ఒడిశా టూ హైదరాబాద్‌

ABN , First Publish Date - 2022-07-02T05:55:55+05:30 IST

గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను భువనగిరి రూరల్‌ పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ క

ఒడిశా టూ హైదరాబాద్‌
వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ ఎం భగవత్‌

 గంజాయి రవాణా ముఠాను ఛేదించిన భువనగిరి పోలీసులు 

 వివరాలు  వెల్లడించిన రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ ఎం భగవత్‌

భువనగిరి టౌన్‌, జూలై 1 : గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను భువనగిరి రూరల్‌ పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ కమిషనర్‌ మహేష్‌ ఎం భగవత్‌ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శుక్రవారం వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా చిత్తూరుకు చెందిన మక్క కృష్ణ అక్కడే స్కాప్‌(పాత ఇనుప సామాను) దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రం పప్పులూరుకు చెందిన రాము పరిచయమయ్యాడు. ఇరువురి మధ్య ఏర్పడిన స్నేహం అక్రమ సంపాదన వైపు మళ్లింది. ఈ క్రమంలో రెండు రోజుల కిందట రాము ఫోన్‌ చేసి తెలంగాణలోని భువనగిరి వరకు రోడ్డు మార్గంలో ఆటోలో గంజాయిని తరలిస్తే రూ.20వేలు ఇస్తానని తెలిపాడు. ఇందుకు కృష్ణ సమ్మతించాడు. భువనగిరి రాయగిరి వరకు 49 ప్యాకెట్ల గంజాయిని తీసుకెళితే అక్కడి నుంచి హైదరాబాద్‌కు మరో వ్యక్తి తీసుకెళ్తాడని చెప్పాడు. ఈ మేరకు కృష్ణ సమ్మతించి రూ.10వేలు ముందస్తుగా తీసుకొని గంజాయి ప్యాకెట్లను తీసుకొని శుక్రవారం తెల్లవారుజామున రాయిగిరి వద్దకు చేరుకున్నాడు. అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో పోలీసులు తనిఖీ చేయడంతో గంజాయి సరఫరా వెలుగు చేసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి గంజాయి, ఆటోను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. గంజాయి రవాణాను ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్‌ సీఐ వేణుగోపాల్‌, రూరల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌, ఎల్బీనగర్‌ ఎస్‌వోటీని డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ వెంకట్‌రెడ్డి అభినందించారు.  

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు 

జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామని పట్టణ ఇన్‌స్పెక్టర్‌ బి.సత్యనారాయణ, ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ స్థానిక బహర్‌పేటలో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గురువారం దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న కుంచెల నాగరాజు, అతడికి గంజాయిని సమకూరుస్తున్న వరుసకు మామ అచ్చి తిరుపతిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. నిందితుల వద్ద 250 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, రూ.500 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పుణ్యక్షేత్రాల్లోని సత్రాల వద్ద సాధువులతో ఏర్పడిన పరిచయంతో గంజాయిని కొనుగోలు చేసి భువనగిరిలో విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపారని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. గంజాయి విలువ 1000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-07-02T05:55:55+05:30 IST