దుకాణాల వేలానికి రంగం సిద్ధం

ABN , First Publish Date - 2021-07-24T05:26:06+05:30 IST

రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఐడీఎస్‌ఎంటీ దుకాణాలకు వేలం నిర్వహించేందుకు మునిసిపల్‌ అధికారులు రంగం సిద్ధం చేశారు.

దుకాణాల వేలానికి రంగం సిద్ధం
ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

- 35 షాపులకు టెండర్లు పిలిచిన అధికారులు 

- మునిసిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు 

- ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 

గద్వాల టౌన్‌, జూలై 23 : రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఐడీఎస్‌ఎంటీ దుకాణాలకు వేలం నిర్వహించేందుకు మునిసిపల్‌ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాత బస్టాండు, మునిసిపల్‌ కార్యాలయం వెనుక భాగం, పాత కూరగాయల మార్కెట్‌ సమీపంలోని దుకాణాలను ఈ నెల 26న వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిం చేందుకు శుక్రవారం మునిపిపల్‌ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. వేలంలో పాల్గొనదలచిన వారికి కేటగిరీల వారీగా ధరావత్తు సొమ్మును ఖరారు చేశారు. గతంలో ఒక్కో షాపునకు ప్రత్యేకంగా ధరావత్తు స్వీకరిం చేవారు. ప్రస్తుతం 35 షాపులకు గాను పాత కూరగాయల మార్కెట్‌ సమీపంలో ఉన్న ఎనిమిది దుకాణాలకు మూడు లక్షలు, మునిసిపల్‌ కార్యా లయం వెనుకనున్న 18 షాపులకు లక్ష, మిగతా తొమ్మిది దుకాణాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ధరావత్తు సొమ్ము స్వీకరిస్తున్నారు. గతంలో ఒక్కో దుకాణానికి ప్రత్యేకంగా దరఖాస్తులు, ధరావత్తు సొమ్ము నిబంధనను అమలు చేయగా, టెండరుదారులు రింగ్‌గా మారి తక్కువ మొత్తానికి దక్కించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సారి దుకాణాల వారీగా కాకుండా, ప్రాంతాల వారీగా ఖరారు చేశామని మేనేజర్‌ దేవేందర్‌ రెడ్డి వివరించారు. 


సెలవు రోజునా దరఖాస్తుల స్వీకరణ 

ఆదివారం సెలవు దినమైనప్పటికీ టెండరు దరఖాస్తులను స్వీకరిస్తామని మునిసిపల్‌ కమిషనర్‌ కే.శ్రీనివాస రెడ్డి తెలిపారు. శనివారం బ్యాంకులకు సెలవు ఉంటే, డీడీ కాకుండా నేరుగా మునిపిపల్‌ కార్యాలయంలోనే ధరా వత్తు సొమ్మును స్వీకరించి రశీదును అందించే ఏర్పాటు చేశామన్నారు. 

Updated Date - 2021-07-24T05:26:06+05:30 IST