విచ్చలవిడిగా జనసంచారం

ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST

జిల్లాలో లాక్‌డౌన్‌ గేట్లు ఎత్తేశారు. అన్ని కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జనం కరోనా జాగ్రత్తలు మరచిపోయి విచ్చలవిడిగా సంచరిస్తున్నారు.

విచ్చలవిడిగా జనసంచారం

 ఆస్పత్రుల నుంచి బయటకు రాకపోకలు సాగిస్తున్న కరోనా బాధితులు

నియంత్రణ చర్యలు వదిలేసిన అధికారులు

 కొత్తగా 463 మందికి కరోనా.. మరో ఐదుగురు మృతి


 అనంతపురం వైద్యం, సెప్టెంబరు 18 : జిల్లాలో లాక్‌డౌన్‌ గేట్లు ఎత్తేశారు. అన్ని కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జనం కరోనా జాగ్రత్తలు మరచిపోయి విచ్చలవిడిగా సంచరిస్తున్నారు.  కరోనా పాజిటివ్‌ బాధితులు సైతం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా కొవిడ్‌ ఆస్పత్రులలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. ఆస్పత్రుల బయటకు వచ్చి జనసంచారంలో ఉంటూ టీ, కాఫీ, టిఫిన్‌ యథేచ్ఛగా తీసుకుంటున్నారు.


జిల్లా సర్వజనాస్పత్రి ఎదురుగా ఉన్న టీ, టిఫిన్‌ హోటళ్లకు పాజిటివ్‌ బాధితులు వచ్చి వెళ్తున్నారు. ఇతర ప్రైవేట్‌ కొవిడ్‌ ఆస్పత్రులలో కూడా ఇదే పరిస్థితి. అధికారులు సైతం కరోనా నియంత్రణ చర్యలను పూర్తిగా వదిలేశారు. కొవిడ్‌ ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది సైతం కరోనా విషయంలో నిబంధనలు పట్టించుకోవడంలేదు. దీంతో పాజిటివ్‌ బాధితులు ఇష్టానుసారం లోపలికి, బయటకు తిరుగుతున్నారు. బాధితుల బంధువులు వచ్చి పలకరించి పోతున్నారు. దీంతో వైరస్‌ మరింతగా విస్తరిస్తుందేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.


 శాంపిళ్లు ఇవ్వడానికి ముందుకు రాని ప్రజలు

జిల్లాలో 87 పీహెచ్‌సీలు, 19 సీహెచ్‌సీలు, 2 జిల్లా ఆస్పత్రులతో పాటు మొబైల్‌ వాహనాల ద్వారా కరోనా నమూనాలు సేకరిస్తున్నారు. జూలై, ఆగస్టు నెలలో ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా సగటున 10 వేల శాంపిళ్లు సేకరించారు. అప్పుడు కరోనా కేసులు అధిక సంఖ్యలో రావడం, అధికారులు పెద్దఎత్తున నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో అనుమానితులు నమూనాలు ఇవ్వడానికి ఆసక్తి చూపారు.


ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కరోనా ప్రభావం తగ్గిపోయిందని, మరోవైపు  చిన్న సాధారణ జబ్బు ఉన్నా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ వస్తుందన్న ప్రచారం సాగుతోంది. దీంతో జనం కొం త అనారోగ్యానికి గురైనా నమూనాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. ప్రతి పీహెచ్‌సీ, సీహెచ్‌సీల నుంచి ప్రతి రోజు 45 శాంపిళ్లు తీయాలని టార్గెట్‌ పెట్టారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 5 వేల శాంపిళ్లు రావాలి.


కాని ప్రస్తుతం రోజుకు 2 వేల వరకు మాత్రమే వస్తున్నాయి, ఒక్కో పీహెచ్‌సీ నుంచి సగటున 15 శాంపిళ్లు మాత్రమే వస్తున్నట్టు లెక్కలు చూపుతున్నాయి. ఎంపీడీఓలు, తహ సీల్దార్లు, వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వలంటీర్లు ప్రయత్నిస్తున్నా నమూనాలు ఇవ్వడానికి జనం ముందుకు రావడంలేదని చెబుతున్నారు.


కొత్తగా 463 కరోనా కేసులు

జిల్లాలో గడిచిన 24 గంటలలో మరో 463 మంది కరోనా బారిన పడ్డారు. మరో ఐదుగురు బాధితులు చికిత్స పొందుతూ మరణించారు. ఈ లెక్కన జిల్లాలో 51821 మంది ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారు, కరోనా మరణాల సంఖ్య 434కి పెరిగింది.


నేడు నమూనాలు సేకరించే ప్రాంతాలివే..

జిల్లాలో శనివారం కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, పట్నం, బుక్కపట్నం, అమరాపురం, హేమావతి, సీకేపల్లి, ఆత్మకూరు, గార్లదిన్నె, ముదిగుబ్బ, కదిరి, గుట్టూరు, కది రేపల్లి, ఆవులదట్ల, కణేకల్లు, ధర్మవరం, తాడిపత్రి, జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌, పాతూరు ఆస్పత్రి, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో నమూనాలు సేకరిస్తారని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-09-18T05:30:00+05:30 IST