కంగారూలదే కప్పు

ABN , First Publish Date - 2022-04-04T09:45:14+05:30 IST

టోర్నమెంట్‌ ఆసాంతం అద్భుత ఆటతో అదరగొట్టిన ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది.

కంగారూలదే కప్పు

ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం

అదరగొట్టిన హీలీ

ఆసీస్‌ మహిళల ఖాతాలో

 ఏడో ప్రపంచ టైటిల్‌

1 హీలీ చేసిన 170 రన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ (మహిళలు, పురుషులు) ఫైనల్లో అత్యధిక స్కోరు. 2007 ప్రపంచ కప్‌లో శ్రీలంకపై ఆసీస్‌కే చెందిన ఆడం గిల్‌క్రిస్ట్‌ (149) నెలకొల్పిన రికార్డును హీలీ బద్దలుగొట్టింది. 

2 వన్డే ప్రపంచ కప్‌ నాకౌట్‌ దశలో రెండు శతకాలు చేసిన హీలీ.. ఈ జాబితాలో పాంటింగ్‌, జయవర్ధనె సరసన చేరింది. 

509 ఈ టోర్నీలో హీలీ చేసిన పరుగులు.


క్రైస్ట్‌చర్చ్‌: టోర్నమెంట్‌ ఆసాంతం అద్భుత ఆటతో అదరగొట్టిన ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఆ జట్టు...అంతిమ సమరంలోనూ అదే ప్రదర్శన చేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను 71 పరుగులతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏడోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఓపెనర్‌ అలీసా హీలీ (138 బంతుల్లో 26 ఫోర్లతో 170) సెంచరీతో కదం తొక్కడంతో తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 356/5తో భారీ స్కోరు చేసింది.


మరో ఓపెనర్‌ హేన్స్‌ (68), మూనీ (62) హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటారు. ష్రబ్‌సోల్‌ (3/46) మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం రికార్డు ఛేదనలో ఇంగ్లండ్‌ 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. సివర్‌ (121 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 148 నాటౌట్‌) సెంచరీతో ఆకట్టుకున్నా..ఆమెకు సహకారం అందించే వారే కరవయ్యారు. ఈ టోర్నీలో సివర్‌కు ఆసీ్‌సపై ఇది రెండో శతకం కావడం విశేషం. జొనాసెన్‌ (3/57), అలన కింగ్‌ (3/63) మూడేసి వికెట్లు సాధించారు. అలీసా హీలీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డులు అందుకుంది. 


సంక్షిప్తస్కోర్లు

ఆస్ట్రేలియా:

50 ఓవర్లలో 356/5 (హీలీ 170, హేన్స్‌ 68, మూనీ 62, ష్రబ్‌సోల్‌ 3/46). 

ఇంగ్లండ్‌:

43.4 ఓవర్లలో 285 ఆలౌట్‌ (సివర్‌ 148 నాటౌట్‌, బ్యూమాంట్‌ 27, హీథర్‌నైట్‌ 26, డంక్లీ 22, జొనాసెన్‌ 3/57, కింగ్‌ 3/64, షుట్‌ 2/42).


Updated Date - 2022-04-04T09:45:14+05:30 IST