ఆసిఫాబాద్‌ జిల్లాలో గ్రంథాలయాలపై అధికారుల చిన్నచూపు

ABN , First Publish Date - 2022-05-02T03:30:46+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని ప్రకటించడంతో నిరుద్యోగ యువత గ్రంథాలయాల దారి పట్టింది. ఆర్థిక స్థోమత ఉన్నవారు హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు కోచింగ్‌కు వెళుతుండగా పేద, మధ్య తరగతి యువత మాత్రం గ్రంథాలయాల వైపు చూస్తున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో గ్రంథాలయాలపై అధికారుల చిన్నచూపు

- పక్కా భవనాలు కరువు

- నిధులుమంజూరైనా స్థలం కరువు

- ఉద్యోగార్థుల ఇబ్బందులు

- పట్టించుకోని అధికారులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 1: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని ప్రకటించడంతో నిరుద్యోగ యువత గ్రంథాలయాల దారి పట్టింది. ఆర్థిక స్థోమత ఉన్నవారు హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు కోచింగ్‌కు వెళుతుండగా పేద, మధ్య తరగతి యువత మాత్రం గ్రంథాలయాల వైపు చూస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాలు తప్ప మండలాల్లోని శాఖా గ్రంథాలయాల్లో పోటీపరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు అందు బాటులో ఉండడం లేదు. దినపత్రికలు తప్ప కనీస సౌకర్యాలు కూడా చాలా చోట్ల కరువయ్యాయి. ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో జిల్లాలో పరిస్థితి ఇలా ఉండగా మండలాల్లో మాత్రం అధ్వాన్నంగా తయారైంది. దాదాపు అన్ని మండల కేంద్రాల్లోనూ విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరాయి. నూతన మండలాల్లో ఇంకా ఆ ఊసే లేదు. కాగజ్‌నగర్‌ పట్టణంలో గ్రంథాలయం 1800 మంది సభ్యత్వం కలిగి ఉంది. గతంలో రోజూ వందలాది మంది పాఠకులు వచ్చేవారు. కొవిడ్‌ సమస్యతో పాటు భవనం శిథిలావస్థకు చేరడంతో పాఠకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం కేవలం రోజూ 20మందికి మించి పాఠకులు రావడం లేదు. వందలాది పుస్తకాలున్నా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో యువకులు నిరుత్సాహం చెందుతున్నారు. 

కాగజ్‌నగర్‌ పట్టణంలో లైబ్రరీ కేంద్రం కేవలం సిర్పూర్‌ పేపర్‌ మిల్లు(ఎస్పీఎం) మిల్లుకు చెందిన రేకులషెడ్డులో కొనసాగుతోంది. అది కూడా గత 40 ఏండ్లుగా కొనసాగుతుండడంతో శిథిలావస్థకు చేరింది. అరకొర సౌకర్యాలు తప్ప సదుపాయాలు లేవు. పుస్తకాల కొరత వేధిస్తోంది. ముఖ్య పట్టణంగా ఉన్న కాగజ్‌నగర్‌లో వేలాది మంది కేవలం న్యూస్‌ పేపర్స్‌ చదివేందుకు తప్ప ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు లేకపోవడంతో నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి వసతి, ఫర్నీచర్‌ తదితర వస్తువులు విరిగిపోయే స్థితిలో ఉన్నాయి. నిధులు మంజూరు చేస్తే గ్రంథాలయం పరిస్థితి చక్కబడుతుందని పేర్కొంటున్నారు. 

నూతన గ్రంథాలయం నిర్మాణం జరిగేనా

జిల్లా కేంద్రంతో పాటు 16మండలాల్లోని గ్రంథాలయాల్లో అరకొర వసతులే దర్శనమిస్తున్నాయి. కేవలం పాత పుస్తకాలు శిథిలావస్థకు చేరిన ఫర్నీచర్‌ మాత్రమే కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలంలో ఎంతో మంది ప్రజా ప్రతినిధులు మారుతున్నా లైబ్రరీని మాత్రం పట్టించుకునే నాథుడే లేడని యువకులు పేర్కొంటున్నారు. నూతన గ్రంథాలయం కోసం స్థలం సేకరించేందుకు కూడా ఎవరికీ ఆసక్తి కనిపించడం లేదని నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నిధులున్నా..తప్పని సమస్యలు

రూ.25లక్షలతో లైబ్రరీకి భవనం మంజూరైనా స్థల సేకరణతో ఆలస్యం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న లైబ్రరీని మరో చోటికి తాత్కాలికంగా ఏర్పాటు చేసి అదే స్థలంలో పక్కా భనవం నిర్మించాల్సి ఉంది. అయితే దీనికి ఎంతో సమయం పడుతుందని పాఠకులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో శాఖా గ్రంథాలయాలు ఉన్నా వాటి పరిస్థితి అధ్వానంగానే ఉంది. ఏమాత్రం సౌకర్యాలు లేని గ్రంథాలయాలే ఎక్కువగా ఉన్నాయి. 

మండల కేంద్రాల్లోనూ....

కౌటాల మండల కేంద్రంలో ఉన్న లైబ్రరీలో అరకొర వసతులే దర్శనమిస్తున్నాయి. కేవలం అలంకారప్రాయంగానే ఈ లైబ్రరీ మిగిలిపోయింది. చింతలమానేపల్లి, పెంచికల్‌పేటలో లైబ్రరీల ఊసేలేదు. సిర్పూర్‌(టి)లో ప్రభుత్వ స్థలంలో భవనం ఉన్నప్పటికీ అక్కడ వసతుల లేమితో పుస్తకాలను పంచాయతీ కార్యాలయంలో ఉం చారు. మిగిలిన చోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయి. దహెగాం తదితర మండలాల్లో లైబ్రరీ లేనేలేదు. కేవలం బీడీసీ కేంద్రాలున్నా బడ్జెట్‌ తదితర కారణాలతో మూడేళ్లుగా మూతపడ్డాయి. మరోవైపు ఆసిఫాబాద్‌ డివిజన్‌లోనూ గ్రంథాలయాల్లో ఇబ్బందులు ఉన్నాయి. వాంకిడి, కెరమెరి తదితర మండలాల్లోనూ అదే పరిస్థితి..

నూతన భవనం మంజూరైంది

-రాచకొండ గిరీష్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ కమిటీ డైరెక్టర్‌

కాగజ్‌నగర్‌లో గ్రంథాలయ నూతన భవనం కోసం రూ.25లక్షల ప్రతిపాదనలు పంపించాం. 22లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే స్థల సేకరణ జరగలేదు. పట్టణానికి దూరంగా ప్రభుత్వ స్థలం ఉన్నా పాఠకులకు అనుకూలంగా లేదనే వాదన ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న మిల్లు క్వార్టర్‌ స్థలంలోనే నూతన భవనం నిర్మించాలంటే మిల్లు యాజమాన్యం అనుమతి తీసుకోవాలి. దీని కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. చింతలమానేపల్లి, పెంచికల్‌పేటలో బీడీసీ కేంద్రాలకోసం ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం కేవలం సిర్పూర్‌(టి)లో మాత్రమే ప్రభుత్వ భవనం ఉంది.

Updated Date - 2022-05-02T03:30:46+05:30 IST