పేదల భూములు కబ్జా!

ABN , First Publish Date - 2022-01-23T05:35:00+05:30 IST

దోమ మండలం దిర్సంపల్లిలో బడా బాబులు, రియల్టర్లు పేదల భూమి కబ్జా చేస్తున్నారు. సర్వే నెం173లో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్‌ భూములపై కన్నేశారు.

పేదల భూములు కబ్జా!


  •  ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్‌
  •  పేద రైతులకు టీఆర్‌ఎస్‌ నాయకుల బెదింపులు
  •  దిర్సంపల్లి సర్వే నెంబరు 173 భూమిలో ఆక్రమణలు

దోమ మండలం దిర్సంపల్లిలో బడా బాబులు, రియల్టర్లు పేదల భూమి కబ్జా చేస్తున్నారు. సర్వే నెం173లో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్‌ భూములపై కన్నేశారు. పేదల భూములు ఆక్రమించి వారిని వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారు. చెరువునే పూడ్చివేస్తూ, కొన్ని ఎకరాల్లో మైనింగ్‌ సైతం నిర్వహిస్తున్నారు. ఇదంతా అధికార పార్టీ నాయకుల అండదండలతోనే జరుగుతోందని,  అధికారులు అన్నీ చూస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు   అంటున్నారు.

దోమ/పరిగి, జనవరి 22 : ప్రభుత్వ, పేదల అసైన్డ్‌ భూములను రియల్టర్లు, బడాబాబులు ఆక్రమిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా దోమ మండలం దిర్సంపల్లిలోని 173 సర్వే నెంబరులో 454.38ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో 1975 నుంచి 2005వరకు నిరుపేదలకు అసైన్‌ చేసి పట్టాఇచ్చారు. మరో 112ఎకరాల మిగులు భూమి ఉంది. దీనిలో కొంత భూమిని సాయికృష్ణ క్రషర్‌కు లీజుకిచ్చారు. ఈ సర్వే నెంబరుకు ఆనుకొని పట్టా భూములు ఉన్నాయి. భూముల రేట్లు పెరగడంతో బడాబాబులు, రియల్టర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆ భూమిపై కన్నేశారు. 167, 168సర్వే నెంబర్లలో పాలెపల్లికి చెందిన సత్యనారాయణరెడ్డికి 24.15 ఎకరాలు ఉంది. ఇటీవల ఈయన భూమి రియల్టర్లకు అగ్రిమెంట్‌ చేసినట్లు తెలిసింది. అగ్రిమెంట్‌దారుడు భూమిని చదును చేసి అన్ని వ్యవహారాలు చూసుకునేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులకు అప్పగించాడు. వారు ఏకంగా పట్టా భూమిని చదును చేయడమే కాకుండా 173 సర్వే నెంబరులో ఉన్న గండిచెరువు కుంట పూడ్చివేసి, అసైన్డ్‌ భూములు సైతం ఆక్రమించారు. 50ఎకరాలు కబ్జా చేశారు. 

ఫిర్యాదు చేసిన నెలరోజులకు రంగంలోకి.

తము భూములను కబ్జా చేశారని అసైన్డ్‌దారులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై నెల రోజుల తరువాత యంత్రాంగం కదిలింది. అసైన్డ్‌ భూమిలో చదును చేస్తున్న నాలుగు టిప్పర్లు, మూడు ఎక్స్‌కవేటర్లు, రెండు డోజర్లను రెవెన్యూ అధికారులు సీజ్‌చేశారు. రియల్టర్లు కిలోమీటరు పొడవు రోడ్డు వేసి మట్టిని తవ్వుతున్నా అధికారులు చర్యలు ఎందుకు తీసుకోలేదని గ్రామస్తులు, స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారని మండిపడుతున్నారు. అసైన్డ్‌ భూమి కబ్జా చేస్తున్నా చర్యలు తీసుకోలేదని, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.


చంపుతామని బెదిరిస్తున్నారు: - రాములునాయక్‌, దిర్సంపల్లి తండా

173 సర్వే నెంబరులో 2005లో 3ఎకరాల నాకు అసైన్డ్‌ పట్టా ఇచ్చారు. ఈ భూమిని సాగుచేసుకుంటున్నా. కొన్ని రోజుల కింద కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు ఈ భూమి దగ్గరికి వస్తే చంపుతామని బెదిరించారు. దీనిపై నేను తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాను. ఉన్నతాధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలి.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం:- వహిదాఖాతూన్‌, తహసీల్దార్‌  

173 సర్వే నెంబరులో పేదలకిచ్చిన అసైన్డ్‌ భూమిలో రియల్టర్లు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వెంటనే వాహనాలు సీజ్‌ చేశాం. సర్వే చేసి ఎవరి భూమి వారికి అప్పగిస్తాం. ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలు జరిపి కుంటను కబ్జాకు చేసిన వారిపై కేసు నమోదు చేయిస్తాం.మా కస్టడీకి తీసుకున్న వాహనాలను కోర్టుకు సరెండర్‌ చేస్తాం. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ వొత్తిళ్లకు లొంగేది లేదు.

Updated Date - 2022-01-23T05:35:00+05:30 IST