ఆఫీస్‌ స్పేస్‌కు భారీగా తగ్గిన గిరాకీ

ABN , First Publish Date - 2020-07-09T06:22:49+05:30 IST

కరోనా మహమ్మారి స్థిరాస్తి రంగానికీ చుక్కలు చూపిస్తోంది. ఈ దెబ్బతో కంపెనీలు, తమ విస్తరణ ప్రణాళికలు పక్కన పెట్టాయి. దీంతో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో లీజుకు తీసుకునే ఆఫీసు స్థలాల విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది...

ఆఫీస్‌ స్పేస్‌కు భారీగా తగ్గిన గిరాకీ

  • హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి స్థిరాస్తి రంగానికీ చుక్కలు చూపిస్తోంది. ఈ దెబ్బతో కంపెనీలు, తమ విస్తరణ ప్రణాళికలు పక్కన పెట్టాయి. దీంతో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో లీజుకు తీసుకునే ఆఫీసు స్థలాల విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. జూన్‌ త్రైమాసికంలో ఇది 73 శాతం పడిపోయినట్టు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సేవల సంస్థ ‘కుష్‌మాన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌’ తాజా నివేదికలో తెలిపింది. గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కంపెనీలు 139.85 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. జూన్‌, 2020తో ముగిసిన త్రైమాసికంలో ఇది 37.15 లక్షల ఎస్‌ఎ్‌ఫటీకి పడిపోయింది.


జనవరి నుంచీ కష్టాలే 

కోవిడ్‌కు ముందు నుంచే కంపెనీలు విస్తరణ ప్రణాళికలు పక్కన పెట్టాయి. అప్పటి నుంచే దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలాల లీజు లు తగ్గిపోయాయి. గత ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌, కోల్‌కతా నగరాల్లో కంపెనీలు 255.48 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీసు స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. ఈ సంవత్స రం జనవరి-జూన్‌ మధ్య కాలంలో అది 57 శాతం తగ్గి 110.75 లక్షల ఎస్‌ఎ్‌ఫటీకి పడిపోయిందని ఆ సంస్థ  పేర్కొంది. 


హైదరాబాద్‌లో 17.58 లక్షల ఎస్‌ఎఫ్‌టీనే

హైదరాబాద్‌ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి. గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో హైదరాబాద్‌లో వివిధ కంపెనీలు 57.78 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ స్థలాన్ని ఆఫీసుల కోసం లీజుకు తీసుకున్నాయి. ఈ సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అది 17.58 లక్షల ఎస్‌ఎ్‌ఫటీకి పడిపోయిందని ‘కుష్‌మాన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌’ పేర్కొంది. 


జూన్‌లో పుంజుకున్న నియామకాలు 

ముంబై: లాక్‌డౌన్‌ సడలింపులతో కంపెనీల్లో కొత్త కొలువుల నియామకాలు జోరందుకున్నాయి. మే నెలతో పోలిస్తే జూన్‌లో నియామకాలు 33 శాతం పెరిగాయని నౌకరీ.కామ్‌  తెలిపింది. ఈ ఏడాది మే నెల్లో 910గా ఉన్న కొలువుల నియామకాలు  జూన్‌ నెల్లో 1,208కు పెరిగాయి. అయితే గత ఏడాది జూన్‌తో పోలిస్తే మాత్రం  నియామకాలు 44 శాతం పడిపోయినట్టు నౌకరీ.కామ్‌ పేర్కొంది. 


Updated Date - 2020-07-09T06:22:49+05:30 IST