వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీకి ఉద్వాసన

ABN , First Publish Date - 2021-12-09T09:32:28+05:30 IST

ఊహించినదే జరిగింది. టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు విరాట్‌ కోహ్లీ కొద్దినెలల కిందట ప్రకటించడం, అతడి స్థానంలో రోహిత్‌ శర్మను సారథిగా ఎంపిక చేయడంతోనే..

వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీకి ఉద్వాసన

  • కొత్త సారథి రోహిత్‌
  • టెస్ట్‌ వైస్‌కెప్టెన్‌గా రహానెపై వేటు
  • ఆ బాధ్యతలూ హిట్‌మ్యాన్‌కే
  • సెలెక్షన్‌ కమిటీ అనూహ్య నిర్ణయం


దక్షిణాఫ్రికాతో టెస్ట్‌లకు 18మందితో జట్టు

విహారి పునరాగమనం

రహానె, పుజార, ఇషాంత్‌ చోటు పదిలం


న్యూఢిల్లీ: ఊహించినదే జరిగింది. టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు విరాట్‌ కోహ్లీ కొద్దినెలల కిందట ప్రకటించడం, అతడి స్థానంలో రోహిత్‌ శర్మను సారథిగా ఎంపిక చేయడంతోనే.. విరాట్‌ వన్డే కెప్టెన్సీకూడా పదిలం కాదనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి. దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత టెస్ట్‌ జట్టు ఎంపిక కోసం బుధవారం సమావేశమైన సెలెక్షన్‌ కమిటీ.. వన్డే సారథిగా కోహ్లీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా నియమించింది. రోహిత్‌ ఇప్పటికే టీ20 సారథిగా ఉండగా.. తాజా నియామకంతో పరిమిత ఓవర్ల జట్టుకు అతడే ఏకైక కెప్టెన్‌ అయినట్టయింది. దీంతో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా కోహ్లీ ఐదేళ్ల కాలానికి తెరపడింది. అలాగే టెస్ట్‌ జట్టు వైస్‌కెప్టెన్‌గా ఉన్న అజింక్యా రహానెకు ఉద్వాసన పలుకుతూ సెలెక్టర్లు మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ బాధ్యతలనూ రోహిత్‌కు అప్పగించారు. అంటే.. భవిష్యత్‌లో కోహ్లీకి సుదీర్ఘ ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచీ ఉద్వాసన పలుకుతారనేందుకు ఇది సంకేతమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రోహిత్‌ అన్ని ఫార్మాట్లకూ సారథిగా ఉండే అవకాశాలున్నాయి. కాగా.. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ 3 టెస్ట్‌లతోపాటు 3 వన్డేలు ఆడనుంది.  


ఆ ముగ్గురికి ఈ టూర్‌ ఆఖరా ..?

న్యూజిలాండ్‌తో స్వస్థలంలో జరిగిన రెండో టెస్ట్‌ తుది జట్టులో రహానెకు స్థానం దక్కకపోవడంతో అతడిని వైస్‌కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని అంచనా వేశారు. అదే జరిగింది. కాకపోతే.. సఫారీ టూర్‌కు అజింక్యాకు జట్టులో చోటు లభించిందంటే అతడికి మరో అవకాశం ఇవ్వాలని కోచ్‌ ద్రవిడ్‌ భావించడమే కారణమని తెలుస్తోంది. అక్కడ కనుక విఫలమైతే రహానె అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినట్టే. మరోవైపు పుజార, కోహ్లీ కూడా విఫలమవుతుండడం కూడా రహానెకు జట్టులో చోటు లభించడానికి మరో కారణం. విరాట్‌, పుజారకు చాన్స్‌ ఇచ్చి రహానెపై వేటు వేస్తే న్యాయంగా ఉండదని కూడా సెలెక్టర్లు భావించినట్టున్నారు. ‘కోహ్లీని పక్కనపెడితే..పుజార, రహానెకు దక్షిణాఫ్రికాతో సిరీస్‌ చివరిది’ అని బీసీసీఐ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.


ఇకపోతే ఈనెల 26 నుంచి జరిగే తొలి టెస్ట్‌ తుది జట్టులో అజింక్యాకు చోటు అనుమానమేనని ఆయన అన్నారు. ఇషాంత్‌ది కూడా ఇదే పరిస్థితి. అతడికి చివరి చాన్స్‌ ఇవ్వాలనే సఫారీ పర్యటనకు ఎంపిక చేసినట్టు భావిస్తున్నారు. బుమ్రా, సిరాజ్‌, షమిలను కాదని అతడికి తుది జట్టులో స్థానం లభించడం కష్టమే. ఒకవేళ చాన్స్‌ దక్కి దానిని అతడు సద్వినియోగం చేసుకోలేకపోతే లంబూ కెరీర్‌కు కూడా తెరపడినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, వర్క్‌లోడ్‌తో కివీస్‌తో సిరీస్‌కు దూరమైన రోహిత్‌, పంత్‌, బుమ్రా, షమి మళ్లీ జట్టులోకొచ్చారు. 


స్పిన్‌కు అశ్విన్‌ నాయకత్వం..

కుడి ముంజేయి గాయంతో జడేజా టూర్‌ను మిస్సవడంతో అశ్విన్‌ స్పిన్‌ విభాగం బాధ్యతలు మోయనున్నాడు. రెండో స్పిన్నర్‌గా జయంత్‌ యాదవ్‌కు చాన్స్‌ లభించింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న ఇండియా ‘ఎ’ జట్టు సభ్యుడు సౌరభ్‌ కుమార్‌ను స్టాండ్‌ బైగా ఎంపిక చేయడం ఆసక్తికరం. సత్తా కలిగిన ఆల్‌రౌండర్‌గా మన్ననలు అందుకుంటున్న యూపీకి చెందిన లెఫ్టామ్‌ స్పిన్నర్‌, ఎడమ చేతి బ్యాటర్‌ సౌరభ్‌కు తుదిజట్టులో చోటు దక్కినా ఆశ్చర్యంలేదు. 


సఫారీ పర్యటనకు భారత టెస్ట్‌ జట్టు

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌కెప్టెన్‌), కేల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజార, రహానె, శ్రేయాస్‌ అయ్యర్‌, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా (కీపర్‌), అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, షమి, ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌.


స్టాండ్‌బై ఆటగాళ్లు

నవ్‌దీప్‌ సైనీ, సౌరభ్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, అర్జాన్‌ నగ్వాస్‌వాలా.


విహారికి దక్కిన ప్రతిఫలం..

సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌లకు 18 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయాల కారణంగా.. ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్‌ పటేల్‌, బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ పేర్లను ఎంపికకు పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ వివరించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ఇండియా ‘ఎ’  జట్టు సభ్యుడిగా ఉన్న తెలుగు ఆటగాడు హనుమ విహారి అక్కడ సత్తా చాటడంతో..సీనియర్‌ జట్టులో పునరాగమనం చేశాడు. గాయంతో న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ కూడా జట్టులోకి వచ్చాడు. సరైన ఫామ్‌లో లేని రహానె, సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ చోటు దక్కించుకోగలిగారు. కివీ్‌సతో రెండో టెస్ట్‌లో రాణించిన పుజార తన చోటు పదిలం చేసుకున్నాడు.

Updated Date - 2021-12-09T09:32:28+05:30 IST