Abn logo
Mar 27 2020 @ 05:19AM

వారెక్కడ..?

విదేశాల నుంచి వచ్చినవారిలో 53 మంది జాడ కరువు

అంతటా ఆరా తీస్తున్న అధికారులు 


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ఓవైపు కరోనా మహమ్మారి అందరినీ వణికిస్తుంటే... విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన కొందరి ఆచూకీ లభించక అధికారులు టెన్షన్‌ పడుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని అధికారులు పదే పదే చెబుతున్నారు. తప్పనిసరిగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలనే నిబంధన విధించారు. అయినా.. కొందరు ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోకుండా రహస్య ప్రదేశాల్లో తల దాచుకుంటున్నారు. అటువంటి వారిని గుర్తించడం అధికారులకు సవాల్‌గా మారుతోంది.  


జిల్లాకు 1,636 మంది రాక

ఉపాధి కోసం జిల్లా నుంచి ఎక్కువ మంది ఇటలీ, సింగపూర్‌, మలేషియా, యూకే, ఇరాన్‌, యూఎస్‌ఏ, కజకిస్తాన్‌, దుబాయ్‌, ఆప్ఘనిస్తాన్‌ వంటి దేశాలకు వెళ్లారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశాల్లో ఉన్న వారంతా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, కంచిలి, గార, సోంపేట, ఇచ్ఛాపురం మండలాలకు అధికశాతం తరలివచ్చారు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా.. విదేశాల నుంచి వచ్చిన వారికి అధికారులు ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు. 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచిస్తున్నారు.


లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే పాస్‌పోర్టును రద్దు చేస్తామని స్వయంగా కలెక్టర్‌ జె.నివాస్‌ హెచ్చరించారు. జిల్లాకు అధికారుల నివేదిక ప్రకారం ఇప్పటి వరకు విదేశాల నుంచి 1,636 మంది చేరుకున్నారు. వీరిలో గురువారం నాటికి 1,583 మందిని అధికారులు గుర్తించి క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. మిగిలిన  53 మంది వివరాలు అధికారులకు సైతం చిక్కడం లేదని సమాచారం. 


వీరంతా జిల్లాలోనే ఉన్నా, పరీక్షల పేరుతో క్వారంటైన్‌ సెంటర్లకు, ఐసోలేషన్‌ కేంద్రాలకు  తరలించి హడావుడి చేస్తారనే భయంతో రహస్య ప్రదేశాల్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, అధికారులు గుర్తించిన విదేశీయుల్లో ప్రస్తుతం వ్యాధి లక్షణాలున్న 51 మందిని ఎచ్చెర్లలోని వర్సిటీ క్యాంపస్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌లో ఉంచారు. వీరి పరీక్షల నమూనాలను తిరుపతి పంపారు. వీరంతా ప్రస్తుతం కోలుకుంటున్నారు.


ఒక్క పాజిటివ్‌ కేసు లేకపోయినా...

జిల్లా నుంచి ఇప్పటి వరకు పరీక్షల కోసం పంపిన 12 నమూనాలలో ఒక్క కేసు కూడా పాజిటివ్‌ రాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ జిల్లాకు చేరుకొని, కనిపించకుండా తిరుగుతున్న 53 మంది వివరాల కోసం అధికారులకు హైరానా తప్పడం లేదు. గత నాలుగు రోజులుగా వీరి ఆచూకీ కోసం పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖల అధికారులు ఆరా తీస్తున్నా, జాడ లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.  విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినా ఫలితం లేకపోతోంది.


అసలు జిల్లాకు చేరిన వీరంతా ఇక్కడే ఉన్నారా, లేక మరెక్కడైనా తల దాచుకున్నారా..? వీరికి కరోనా వైరస్‌ పరీక్షలు విమానాశ్రయాల్లో జరిగాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్‌ విస్తరణ కట్టడిలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమను కలవాలని అధికారులు సూచిస్తున్నారు. 


జల్లెడ పట్టాల్సిందే... ఆరోగ్య సిబ్బందిని ఆదేశించిన కలెక్టర్‌ 

కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లా పరిషత్‌ సమావేశమందిరంలో కలెక్టర్‌ నివాస్‌ ఆరోగ్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాకు విదేశాల నుంచి వచ్చినవారు 1,636 మంది అని, ప్రతిఒక్కరిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితి, వారి కార్యకలాపాలపై జల్లెడ పట్టాల్సిందేనని కలెక్టర్‌ ఆదేశించారు. ఒక్కశాతం కూడా వదలొద్దని, ప్రతిఒక్కరిని గుర్తించాలన్నారు. వీరి వివరాలను ఎంబసీకి తెలియజేస్తామని చెప్పారు. శ్రీకాకుళం నగరంలో మరింత జాగ్రత్త వహించాలని, ఎంత కష్టపడితే అంత ఫలితాలు లభిస్తాయని  స్పష్టంచేశారు. 

Advertisement
Advertisement
Advertisement