అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2020-09-20T07:55:23+05:30 IST

అధికారులు సమన్వయంతో పనిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి పేర్కొన్నారు...

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి


వాంకిడి, సెప్టెంబరు19: అధికారులు సమన్వయంతో పనిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి పేర్కొన్నారు. శనివారం వాంకిడి ఎంపీపీ ముండే విమలాబాయి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు జడ్పీటీసీ సభ్యుడు అజయ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే మండల సమావేశాల్లో సభ్యులు విన్నవించిన ప్రతి సమస్యను సకాలంలో పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకో వాలని సూచించారు. మండలంలోని నార్లపూర్‌, ధాబా గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేశామన్నారు. ఖమన, ఖిరిడి గ్రామాలకు రోడ్ల మంజూరుకు ప్రతిపా దనలు పంపించామని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా అధికారులు, సభ్యులు కృషి చేయాలన్నారు. వచ్చే సమావేశంలో పూర్తి స్థాయిలో అధికారులు హాజరు కావాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. మండల సమావేశంలో చర్చించిన సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. గణేష్‌పూర్‌ గ్రామంలో పశువుల సంతను రద్దు చేస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. 


పశువుల అక్రమ రవాణా జరగకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోరారు. మండలంలో నిర్మిస్తున్న శ్మశాన వాటికలకు ప్రభుత్వ స్థలాల సేకరణలో రెవెన్యూ అధికారులు సహకరించడం లేదని బంబార సర్పంచ్‌ సయ్యద్‌ అయ్యూబ్‌ చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రభుత్వ భూములను గుర్తించి శ్మశాన వాటికలకు స్థలాలను కేటాయించి సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలని ఆమె రెవెన్యూ అధికారులను ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీరుపోసిన కూలీలకు ఇప్పటికీ కూలి డబ్బులు అందలేదని వాంకిడి, బంబార సర్పంచులు బండె తుకారాం, అయ్యూబ్‌లు పేర్కొన్నారు. మండలంలోని సోనాపూర్‌, లక్ష్మింపూర్‌, చౌపన్‌గుడ గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నందున బస్సు సదుపాయం కల్పించాలని సభ్యులు కోరారు. మండలంలోని 43 గిరిజన హ్యాబిటేసన్‌లలో త్రీఫేస్‌ విద్యుత్‌ సదుపాయం కల్పించేందుకు ప్రతిపా దనలు పంపించామని విద్యుత్‌ శాఖ ఏఈ రవికుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని కొన్ని గిరిజన గ్రామాల్లో టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడంతో విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని వాంకిడి సర్పంచు బండె తుకారాం కోరారు. బంబార గ్రామంలో పశువైద్య సబ్‌సెంటర్‌ ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ అయ్యూబ్‌ కోరారు. ఈ మేరకు జడ్పీ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో డీపీఓ రమేష్‌, ఎంపీడీఓ వెంకటే శ్వర్‌రెడ్డి, టీడీ బాబుసింగ్‌, ఎంఈఓ మనుకుమార్‌, సీడీపీఓ రిబ్కా, ఏఓ మిలింద్‌, పశువైద్యాధికారి శివప్రసాద్‌, ఎంపీఓ శివకుమార్‌ సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-20T07:55:23+05:30 IST