అధికారులు జవాబుదారీగా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-07-05T07:02:24+05:30 IST

అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేసి వారి మన్ననలను పొందాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు.

అధికారులు జవాబుదారీగా పనిచేయాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

- ‘స్మార్ట్‌’ పనులను వేగంగా పూర్తి చేయాలి 

- మంత్రి గంగుల కమలాకర్‌ 

కరీంనగర్‌ టౌన్‌, జూలై 4: అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేసి వారి మన్ననలను పొందాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి స్మార్ట్‌సిటీ అధికారులు, కన్సల్‌టెన్సీ ప్రతినిధులు, ఇంజనీరింగ్‌ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులన్నింటిని గడువులోగా పూర్తి చేసే విధంగా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో అన్ని రంగాల్లో కరీంనగర్‌ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సీఎం అస్యూరెన్సు, డీఎంఎఫ్‌టీ, పట్టణ ప్రగతి, మున్సిపల్‌ వివిధ గ్రాంట్స్‌, స్మార్ట్‌సిటీ నిధులతో అభివృద్ధి వేగంగాజరుగుతోందని అన్నారు. టవర్‌సర్కిల్‌ ఆధునీకర పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. ఆర్వీ కన్సల్‌టెన్సీ, విద్యుత్‌, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆధునీకరణ పనులన్నింటిని సెప్టెంబరులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్మార్ట్‌సిటీ 1,2,3 ప్యాకేజీ పెండింగ్‌ పనులను వేగంగా పూర్తిచేయాలని చెప్పారు. టవర్‌సర్కిల్‌లో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌కు సంబంధించిన హెచ్‌టీ, ఎల్‌టీ కేబుల్‌ లైన్‌ పనులను వెంటనే ప్రారంభించాలని, రేయింబవళ్లు పనులు చేపట్టి నిర్ణీత గడువులో వాటిని పూర్తి చేసేలా కాంట్రాక్టర్‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని 13 ప్రధాన కూడళ్లను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు అందమైన డిజైన్‌ను ఎంపిక చేసి సాంకేతిక అనుమతి ఇచ్చి పనులు ప్రారంభించేందుకు వెంటనే కాంట్రాక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. సమావేశంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ గరిమఅగర్వాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T07:02:24+05:30 IST