Abn logo
Sep 21 2021 @ 00:57AM

తివిరి జలమున తైలం తీయవచ్చు!

  • నీటిలో పడిన నూనెను పీల్చే సూపర్‌ దూది
  • తయారుచేసిన ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు


గువాహటి, సెప్టెంబరు 20: పొరపాటున నూనె గిన్నె చెయ్యిజారి నీళ్లల్లో పడిపోయిందనుకోండి! ఇక అంతే సంగతులు. ఆ నీళ్లల్లో పడ్డ నూనెకు నీళ్లూనువ్వులూ వదులుకోవాల్సిందే!! వంటింట్లో అలా జరిగితే.. ‘పోతే పోయిందిలే’ అని సరిపెట్టుకుంటాం. కానీ, సముద్రాల్లో ఒక్కోసారి రవాణా ఓడల నుంచి నూనె లీకయ్యి తెట్టు కడుతుంది. దీనివల్ల సముద్ర జీవులకు ఊపిరాడదు. ఈ సమస్యకు చెక్‌పెట్టే అద్భుతమైన పరిష్కారాన్ని ఐఐటీ గువాహటి శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.


నీళ్లల్లో పడిన నూనెను మాత్రమే గ్రహించి, నీటిని వదిలేసే ‘సూపర్‌ హైడ్రోఫోబిక్‌ కాటన్‌ కాంపోజిట్‌ మెటీరియల్‌’ను అభివృద్ధి చేశారు. పేరు పలకడానికి కష్టంగా ఉందిగానీ.. వారు తయారుచేసిన పదార్థం మామూలు దూదిలా ఉంటుంది. నీళ్లల్లో నూనె పోసి ఈ దూదిని దాంట్లో ముంచితే కేవలం నూనెను మాత్రమే గ్రహిస్తుంది. నీటి తడి కొంచెం కూడా దానికి అంటదు. అలా ఆ దూదిని కనీసం 10సార్లు వాడొచ్చట. ఈ ఆవిష్కరణ జలకాలుష్య సమస్యకు పరిష్కారంగా ఉపయోగపడుతుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు.