అధికారుల ఉరుకులు పరుగులు

ABN , First Publish Date - 2022-04-16T06:39:13+05:30 IST

ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరణపై అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో మంత్రులు, ఉన్నతాధికారులు ప్రతిరోజూ సమీక్షిస్తూ పనులు కొనసాగిస్తున్నారు.

అధికారుల ఉరుకులు పరుగులు

యాసంగి ధాన్యం కొనుగోలుకు సర్కారు నిర్ణయం 

యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

గన్ని సంచులు, కూలీలు, వాహనాల ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం

జిల్లాలో సవాలుగా మారిన యాసంగి ధాన్యం సేకరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరణపై అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో మంత్రులు, ఉన్నతాధికారులు ప్రతిరోజూ సమీక్షిస్తూ పనులు కొనసాగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం సేకరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వెంటనే ధాన్యం తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కొనుగోలుకు అవసరమైన గన్నిబ్యాగులు, కూలీలు, వాహనాలపై దృష్టిపెట్టి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బీహార్‌, మహారాష్ట్ర నుంచి కూలీలను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

        ధాన్యం సేకరణకు రెండు నెలల సమయం..

జిల్లాలో ధాన్యం సేకరణకు రెండు నెలల సమయం పట్టనుంది. ప్రతి సీజన్‌లో నెలరోజుల ముందుగానే కొనుగోలుపై నిర్ణయం తీసుకుని ఏర్పాట్లు చేసేవారు. ధాన్యం కేంద్రాల గుర్తింపుతో పాటు మౌలిక వసతులను అన్ని గ్రామాల పరిధిలో సమకూర్చేవారు. కొనుగోలుకు అవసరమైన గన్ని బ్యాగులు ముందే సిద్ధం చేసి ధాన్యం సేకరించేవారు. వెంట వెంటనే వాహనాలను సమకూర్చి ధాన్యాన్ని మిల్లులకు తరలించేవారు. అయితే ఈ దఫా ప్రభుత్వం కొనుగోలుపై ముందుగా నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేసేందుకు సమ్మతించకపోవడంతో కొంత వేచిచూసి సీజన్‌ మొదలుకావడంతో నిర్ణయం తీసుకుంది.

        3,46,672 ఎకరాల్లో వరి సాగు..

జిల్లాలో యాసంగిలో 3 లక్షల 46వేల 672 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఈ సీజన్‌లో 9లక్షల 55వేల 743 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ ధాన్యం సేకరించేందుకు గన్ని బ్యాగుల అవసరం ఎక్కువగా ఉంది. జిల్లాలో దిగుబడి వచ్చే ధాన్యానికి మొత్తం కోటి 87లక్షల 50వేల గన్ని బ్యాగుల అవసరం ఉంది. మొత్తం ధాన్యం సేకరించేందుకు ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం కొత్త గన్నిలు కోటి లక్షా 25వేలు, పాతవి 81లక్షల 25వేలు అవసరం ఉంది. ఎఫ్‌సీఐ నిబంధనల మేరకే గన్నిలను వినియోగించాలి. ప్రతి సంవత్సరం ముందే గన్ని బ్యాగులకు ఆర్డర్‌ ఇచ్చి కలకత్తా నుంచి తెప్పించేవారు. ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకోకపోవడం వల్ల గన్ని బ్యాగులను తెప్పించలేదు. ప్రస్తుతం పది లక్షల వరకే గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 30లక్షల వరకు రెండు మూడు రోజుల్లో రానున్నాయి. ప్రతి సంవత్సరం కొనుగోలు సమయంలోనే 80లక్షల వరకు గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచేవారు. ధాన్యం సేకరణ మొదలైతే ప్రతిరోజూ 50వేల నుంచి లక్ష వరకు గన్నిలను వినియోగిస్తారు. 

        సుమారు 12వేల మంది కూలీల అవసరం..

ధాన్యం సేకరణలో కూలీలు కూడా బాగా అవసరం ఉంది. జిల్లాలో మొత్తం 450 నుంచి కొనుగోలు కేంద్రాలను ఈ సీజన్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ధాన్యం సేకరణ కోసం సుమారు 12వేల మంది కూలీల అవసరం ఉంది. జిల్లాలో ప్రస్తుతం సొసైటీల పరిధిలో 3వేల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రతి సంవత్సరం ధాన్యం సేకరణ సమయంలో బీహార్‌, మహారాష్ట్ర నుంచి కూలీలను రప్పించి ధాన్యం సేకరిస్తున్నారు. ఈ దఫా కూడా సహకార సొసైటీల ద్వారానే కూలీలను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూలీలకు అడ్వాన్స్‌ ఇచ్చేందుకు కూడా ఆయా సొసైటీలకు సహకార శాఖ అధికారులు గత సీజన్‌లో ధాన్యం సేకరించిన కమీషన్‌ కూడా విడుదల చేశారు. జిల్లాలో ధాన్యం సేకరణ తర్వాత తరలించేందుకు వాహనాల అవసరం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో 8 మంది ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్‌లకు అవకాశమిచ్చారు. మొత్తం 1600 లారీలను అందుబాటులో ఉంచాలని కోరారు. వారి నుంచి లారీల వివరాలను కూడా తీసుకున్నారు. ఇవి సరిపోకపోతే గ్రామాల పరిధిలో ట్రాక్టర్‌లు, డీసీఎంలకు అవకాశం ఇచ్చి ధాన్యం తరలించాలని నిర్ణయించారు. తరలింపునకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల వాహనాలను కూడా అవసరమైతే వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణకు అవసరమైన కాంటాలు, టార్ఫాలిన్‌లు కూడా కొనుగోలు కేంద్రాలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఆయా సొసైటీలు, ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ధాన్యం కేంద్రాల వద్ద అవసరమైతే ధాన్యాన్ని తేర్పారపట్టేందుకు మిషన్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన వసతులను కల్పిస్తున్నారు. 

        170 మిల్లులకు ధాన్యం తరలింపు..

జిల్లాలో ఈ ధాన్యం కొనుగోలు చేయగానే మిల్లులకు తరలించేందుకు 170 మిల్లులను గుర్తించారు. వీటి ద్వారా రా రైస్‌ను పట్టేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరోపణలు ఉన్న మిల్లులు, సీఎంఆర్‌ ఇవ్వని మిల్లులను పక్కన పెట్టారు. అవసరమైతే మరికొన్ని మిల్లులను తీసుకునేందుకు వాటి కెపాసిటి ఆధారంగా ఏర్పాట్లను చేస్తున్నారు. 

       మొదటగా వందకు పైగా కేంద్రాల ఏర్పాటు..

జిల్లాలో మొదట వందకు పైగా కేంద్రాలను ఒకటి రెండు రోజుల్లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కేంద్రాలను ప్రారంభించడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని తరలింపు చేపట్టే విధంగా చర్యలు చేపట్టారు. ప్రతి కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులను ఉంచడంతో పాటు తరలించిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేసేవిధంగా మిల్లులకు కూడా అధికారులను కేటాయింపులు చేస్తున్నారు.   సమయం తక్కువగా ఉండడంతో అవసరమని తెప్పించుకుంటునే ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ధాన్యం సేకరణ అధికారులకు, ప్రజాప్రతినిధులకు సవాలుగా మారడంతో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కువ గ్రామాల్లో రైతులు వరి కోతలు మొదలుపెట్టినందున కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగానే ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేసి కొనుగోలు ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. సమయం తక్కువగా ఉన్న ఏ ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరిగేవిధంగా ఈ ఏర్పాట్లను చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రతి సీజన్‌లో రికార్డుస్థాయిలో ధాన్యం సేకరించినందున మొదట కొన్ని రోజులు చిన్న చిన్న సమస్యలు ఏర్పడిన వాటిని పరిష్కరించుకుంటూ ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని వారు తెలిపారు. సమయం తక్కువ ఇచ్చిన గన్నిబ్యాగులు, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు.

Updated Date - 2022-04-16T06:39:13+05:30 IST