ఏకతాటిపై ఒడిశా రాజకీయ పక్షాలు

ABN , First Publish Date - 2022-01-21T05:26:59+05:30 IST

గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో ఒడిశా చేసిన హడావుడి తెలిసిందే. ఇప్పుడు ఒడిశాలో పంచాయ

ఏకతాటిపై ఒడిశా రాజకీయ పక్షాలు


పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవానికి యత్నాలు

ఓటింగ్‌ తగ్గితే ‘కొఠియా’పై తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన

సాలూరు రూరల్‌, జనవరి 20: గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో ఒడిశా చేసిన హడావుడి తెలిసిందే. ఇప్పుడు ఒడిశాలో పంచాయతీ ఎన్నికల ప్రకటన రావడంతో అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. వచ్చే నెల 18న పోలింగ్‌కు ఏపీ అడ్డుపడుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటనకు ముందే పట్టుచెన్నారు,పగులుచెన్నారు,డోలియాంబ,ముడకారు తదితర గ్రామాల గిరిజనులు ఒడిశా ఎన్నికలను బహిష్కరిస్తామని బహిరంగంగా ప్రకటించారు. పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతం పాఢితో గిరిజనులు వాదనకు సైతం దిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం కొరాపుట్‌లోని ఓ హోటల్‌లో బీజేడీ, బీజేపీ,కాంగ్రెస్‌ పక్షాలు సమావేశమై చర్చించారు. బీజేడీ కోరాపుట్‌ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరచంద్రపాణిగ్రాహి, కొరాపుట్‌ ఎమ్మెల్యే రఘరాం పడాల్‌, పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతంపాఢి, కొరాపుట్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మీనాక్షి వాహినీపతి, బీజేపీ మాజీ ఎంపీ జయరాంపంగి తదితరులు సమావేశమయ్యారు. కొఠియా గ్రూపు గ్రామాల్లో పోలింగ్‌ తగ్గితే... కొఠియా గిరిజనులు ఒడిశా వైపు లేరనే ప్రచారానికి ఊతమిస్తుందని.. వీలైనంతగా ఏకగ్రీవాలు చేసుకోవాలని తీర్మానించారు. సర్పంచ్‌, వార్డు సభ్యుడు, సమితి సభ్యులకు ఒక్కరే బరిలో ఉంచేందుకు అంగీకరించారు. అభ్యర్థులు ఏ రాజకీయ పక్షానికి చెందిన వారు కాకుండా తటస్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.  కొఠియాలో పోలింగ్‌ నివారణకు ఒడిశా రాజకీయ పక్షాలు ఎన్నికల సమయంలో సైతం రాజకీయాలకతీతంగా ఒక్కటి కావడం విశేషం. కొఠియాలో ఇప్పటికే సర్పంచ్‌కు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. సమితికి బీజేపీ మాజీ ఎంపీ జయరాం పంగి కుమార్తె అంబికా పంగి నామినేషన్‌ వేశారు. నామిషన్ల ఉపసంహారణకు ఈ నెల 25న తుది గడువు. అప్పటికి రాజకీయాలు ఇలాగే కొనసాగి ఏకగ్రీవంగా కొఠియా ఎన్నికలు జరుగుతాయా? పోలింగ్‌ జరుగుతుందో వేచి చూడాల్సిందే. 



Updated Date - 2022-01-21T05:26:59+05:30 IST