దూరం జరగండయ్యా

ABN , First Publish Date - 2020-03-29T08:13:33+05:30 IST

ఎంతెంత దూరం... అంటే చాలా చాలా దూరం! అని చెప్పుకోవాల్సిన సమయమిది. నిల్చున్నా, కూర్చున్నా... సామాజిక దూరమే నేటి మంత్రం! కానీ...

దూరం జరగండయ్యా

  • మీరే ఇట్టా కూర్చుంటే ఎట్టా?
  • కరోనా టాస్క్‌ఫోర్స్‌ భేటీలో చిత్రం
  • ఇరుకు గదిలో సమావేశం
  • అడుగు కూడా గ్యాప్‌ లేకుండా కుర్చీలు
  • మాస్కులూ లేకుండా చర్చోపచర్చలు
  • అందరి ఆఫీసులు సచివాలయంలోనే!
  • అక్కడ కాదని విజయవాడలో భేటీ
  • మళ్లీ సచివాలయంలో ప్రెస్‌మీట్‌
  • చోద్యంపై అధికారుల్లోనే విస్మయం


(అమరావతి - ఆంధ్రజ్యోతి) : ఎంతెంత దూరం... అంటే చాలా చాలా దూరం! అని చెప్పుకోవాల్సిన సమయమిది. నిల్చున్నా, కూర్చున్నా... సామాజిక దూరమే నేటి మంత్రం! కానీ... స్వయానా కరోనాపై మంత్రులు, ఐఏఎస్‌ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ తొలి సమావేశమే ఇరుకు గదిలో ఒకరినొకరు ఆనుకుని కూర్చుని జరిగింది. ‘సమావేశానికి రండి’ అని పిలుపు రాగానే వెళ్లిన అధికారులు... అక్కడి గదిలో ఒక దానిపక్కన ఒకటి వేసిన కుర్చీలు చూసి విస్తుపోయారు. ఒకవైపు కరోనాపై పోరు సామాజిక దూరం పాటించాలని తామే పిలుపు నిస్తూ... మరోవైపు తాము మాత్రం ఇలా పక్కపక్కన సిట్టింగ్‌లు వేస్తే జనం నవ్వుకోరా అని వాపోయారు. ప్రతి ఒక్కరూ ఆరు అడుగులు, కుదిరితే మీటరు దూరం పాటించాలని చెబుతుండగా... వీళ్లు మాత్రం రెండడగుల గ్యాప్‌లేకుండా కుర్చీలు వేసుకుని కరోనా కట్టడిపై  లోతుగా చర్చలు జరిపారు.


మరో ఆందోళనకరమైన విషయమేమిటంటే... ఈ భేటీలో పాల్గొన్న ఒక ఐఏఎస్‌ అధికారి కుమారుడు ఇటీవల విదేశాల నుంచి వచ్చి  హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నా డు. అంటే... మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అయినా, దీనిని పట్టించుకోలేదు. కరోనా నియంత్రణ చర్యల పర్యవేక్షణ , తక్షణ చర్యలు తీసుకోవడానికి మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ శనివారం విజయవాడలో భేటీ అయ్యింది. ఈ సమాచారం రాగా నే... అధికారులంతా తరలి వెళ్లారు. ఈ భేటీలో మంత్రి ఆళ్ల నాని ఒక్కరే విడిగా కూర్చున్నారు. ఆయనకు దూరంగా ఒకవైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మరోవైపు హోం మంత్రి సుచరిత కూర్చున్నారు. ఒక వరుసలో మంత్రి బొత్స,  సీఎస్‌ నీలంసాహ్నీ, వైద్య ఆరో గ్య శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు పీవీ రమేశ్‌,  ఇతర అధికారులుండగా.. మరో వరుసలో మంత్రులు బుగ్గన,  కన్నబాబు, డీజీపీ, ఆ పక్కనే ఐఏఎస్‌ అధికారి విజయ్‌ కు మార్‌ కూర్చున్నారు. వెనుక వరుసల్లోనూ అధికారులు ఆసీనులయ్యారు. మం త్రుల వరకు మాత్రమే కాస్త గ్యాప్‌ కనిపించిం ది. సమావేశ మందిరం  చిన్నది, ఈ భేటీకి సచివాలయాన్ని కాదని విజయవాడలోని ఆర్‌అండ్‌బీ భవనాన్ని వేదికగా మార్చుకోవడమే ఒక చిత్రం


ఉదాహరణలున్నప్పటికీ... 

భేటీలో పాల్గొన్న వారిలో కరోనా అనుమానితులున్నా, లేకున్నా... ప్రస్తుత పరిస్థితిలో సామాజిక దూరం పాటించడం మాత్రం తప్పనిసరి! ఇటీవల కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనే ప్రధాని, మంత్రులు దూరం దూరంగా కూర్చున్నారు. శుక్రవారం జరిగిన కేబినెట్‌ భేటీలోనూ మంత్రులు, అధికారులు రెండు వరుసల్లో ఒకరికొకరు మీటరు దూరం పాటిస్తూ కూర్చున్నారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం రాజ్‌భవన్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సోషల్‌ డిస్టెన్స్‌ అమ లు చేశారు. అధికారుల నడుమ మీటరున్నర దూరం ఉండేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ సచివాలయంలోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలోనూ ఈ ప్రమాణాలను పాటించారు. కానీ... స్వయంగా కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ భేటీ మాత్రం ఈ ప్రాథమిక నిబంధనను ఉల్లంఘించింది.


ఇది మరింత చిత్రం... 

ఆర్‌అండ్‌బీ భవనంలో జరిగిన  భేటీలో తీసుకున్న నిర్ణయాలను అక్కడే మీడియాకు వెళ్లడించవచ్చు. అలా కాకుండా... మంత్రి ఆళ్ల నానితోపాటు అధికారులంతా సచివాలయానికి తర లి వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రహసనంపై సీనియర్‌ అధికారులు అసహనం వ్యక్తం చేశారు.


Updated Date - 2020-03-29T08:13:33+05:30 IST