రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి

ABN , First Publish Date - 2021-03-05T05:32:04+05:30 IST

రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి

రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి
పామాయిల్‌ తోటలను పరీశీలిస్తున్న అధికారుల బృందం

ఉత్సాహంగా ముందుకొస్తున్న రైతులు

ఆయిల్‌సీడ్స్‌ సెంట్రల్‌ డైరెక్టర్‌ మనోహరన్‌

పాకలగూడెం, మల్కారం గ్రామాల్లో పర్యటన 

సత్తుపల్లి/దమ్మపేట, మార్చి 4: అత్యధికంగా వంటనూనె (పామాయిల్‌) ఇచ్చే పంట ఆయిల్‌పాం సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారని ఆయిల్‌సీడ్స్‌ సెంట్రల్‌ డైరెక్టర్‌ మనోహరన్‌ పేర్కొన్నారు. గురువారం ఉమ్మడి జిల్లా పర్య టనకు వచ్చిన ఆయన.. సత్తుపల్లి మండలం పాకలగూడెం, దమ్మపేట మండలం  మల్లారం, మల్కారం  గ్రామాల్లోని పామాయిల్‌ పంటలను శాస్త్రవేత్తలు పుష్పలత, హరీష్‌లతోకలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి అయిన ఆయన రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. సాగు మొదలైన నాలుగేళ్ల పాటు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, ఈ పంట దిగుబడులను కొనేందుకు అప్పారావుపేటలో ఒక ఫ్యాక్టరీ ఉండగా మరో రెండు ఫ్యాక్టరీలు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గ్రామస్థాయిలో పామాయిల్‌కు అనుకూల పరిస్థితులు, రైతులకు జరిగే మేలు, లాభనష్టాలు, ప్రాంతాల అభివృద్ధి, మిగతా పంటలకన్నా ఎంత మేలు జరుగుతుంది?, ఎకరానికి వచ్చే ఆదాయం ఎంత అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని, రైతులతో మాట్లాడిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. సబ్సిడీలు ఎక్కువగా అందిస్తే పంటసాగుకు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఉందని, పాకలగూడెంలో ప్రస్తుతం 136హెక్టార్లలో సాగు ఉండగా మరో 100ఎకరాల్లో పంటసాగుకు రైతులు ముందుకు వస్తున్నారన్నారు. వందశాతం డ్రిప్‌ అందించాలని, విత్తన సరఫరా పెంచాలని, ధర కూడా తగ్గించే పరిశీలించాలని రైతులు కోరినట్లు తెలిపారు. ఒక్కో మొక్క రూ.117ధర పలుకుతుండగా ప్రభుత్వం 91శాతం సబ్సిడీ ఇస్తుండగా రూ.27మాత్రమే రైతు చెల్లిస్తున్నారన్నారు. ఆయిల్‌ఫాం రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు ఆలపాటి రాంచంద్రప్రసాద్‌ పామాయిల్‌ సాగుపై బృంద సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధాకారి కవులూరి అనసూయ, ఆయిల్‌ఫెడ్‌ రిటైర్డ్‌ అధికారి రాజశేఖర్‌రెడ్డి, అప్పారావుపేట మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఫీల్డ్‌ ఆఫీసర్‌ శంకర్‌, కృష్ణారావు, ఉద్యాన అధికారులు మీనాక్షి, సందీప్‌, రైతులు వేగస్న రవివర్మ, నేలపాల చంద్రరావు, పాకనాటి పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-05T05:32:04+05:30 IST