అధికారుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం

ABN , First Publish Date - 2021-03-08T05:10:51+05:30 IST

అభివృద్ధి పనుల ఎం.బుక్‌ల విషయంలో ఇద్దరు అధికారుల మధ్య వివాదం రేగింది. తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం నెలకొంది.

అధికారుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం

కనిపించని అభివృద్ధి పనుల ఎం.బుక్‌

సంజాయిషీ ఇవ్వాలని కొండపి డీఈకి కందుకూరు ఈఈ ఆదేశం

కాకర్లలో జరిగిన పనుల గొడవే కారణమా?

అధికారుల మధ్య అంతర్యుద్ధంతో బిల్లులకు కొర్రీలు


కొండపి, మార్చి 7 : అభివృద్ధి పనుల ఎం.బుక్‌ల విషయంలో ఇద్దరు అధికారుల మధ్య వివాదం రేగింది. తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం నెలకొంది. వివరాల్లోకెళ్తే... మర్రిపూడి మండలంలోని కాకర్ల పంచాయతీలో జరిగిన పనుల విషయంలో ఆ మండల జేఈకి, కొండపి పంచాయతీరాజ్‌ డీఈకి రెండు రోజుల క్రితం డీఈ కార్యాలయంలో వాదోపవాదాలు జరిగాయి. ఈ విషయంపై ఆ రోజున అధికారులిరువురూ తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు. ఆ పనులకు సంబంధించి ఎం.బుక్‌లు తన వద్ద లేవని డీఈ చెప్పారు. కొవిడ్‌ సమయంలో ఎక్కడ పెట్టింది తెలియదని, తన కార్యాలయంలో లేవని డీఈ సంబంధిత ఏఈకి తెలిపారు. ఇదిలా ఉండగా, కాకర్ల పంచాయతీలో రూ.90 లక్షల పనులకు సంబంధించిన ఎంబుక్‌లు కనిపించని విషయంపై పనులు చేసిన కాంట్రాక్టర్‌ వేమిరెడ్డి లక్ష్మీనర్సారెడ్డి శనివారం కందుకూరు పీఆర్‌ ఈఈకి ఫిర్యాదు చేశారు. అదేరోజు పీఆర్‌ కొండపి డీఈకి ఎంబుక్‌ల విషయమై సంజాయిషీ ఇవ్వాలని కోరారు. పీఆర్‌ కొండపి డీఈకి ఆయన పరిధిలో ఉన్న కొండపి, మర్రిపూడి మండలాల ఏఈలకు తరచూ బిల్లుల విషయంపై ఆరునెలలుగా పదేపదే గొడవలు జరుగుతున్నాయి. అధికారుల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా కొండపి పీఆర్‌ డివిజన్‌లో బిల్లులు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని కాంట్రాక్టర్లు ఇప్పటికే ఉన్నతాధికారులకు పలుదఫాలుగా ఫిర్యాదుచేశారు. డీఈ పరిధిలో ఉన్న మూడు మండలాలను మరో డీఈకి కేటాయించారు. అప్పటి నుంచి వివాదం ముదురుతూ వస్తున్నది. తన వద్దకు వచ్చిన బిల్లులు పెండింగ్‌ ఉండటం లేదని డీఈ అంటుండగా, డీఈ బిల్లులు చేయకుండా కొర్రీలు పెడుతున్నాడని కింది అధికారులు వాపోతున్నారు. మొత్తంగా బిల్లులు చెల్లింపుల్లో జాప్యం కారణంగా గ్రామ సచివాలయాలు, పలు నిర్మాణ పనులు ఆగిపోయాయి. అధికారుల మధ్య అంతర్యుద్ధం చర్చనీయాంశమైంది.

Updated Date - 2021-03-08T05:10:51+05:30 IST