ఇంటింటికి పుస్తకాలు అందిస్తూ...

ABN , First Publish Date - 2021-01-04T05:30:00+05:30 IST

రాధామణి ఊరు వయనాడు జిల్లాలో కొండ ప్రాంతంలోని మోథక్కర. ఆ ఊళ్లో ప్రతిభా పబ్లిక్‌ లైబ్రరీ ఉండబట్టి అరవై ఏళ్లు అవుతోంది.

ఇంటింటికి పుస్తకాలు అందిస్తూ...

చేతిలో సంచీ నిండా వివిధ రకాల పుస్తకాలతో కాలినడకనే ఇంటింటికి వెళతారామె. గ్రామీణ మహిళలతో పుస్తకాలు చదివించే బాధ్యతను గత ఎనిమిదేళ్లుగా భుజాన మోస్తున్నారు కేరళకు చెందిన అరవై నాలుగేళ్ల రాధామణి. నడిచే గ్రంథాలయంగా పేరొందిన ఆమె పుస్తక ప్రయాణమిది.


రాధామణి ఊరు వయనాడు జిల్లాలో కొండ ప్రాంతంలోని మోథక్కర. ఆ ఊళ్లో ప్రతిభా పబ్లిక్‌ లైబ్రరీ ఉండబట్టి అరవై ఏళ్లు అవుతోంది. కానీ అక్కడకు పుస్తకాలు చదివేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. ముఖ్యంగా మహిళలు రోజంతా పొలం పనులు, ఇంటిపనులతో వారికి తీరిక దొరికేది కాదు. లైబ్రరీ కూడా దూరంలో ఉండడంతో వారు వైపు వెళ్లేవారే కాదు. కానీ ఎప్పుడైతే రాధామణి ‘వాకింగ్‌ లైబ్రేరియన్‌’గా విధుల్లో చేరారో పరిస్థితి మారిపోయింది.


పుస్తక పఠనం వైపు నడిపించారిలా

మహిళల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ‘ఉమెన్స్‌ రీడింగ్‌ ప్రాజెక్ట్‌’ చేపట్టిన కేరళ స్టేట్‌ లైబ్రరీ కౌన్సిల్‌ వాకింగ్‌ లైబ్రేరియన్‌ ఉద్యోగాన్ని సృష్టించింది. 2012లో వాకింగ్‌ లైబ్రేరియన్‌గా విధుల్లో చేరిన రాధామణి చాలా మార్పు తీసుకొచ్చారు. ‘‘నేను ప్రతిభా లైబ్రరీలో ఉద్యోగంలో చేరిన తరవాత మహిళలకు ప్రతిసారి రెండు కొత్త పుస్తకాలు ఇచ్చేదాన్ని. ఎనిమిది రోజులయ్యాక వాటిని తీసుకునేదాన్ని.


ఇన్నిరోజుల్లో ఎవరెవరు ఏరకం పుస్తకాలు ఇష్టపడతారో తెలుసుకున్నా. వారు కోరిన పుస్తకాల జాబితా రాసుకొని లైబ్రరీలో వెతికి, మరునాడు వాళ్లకు అందజేస్తాను. ఇప్పుడైతే కొందరు ఫలానా పుస్తకం కావాలని ముందే అడుగుతున్నారు. ప్రస్తుతం నెలకు 500 నుంచి 550 పుస్తకాలు అందజేస్తున్నా. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటిపట్టునే ఉండాల్సి రావడంతో చాలామంది పుస్తకాల కోసం మా ఇంటి వద్ద క్యూ కట్టేవారు’’ అని చెబుతారీ వాకింగ్‌ లైబ్రేరియన్‌. 




సొంత డబ్బులతో సభ్యత్వం

పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉండి, సభ్యత్వం తీసుకునేందుకు డబ్బులు లేనివారికి ఆమె తన సొంత డబ్బు చెల్లించి సభ్యత్వం ఇప్పించారు. ప్రస్తుతం ప్రతిభా పబ్లిక్‌ లైబ్రరీలో 102 మంది సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో 94మంది మహిళలు ఉన్నారంటే అదంతా రాధామణి ప్రోత్సాహం, చలవే. సెలవురోజైన ఆదివారం కూడా సంచీలో పుస్తకాలతో బయలుదేరుతారామె.


‘‘మిగతా రోజుల్లో మహిళలంతా పనులకు వెళతారు. ఆదివారం ఒక్కరోజే వాళ్లు ఇంటి వద్ద ఉంటారు. అరోజు వారి ఇళ్లకు వెళ్లి పుస్తకాలు ఇస్తాను’’ అంటున్న రాధామణికి చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం ఉండేది. వాళ్ల నాన్న చదువుకోలేదు. దాంతో వార్తాపత్రికల్లోని విషయాలు, పలు రకాల కథల పుస్తకాలను చదివి ఆయనకు వినిపించేవారామె. నిద్రపోయే ముందు కూడా ఏదో ఒక పుస్తకం చదివే అలవాటును ఆమె ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అరవై నాలుగేళ్ల వయసులోనూ అలసట, విరామం లేకుండా రోజు నాలుగు కిలోమీటర్లు నడుస్తూ ఇంటింటా అక్షర సేద్యానికి బాటలు వేస్తున్న రాధామణి ప్రయత్నాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.  



పెళ్లి అయిన తరువాత ఇల్లు గడవడం కోసం రాధామణి మొదట్లో ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేశారు. తరువాత బాలవడీ టీచర్‌గా గిరిజన పిల్లలకు పాఠాలు చెప్పారు. లైబ్రేరియన్‌గా పనిచేసిన అనుభవంతో టూరిస్ట్‌ గైడ్‌గానూ సేవలందిస్తున్నారామె.

‘‘రోజూ రెండు మూడు కిలోమీటర్లు నడవడం నాకేమి కష్టంగా అనిపించదు. టూరిస్ట్‌ గైడ్‌గా కొండలు, గుట్టలు ఎక్కడం నాకు అలవాటే. మొదటల్లో సంచీలో 50 పుస్తకాలు తీసుకెళ్లేదాన్ని. అయితే ఎత్తైన ప్రాంతాలు ఎక్కేటప్పుడు సంచీ బరువుగా అనిపించేది. దాంతో ఇప్పుడు 25 పుస్తకాలకు మించి తీసుకెళ్లడం లేదు’’ అంటున్న రాధామణి తన ఉద్యోగాన్ని ఎంతో ప్రేమిస్తారు. 


Updated Date - 2021-01-04T05:30:00+05:30 IST