అక్కడ నేనే.. ఇక్కడా నేనే.. ఆపేదెవరు!

ABN , First Publish Date - 2022-07-17T05:42:34+05:30 IST

అసలే అది కాసులు కురిపించే పోస్టు.. మరోవైపు ఉన్నతస్థాయిలో అధికారుల అండదండలు, రాజకీయ పలుకుబడి... వెరసి.. ఓ ఏడీ స్థాయి అధికారికి సీనియార్టీలో వెనుక ఉన్నా కాదని రెండు జిల్లాల్లో కీలక పోస్టుల్లో బాధ్యతలు అప్పగించారు.

అక్కడ నేనే.. ఇక్కడా నేనే.. ఆపేదెవరు!

ప్రభుత్వ ఉత్వర్వులు బేఖాతరు

అధికార, రాజకీయ అండతో అధికారి హల్‌చల్‌

పాత తేదీలతో బిల్లులు పాస్‌చేసి లక్షలు కొల్లగొట్టేందుకు యత్నం

త్వరలో జరిగే బదిలీల్లో కాసులు కురిపించుకునేందుకు ప్రణాళిక

విద్యాశాఖకు అనుబంధంగా ఉన్నశాఖలో అధికారి బాగోతం


గుంటూరు(విద్య), జూలై 16: అసలే అది కాసులు కురిపించే పోస్టు.. మరోవైపు ఉన్నతస్థాయిలో అధికారుల అండదండలు, రాజకీయ పలుకుబడి... వెరసి.. ఓ ఏడీ స్థాయి అధికారికి సీనియార్టీలో వెనుక ఉన్నా కాదని  రెండు జిల్లాల్లో కీలక పోస్టుల్లో బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన రెండు జిల్లాల్లో పోస్టులో కూడా కొనసాగుతూ హల్‌చల్‌ చేస్తున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్‌ చేస్తూ ఓ అధికారి అండతో, రాజకీయ ప్రాబల్యంతో చేస్తున్న హంగామా, ఆర్భాటం విస్మయానికి గురిచేస్తోంది. విద్యాశాఖకు అనుబంధంగా ఉండి విద్యాభివృద్ధిలో  కీలక భూమిక పోషించే శాఖలో ఉన్న అధికారిని ఇటీవల ఉన్నతాధికారులు కొత్తగా ఏర్పడి జిల్లాలో కీలక భాధ్యతలతో పాటు, జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సదరు అధికారి మాత్రం ఇప్పటివరకు పనిచేసిన శాఖలోనే ఉంటూ సెటిల్‌మెంట్లు చేసుకుంటూ, పాత డేట్ల బిల్లులు పాస్‌చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఈ శాఖ ఆధ్వర్యంలో త్వరలో జరిగే బదిలీలను కాసులుగా మార్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాలో బాధ్యతలు స్వీకరించి పాతచోట రీలీవ్‌ కాకుండానే రోజూ కార్యాలయానికి వస్తూ ఉద్యోగులపై హల్‌చల్‌ చేస్తున్నాడు. కొత్త స్థానంలో బాధ్యతలు స్వీకరించి పాతస్థానంలో పనిచేస్తున్నా అడిగేవారు కరువయ్యారు. అదేమంటే తనకు ఉన్నత స్థాయిలో ఓ అధికారి అండదండలున్నాయని, ఆయనే రెండు జిల్లాల్లో పనిచేయమన్నాడని చెబుతున్నాడు. మరోవైపు తాను  ఓ మాజీమంత్రి బంధువునంటూ సదరు అధికారి చేస్తున్న హల్‌చల్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లగా విజిలెన్స్‌ శాఖ ఆరా తీస్తోంది.


 పాత తేదీలతో బిల్లులు పాస్‌చేసుకునే పనిలో...

విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న ఆ శాఖలో చేసిన  పనులు, చేయని పనులకు కూడా పాతతేదీలు వేసి బిల్లు పెట్టి నిధులు డ్రా చేయడానికి సదరు అధికారి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి కార్యాలయంలో మకాంవేసి దాదాపు రూ.25 నుంచి రూ.30లక్షల వరకు బిల్లులు పాస్‌చేసుకునే పనిలో ఉన్నట్లు అక్కడ పనిచేసే సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధికారి చేసే నిర్వాకంతో తరువాత ఎక్కడ తాము ఆడిట్‌ ఇబ్బందులు ఎర్కొవాల్సి వస్తుందోనని ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఎదురు చెబితే వారిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ దూషణలకు దిగుతున్నట్లు సిబ్బంది బెంబేలెత్తున్నారు. మరోవైపు కార్యాలయం కోసం కొన్న ఫర్నిఛర్‌, కంప్యూటర్స్‌ కూడా తనతోపాటు తీసుకెళ్లి ఆయన అనధికారికంగా చేస్తున్న వ్యాపార సంస్థలో పెట్టడానికి  ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

 

Updated Date - 2022-07-17T05:42:34+05:30 IST