Bay of Bengalలో తుపాన్ హెచ్చరిక...హైఅలర్ట్

ABN , First Publish Date - 2022-05-06T12:46:01+05:30 IST

బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు....

Bay of Bengalలో తుపాన్ హెచ్చరిక...హైఅలర్ట్

భువనేశ్వర్(ఒడిశా) : బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. 17 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు, 20 ఒడిశా విపత్తు రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సహాయ పునరావాస కార్యక్రమాల కోసం రంగంలోకి దించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా చెప్పారు. ఓడీఆర్ఏఎఫ్ బృందాలు, 175 అగ్నిమాపక బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉంచారు.తుపాన్ వల్ల ఒడిశాలోని 18 జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. 


తుపాన్ ప్రభావం వల్ల తూర్పు భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డీజీ మ్రుతుంజయ్ మహాపాత్ర చెప్పారు. ‘‘దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అండమాన్ దీవుల మీదుగా వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. మే 8 వతేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడుతుంది’’ అని వాతావరణశాఖ ప్రకటించింది.అల్పపీడనం కారణంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది.


 మే 5 నుంచి 8 వరకు ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ అధికారులు సూచించారు.ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ముఖ్యమంత్రి తుపానుపై పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని ఒడిశా ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి రణేంద్ర ప్రతాప్ స్వైన్ చెప్పారు.


Read more