ఒడిశా దూకుడు

ABN , First Publish Date - 2021-08-17T04:59:08+05:30 IST

మరోమారు ఒడిశా దూకుడు..

ఒడిశా దూకుడు

పట్టుచెన్నారు, పగులుచెన్నారు గ్రామాలు దిగ్బంధం

దారికి అడ్డంగా బారికేడ్లు

వ్యూహాత్మకంగా శంకుస్థాపనల అడ్డగింత

ఏపీ, సాలూరు ఎమ్మెల్యే గో బ్యాక్‌ అంటూ నినాదాలు

కలెక్టర్‌ సూర్యకుమారి సూచనతో కార్యక్రమం వాయిదా


సాలూరు రూరల్‌(విజయనగరం): కొఠియా గ్రూప్‌ గ్రామాలపై మరోమారు ఒడిశా దూకుడు ప్రదర్శించింది. పగులుచెన్నారు, పట్టుచెన్నారుల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు సోమవారం చేపట్టనున్న శంకుస్థాపనలను వ్యహాత్మకంగా అడ్డుకుంది. శాంతిభద్రతల పేరుతో ఆ రాష్ట్ర బలగాలను రంగంలోకి దించింది. బారికేడ్లను ఏర్పాటు చేసి రహదారి మూసివేసింది. తెల్లవారుజాము నుంచి రెండు గ్రామాలను ఒడిశా పోలీసులు పూర్తిగా దిగ్బంధించారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్‌లు సోమవారం పగులుచెన్నారు, పట్టుచెన్నారుల్లో ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ఒడిశా అధికారులు శంకుస్థాపనలను అడ్డుకునేందుకు వ్యూహం పన్నారు.


శాంతిభద్రతల పేరు చెప్పి ఆ రాష్ట్ర బలగాలను రంగంలోకి దించారు. శంకుస్థాపన ఏర్పాట్ల కోసం సోమవారం ఉదయం పట్టుచెన్నారు వెళ్తున్న ఏపీకి చెందిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావును అడ్డుకొని తిరిగి పంపించేశారు. పాఠశాల తెరవడానికి వెళ్లిన పగులుచెన్నారు ఉపాధ్యాయుడిని అడ్డుకున్నారు. ఆ గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. ఒడిశా నేతలు, కార్యకర్తలను మాత్రమే అనుమతించారు. గ్రామాల్లో యుద్ధవాతావరణాన్ని తలపింపజేశారు. కొరాపుట్‌ అడిషనల్‌ మెజిస్ట్రేట్‌ దేబాన్‌ కుమార్‌ ప్రధాన్‌, ఒక ప్రొబెషనరీ అధికారి, 11 మంది ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌లు(బీడీవోలు, తహసీల్దారులు)ను డెప్యూట్‌ చేశారు. వీరి ఆధ్వర్యంలో ఒడిశాకు చెందిన ఐదు ఫ్లటూన్ల పోలీసులు పహారా కాశారు. ఒడిశా పోలీసులు, అధికారులు అధికంగా రావడంతో కొఠియా గ్రూప్‌ గ్రామాల ప్రజలు భయపడ్డారు.


మరోవైపు ఒడిశాకు చెందిన బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పట్టుచెన్నారు చేరుకొని ఏపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొఠియా ఒడిశా మట్టి అని, ఏపీ అరాచకాలు సృష్టిస్తోందని అన్నారు. సాలూరు ఎమ్మెల్యే గో బ్యాక్‌, ఏపీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. కోరాపుట్‌, పొట్టంగి, జయపురం, లక్ష్మీపూర్‌ ఎమ్మెల్యేలు రఘురాం పడాల్‌, ప్రీతంపాఢి, వాహినీపతి, ప్రభుజాని, కొరాపుట్‌ మాజీ ఎంపీ జయరాం పంగి, మాజీ ఎమ్మెల్యే రామచంద్రకడెం తదితరులు కలియతిరిగారు. ఏపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొఠియాను వదులుకోబోమని ప్రతిజ్ఞ చేశారు. ఒడిశా దుందుడుకు చర్యలు గమనించిన కలెక్టర్‌ సూర్యకుమారి ఈ కార్యక్రమం వాయిదా వేసుకోవాలని సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరను కోరారు. ఒడిశా అధికారులు, పోలీసులు, రాజకీయ నేతలు హల్‌చల్‌ చేయడంతో శంకుస్థాపనను తాత్కాలికంగా వాయిదా వేశారు. విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారితో కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అక్తర్‌ చర్చించినట్టు తెలిసింది. అనంతరం అక్కడి కలెక్టర్‌ ఒడిశా మీడియాతో మాట్లాడుతూ శాంతిభద్రతలకు భంగం కలుగుతుందనే కారణంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు చెప్పడం కొసమెరుపు.





Updated Date - 2021-08-17T04:59:08+05:30 IST