. ఈ పథకం రాకముందు నాలుగేళ్లలో 5,152 మంది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే పట్టాదారు పాస్‌బుక్‌, పోస్టుమార్టం రిపోర్టు సహా 13 రకాల డాక్యుమెంట్లను పరిశీలించి 1,600 మందివే ఆత్మహత్యలుగా ప్రభుత్వం గుర్తించింది. బాధిత కుటుంబాలు పోరాటాలు చేయగా 1,350 మంది రైతు కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున సాయం అందించింది. ఇంకా 250 మంది ఏడేళ్లుగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జీవో-194 ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5లక్షలు కుటుంబ పోషణకు, రూ.లక్ష ‘ఓటీఎ్‌స’(వన్‌టైమ్‌ సెటిల్‌ మెంట్‌)కింద అప్పులు చెల్లించటానికి పంపిణీచేయాల్సి ఉంది. బాధిత కుటుంబాల్లో పిల్లలు ఉంటే వసతి గృహాల్లో చేర్పించాలి. పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇల్లులేనివారికి ఇంటిని మంజూరు చేయాలి. ఇవేవీ బాధిత కుటుంబాలకు ఇవ్వలేదు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ బాధిత కుటుంబం ‘సమాచార హక్కుచట్టం’ కింద దరఖాస్తుచేస్తే.. బడ్జెట్‌ లేకనే నిధులు విడుదల చేయటంలేదని రాష్ట్ర ప్రభుత్వం బదులిచ్చింది. లక్షల కోట్ల బడ్జెట్‌తో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం రూ. 15 కోట్లు లేవనిచెప్పటం శోచనీయం అనే విమర్శ వ్యక్తమవుతోంది. 


ప్రొసీడింగ్‌ లెటర్లు ఇచ్చి నిధులివ్వని వైనం

రైతు ఆత్మహత్యలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కుటుంబాలకు ‘ప్రొసీడింగ్‌ లెటర్లు’ ఇళ్లకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సదరు జిల్లా కలెక్టర్‌ స్వయంగా లేఖలు పంపటంతో, వెంటనే డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడతాయని బాధిత కుటుంబ సభ్యులు ఆశించారు. కానీ  ఏళ్లు గడిచినా ఇంతవరకు కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయలేదు. పరిహారంకోసం తహసీల్దారు మొదలుకొని ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌ వద్దకు ప్రొసీడింగ్‌ లెటర్లు పట్టుకొని చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం పెద్దనందిగామ గ్రామానికి చెందిన జి. వెంకటయ్య అనే రైతు 2018 ఫిబ్రవరి 17 ఆత్మహత్య చేసుకుంటే అధికారులు విచారణ చేపట్టి ఆత్మహత్యగా గుర్తించారు. వెంకటయ్య భార్య లక్ష్మీదేవమ్మకు జిల్లా కలెక్టర్‌ నుంచి ప్రొసీడింగ్‌ లెటరు వచ్చింది. కానీ పరిహారంరాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకకు  చెందిన  గవ్వల యాదగిరి అనే పత్తి రైతు 2015 అక్టోబరు 12 న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. 


యాదగిరి మృతిని ఆత్మహత్యగా గుర్తించడానికే ఽఅధికారులకు మూడేళ్లు పట్టింది. చివరకు 2018 మే 8 న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రొసీడింగ్‌ లెటర్‌ జారీ అయ్యింది. కానీ డబ్బులు రాలేదు. ప్రభుత్వ పరిహారం కోసం యాదగిరి భార్య గవ్వల శ్రీలత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన అనిరెడ్డి నర్సిరెడ్డి 2015 నవంబరు 7న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. 2017 మార్చి 30 తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీడింగ్‌ జారీచేసింది. ఇంతవరకు నర్సిరెడ్డి భార్య విజయకు ప్రభుత్వ పరిహారం అందలేదు. ఇదేజిల్లా మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామానికి చెందిన తుంగపాటి నరేశ్‌ 2015 అక్టోబరు 10 న ఆత్మహత్య చేసుకున్నారు. 2018 ఏప్రిల్‌ 17 న ప్రభుత్వం నుంచి ప్రొసీడింగ్‌ లెటర్‌ జారీ అయింది. అయినా నష్టపరిహారం అందలేదు. మోటకొండూరు మండలం చామాపూర్‌ గ్రామానికి చెందిన అంతటి రఘుపతి కుటుంబానికి ఆర్థికసాయం మంజూరు చేస్తూ 2019 సెప్టెంబరు 13 న, వలిగొండ మండలం జంగారెడ్డి గూడెం గ్రామానికి చెందిన వరికుప్పల నిర్మల కుటుంబానికి 2018 ఏప్రిల్‌ 19 న మంజూరుపత్రాలు జారీచేశారు. కానీ నష్టపరిహారం ఇవ్వలేదు.


హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

నల్లగొండ జిల్లాకు చెందిన బాధిత కుటుంబాలు  ప్రభుత్వ సాయం కోసం తిరిగి తిరిగీ విసిగిపోయి కోర్టును ఆశ్రయించి పరిహారం డబ్బులు సాధించుకున్నారు. ప్రస్తుతం కూడా వివిధ జిల్లాలకు చెందిన 84 మంది బాధిత రైతు కుటుంబాలు కోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై కేసు వేసి పరిహారం కోసం పోరాడుతున్నాయి. ఈనెల 9 న ‘రైతు స్వరాజ్య వేదిక’ ప్రతినిఽధి కొండల్‌రెడ్డి... హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌ నెంబరు- 162/2021) దాఖలుచేశారు. కాగా ఇటీవల పంట నష్టపరిహారం విషయంలో కూడా రైతుల తరుపున రైతు స్వరాజ్యవేదిక హైకోర్టులో కేసువేసి విజయం సాధించింది. తాజాగా ఆత్మహత్య చేసుకున్న 250 మంది రైతుల కుటుంబాలకు చెందిన వారు పిల్‌ దాఖలు చేయడంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 


3,942 మంది రైతులకు మొండిచేయి

2014-18 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌, పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ రిపోర్టు, పట్టాదారు పాస్‌ బుక్‌, ఎంఎల్‌వీసీ, డీఎల్‌వీసీ నివేదికలను పరిశీలించింది. అయితే ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో చాలామంది బిడ్డ పెళ్లి, కొడుకు చదువుకోసం, ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసిన వారు, తండ్రి పేరు మీద భూమి ఉన్నవారు, ఎఫ్‌ఐఆర్‌లో తప్పులుదొర్లినవారు, కౌలునామా లేని వారు 5152 మందిలో 3,942 మంది రైతులు ఉన్నారు. సాయం కోసం ఈ కుటుంబాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. డాక్యుమెంట్ల ఆధారంగా సాయం చేసేందుకు 1600 మందినే గుర్తించింది.


‘‘సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన సుదీర్ఘ పోరాటంలో 700 మంది రైతులు అసువులు బాసారు. ఆ కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున 3 లక్షల చొప్పున రూ. 22 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తాం. ఈ సాయాన్ని మంత్రులు నేరుగా బాధిత కుటుంబాలను కలిసి అందజేస్తారు. అవకాశాన్ని బట్టి నేను కూడా బాధిత కుటుంబాలను కలిసే ప్రయత్నం చేస్తా. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున సాయం అందించాలి.’’

 - ఈనెల 20న నిర్వహించిన విలేకరుల సమావేశంలో  సీఎం కేసీఆర్‌


గుర్తించినవారికి పరిహారం ఇవ్వలేదు

అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులందరినీ ప్రభుత్వం గుర్తించలేదు. రకరకాల కొర్రీలు పెట్టి వేలాది మంది రైతులను జాబితా నుంచి తొలగించి అన్యాయం చేశారు. అధికారికంగా ప్రభుత్వం గుర్తించిన రైతు కుటుంబాలకు కూడా పూర్తిగా నష్టపరిహారం పంపిణీ చేయలేదు. రాష్ట్రం లో 250 మందికి ప్రభుత్వం ఇంకా నష్టపరిహారం పంపిణీ చేయాల్సి ఉంది. మిగులు బడ్జెట్‌ రాష్ట్రమని చెప్పే తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 15 కోట్లు మంజూరు చేయకపోవటం బాధాకరంగా ఉంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమంచేసి ప్రాణాలర్పించిన రైతులకు రూ. 3 లక్షల ఆర్థికసహాయం అందజేస్తే మాకెలాంటి అభ్యంతరంలేదు. అర్హులుగా గుర్తించిన తెలంగాణ రైతు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలి. 

- కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి

Updated Date - 2021-11-22T09:05:40+05:30 IST