డిగ్రీ, పీజీ విద్యా సంవత్సరం.. ఈ ఏడాది ఇలా..!

ABN , First Publish Date - 2022-05-16T16:55:15+05:30 IST

ప్రవేశ పరీక్షల్లో జాప్యం.. తరగతులు ఆలస్యం.. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా రెండేళ్ల నుంచి రాష్ట్రంలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ), పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) విద్య పరిస్థితిది. ఒకవిధంగా చెప్పాలంటే యూజీ, పీజీ విద్యా క్యాలెండర్‌ గాడి తప్పింది. అయితే, ప్రస్తుతం...

డిగ్రీ, పీజీ విద్యా సంవత్సరం.. ఈ ఏడాది ఇలా..!

కొత్త క్యాలెండర్‌పై అధికారుల కసరత్తు

జూలైలోనే మొదలుపెట్టేందుకు చర్యలు!

రెండేళ్లుగా కొవిడ్‌తో దెబ్బతిన్న షెడ్యూల్‌ 

విదేశాలు, ఉద్యోగాలకు వెళ్లేవారికి ఇబ్బంది

ఈసారి వాటిని అధిగమించే ప్రయత్నాలు

నేడు వీసీలతో ఉన్నత విద్యా మండలి సమావేశం

జూన్‌ 20లోగా ఇంటర్మీడియట్‌ ఫలితాలు!

అదే రోజు దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల


హైదరాబాద్‌, మే 15(ఆంధ్రజ్యోతి): ప్రవేశ పరీక్షల్లో జాప్యం.. తరగతులు ఆలస్యం.. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా రెండేళ్ల నుంచి రాష్ట్రంలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌(Undergraduate) (యూజీ), పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) విద్య పరిస్థితిది. ఒకవిధంగా చెప్పాలంటే యూజీ, పీజీ విద్యా క్యాలెండర్‌( PG Educational Calendar‌) గాడి తప్పింది. అయితే, ప్రస్తుతం అడ్డంకులన్నీ తొలగడంతో దీనిని సరిచేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యా క్యాలెండర్‌ను కొంతముందుగానే ప్రారంభించాలని భావిస్తున్నారు. యూజీ, పీజీ విద్య మధ్య సమన్వయం కుదర్చడంతో పాటు, విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు సమయం వృథా కాకుండా తగిన చర్యలు తీసుకోనున్నారు.


వీటిపై చర్చించేందుకు సోమవారం అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణతో పాటు, కొత్త ప్రవేశాలు, తరగతుల ప్రారంభంపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కోర్సు చేసిన విద్యార్థులు ఏటా పెద్దఎత్తున విదేశాలకు ఉన్నత చదువు, ఉద్యోగం కోసం కూడా వెళ్తుంటారు. అయితే, రెండేళ్ల నుంచి కొవిడ్‌తో వార్షిక పరీక్షలు పూర్తిచేసి, ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యమైంది. యూజీ, పీజీ విద్య మధ్య సమన్వయం కుదరలేదు. దాంతో విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు షెడ్యూల్‌ కుదరలేదు. వీరంతా ఏడాది పాటు ఆగి ప్రయత్నం చేయాల్సి వచ్చింది. కొత్త విద్యా సంవత్సరాన్ని కొంతముందుగానే ప్రారంభిస్తే.. ఈ సాంకేతిక సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే విషయంపై సోమవారం చర్చించనున్నారు.


జూలై చివరి వారంలో డిగ్రీ తరగతులు

ఈ నెల 24తో ముగియనున్న ఇంటర్‌ పరీక్షల ఫలితాలను జూన్‌ 20 లోపు ప్రకటించే అవకాశం ఉంది. అదే రోజున డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని భావిస్తున్నారు. నెల రోజుల్లో దోస్త్‌ అడ్మిషన్లను పూర్తి చేయాలనే ప్రణాళికలో అధికారులు ఉన్నారు. తద్వారా జూలై ఆఖరు లేదా ఆగస్టు తొలి వారం నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.  మరోవైపు పీజీ ప్రవేశాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో పీజీకి కామన్‌ ఎంట్రన్స్‌  నిర్వహిస్తున్నారు. దీనిలో వచ్చే ర్యాంకు ఆధారంగా ఆయా వర్సిటీల్లో చేర్చుకోనున్నారు. కాగా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా పీజీ ఎంట్రన్స్‌లో ఒకే రకమైన కోర్సుల ప్రవేశాలకు ఒకే ప్రశ్నపత్రం రూపొందించాలని చూస్తున్నారు. మరోవైపు త్వరలోనే డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నారు. అవి పూర్తి కాగానే పీజీ కామన్‌ ఎంట్రెన్స్‌ జరుగనుంది.

Updated Date - 2022-05-16T16:55:15+05:30 IST