కార్యాలయాల్లో.. కోవర్టులు

ABN , First Publish Date - 2022-07-22T05:30:00+05:30 IST

వారు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రజలకు సంబంధించి ఆయా కార్యాలయాల్లో సేవలు అందించాలి. అందుకు వారికి ప్రభుత్వం జీతాలు ఇస్తోంది.

కార్యాలయాల్లో.. కోవర్టులు
బాపట్ల కలెక్టరేట్‌

నాయకులకు విధేయులుగా ఉద్యోగులు 

రాజకీయ యంత్రాంగంగా కొందరు సిబ్బంది

తోటి సిబ్బంది, అధికారులపై అనధికార పెత్తనం

నాయకుల దృష్టికి ప్రతిదీ తీసుకెళ్లడమే వారి పని

అంతర్గత సమావేశాల సారాంశం ఎప్పటికప్పుడు లీకు

అధికార పార్టీ మనుషులమంటూ యథేచ్ఛగా హల్‌చల్‌

గతంలో ఓ స్థాయి వరకు రహస్యంగా.. నేడు బహిరంగంగా 



బాపట్ల, జూలై 22 (ఆంధ్రజ్యోతి): వారు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రజలకు సంబంధించి ఆయా కార్యాలయాల్లో సేవలు అందించాలి. అందుకు వారికి ప్రభుత్వం జీతాలు ఇస్తోంది. అయితే వారు చేయాల్సిన పని మాని రాజకీయ మంత్రాంగం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పొలిటికల్‌ కోవర్టులుగా వ్యవహారాలు నడుపుతున్నారు. రాజకీయ నాయకులకు అనుచరులుగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు ఆయా కార్యాలయాల్లోని సమాచారాన్ని, అధికారుల సమీక్షల విషయాలను చేరవేస్తున్నారు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో వివిధ విభాగాల్లోని కొందరు ఉద్యోగులు పనిచేయడం అనేది గతంలో కూడా ఉంది. అయితే అది ఒక స్థాయి వరకే పరిమితమయ్యేది. అది కూడా రహస్యంగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా బహిరంగమే.. ఏదీ దాపరికంలేదు. తాము ఫలానా రాజకీయ నాయకుడికి విధేయులమని  చెప్పుకుంటూ కార్యాలయాల్లోని అధికారులపైన, తోటి సిబ్బందిపై కొంతమంది అనధికారిక పెత్తనం చేస్తున్నారు. కలెక్టర్‌ సమీక్షల నుంచి విభాగాధిపతుల సమావేశాల వరకు వాటి సారాంశాన్ని ఎప్పటికప్పుడు నేతాలకి అందిస్తూ వారి రుణం తీర్చుకుంటూ ఉన్నారు. కొందరు ఇంతటితో పరిమితమవుతుండగా మరికొంతమంది రోజూ సదరు నేతల ఇళ్ల దగ్గర హాజరు వేయించుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పెడపోకడలు వంట పట్టని అధికారులు వీరి వ్యవహారశైలిపై కన్నెర్ర చేస్తే రాజకీయ అండతో వారిపై ఎదురు తిరగడానికి కూడా  కింద స్థాయి సిబ్బంది జంకడం లేదు. 


కలెక్టర్‌ సమీక్షల సారాంశం చేరవేత

జిల్లా పాలనాధికారి నిత్యం ఏదో ఒక అంశం మీద సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు సూచనలతో పాటు కొన్ని అంశాలపై హెచ్చరిక స్వరంతో ఆదేశాలివ్వడం అనేది పరిపాటి. ఈ సమీక్షలకు జిల్లా స్థాయి అధికారులతోపాటు వారి వెంట ఒకరిద్దరు కిందిస్థాయి సిబ్బంది కూడా హాజరవుతూ ఉంటారు. వీటిలో కొన్ని బయటకు చెప్పకూడనివి కూడా ఉంటాయి. కలెక్టర్‌కు వివిధ మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని బేరీజు వేసుకుని శాఖపరమైన విచారణను కూడా రహస్యంగా జరుపుతూ ఉంటారు. ఇటీవల కలెక్టర్‌ సమీక్షలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడి దందాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. వెంటనే ఆ సమాచారం ఆ ముఖ్యనేతకు చేరింది. దీంతో ఆ నేత ఆ విభాగాధిపతికి ఫోన్‌ చేయడంతో అవాక్కవడం ఆయన వంతైంది. కిందిస్థాయి సిబ్బందికి అప్పగించిన పనిమీద ఫలితాన్ని అడిగితే నిర్లక్ష్యంగా తాము అధికారపార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని బెదిరింపులకు దిగిన సంఘటన ఇటీవల అద్దంకి నియోజకవర్గ పరిధిలో జరిగినట్లు సమాచారం. కీలక స్థానాల్లో ఉన్న అధికారులు కొంతమంది రాజకీయ నాయకులతో అంటకాగుతుంటే, కిందిస్థాయి సిబ్బంది హద్దుమీరి పై అధికారులతో వ్యవహరిస్తున్నారు.


మున్సిపాల్టీల్లో దందా 

వివిధ పనుల కోసం వచ్చే ప్రజల దగ్గర నుంచి లంచాలు వసూలు చేయడం పాత పద్ధతి. ఇప్పుడు ఒక కొత్త ట్రెండును కొంతమంది అధికారులు సృష్టించారు. మున్సిపాలిటీల్లో ఇలాంటి దందా ముమ్మరంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. లే అవుట్‌ అనుమతులు, ఇంకేదైనా పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల వ్యవహారం మున్సిపాలిటీ అఽధికారుల దృష్టికి వస్తే గుట్టు చప్పుడు కాకుండా ఆ విషయాన్ని అఽధికారపార్టీలోని చోటామోటా నాయకులకు చేరవేస్తున్నారు. వారు  వెంటనే రంగంలోకి ఆ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.  ఈ మొత్తం వ్యవహారంలో సిబ్బందే కీలకంగా వ్యవహరించడం పట్ల ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓ కీలక అధికారి ఇలాంటి విషయాలన్నీ దగ్గరుండి చూస్తున్నట్లు తెలుస్తోంది.


ఫైల్స్‌ పట్టుకుని ఇళ్ల దగ్గరకు....

సాధారణంగా అధికారిక సమీక్షలు ప్రభుత్వ బంగాళాలు, ఆయా శాఖల కార్యాలయాల్లో జరగాలి. మరీ ప్రాధాన్యం గల విషయమైతే కలెక్టర్‌ తన నివాసంలో చేస్తారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు అధికారులను ఇళ్ల దగ్గరకు పిలిపించుకుని అనఽధికార సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమావేశాలకు కొంత మంది అధికారులు ససేమిరా అంటున్నా అక్కడ కూడా కొంత మంది కిందిస్థాయి సిబ్బంది ఫైల్స్‌ పట్టుకుని వారి దగ్గరకు వెళ్లి నేతల సేవలో తరించిపోతున్నారు.


నిబద్ధత గల అధికారులకు ప్రతిబంధకం 

సమర్థత, నిబద్ధత గల అఽధికారులకు ఈ రాజకీయ మంత్రాంగం ప్రతిబంధకంగా తయారవుతోంది. నిత్యం తాము అభద్రతా భావంలో పనిచేయాల్సిన దుస్థితి దాపురించిందని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి వాపోయారు. తాము సిబ్బంది దగ్గర ఏ విషయం చెప్పాలో ఏదీ చెప్పకూడదో తెలయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పెడపోకడలకు చెక్‌పెట్టాలంటే అంటకాగుతున్న ఒకరిద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటేనే దారికొస్తారనే అభిప్రాయాన్ని కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.


 

Updated Date - 2022-07-22T05:30:00+05:30 IST