దర్జాగా గెడ్డ వాగు కబ్జా

ABN , First Publish Date - 2021-10-29T04:59:29+05:30 IST

మండలంలోని ఇరువాడ రెవెన్యూ పరిధిలో గెడ్డవాగును కొంత మంది దర్జాగా ఆక్రమించుకున్నారు.

దర్జాగా గెడ్డ వాగు కబ్జా
ఇరువాడలో కబ్జాకు గురైన గెడ్డ వాగు

రాత్రికి రాత్రే పూడ్చివేత

ప్లాట్లుగా వేసి విక్రయించేందుకు ప్రణాళిక

పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు

ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి

సబ్బవరం, అక్టోబరు 28 : మండలంలోని ఇరువాడ రెవెన్యూ పరిధిలో గెడ్డవాగును కొంత మంది దర్జాగా ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న గెడ్డవాగును రాత్రికి రాత్రే పూడ్చివేసి పైపులు కూడా వేసేశారు. పూడ్చి వేసిన గెడ్డవాగును ప్లాట్లుగా వేసి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానిక రైతులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖ అధికారులు గురువారం ఆక్రమిత గెడ్డవాగును పరిశీలించారు. ఇరువాడ రెవెన్యూ పరిధి సర్వే నంబరు 47లో 1.02 ఎకరాలు గెడ్డవాగు ఉంది. ఈ వాగు నుంచి గైరమ్మచెరువుకు వరద నీరు వెళుతుంది. ఈ గెడ్డ ఆధారంగా గైరమ్మచెరువు కింద ఉన్న సుమారు 30 ఎకరాలు సాగవుతుంది. ఈ గెడ్డవాగును అనుకుని అనకాపల్లి- ఆనందపురం జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీంతో స్థానికంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను గెడ్డవాగు స్థలం, దానికి ఆనుకుని ఉన్న సర్వే నంబరు 50/1లో 0.11 సెంట్లు ప్రభుత్వ భూమిపై పడింది. ఈ క్రమంలో ప్రభుత్వ భూములను ఆనుకుని ఉన్న 15 సెంట్లు జిరాయితీ స్థలాన్ని కొనుగోలు చేశారు. జిరాయితీ భూమిని కలుపుకుని సర్వే నంబరు 51/1లో 0.11 సెంట్లు, సర్వే నంబరు 47లో 1.02 ఎకరాల గెడ్డవాగును చదును చేసి ప్లాట్లుగా వేసి సెంటు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించేందుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రణాళిక సిద్ధం చేశారని స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రణాళికలో భాగంగా బుధవారం రాత్రి జిరాయితీకి ఆనుకుని ఉన్న గెడ్డవాగును, ప్రభుత్వ భూమి(గయాలు)ను గ్రావెల్‌తో పూడ్చివేశారు. వరద నీరు పోయేందుకు పైపులు వేసి పూడ్చి వేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్‌ఐ రమణ, ఇరిగేషన్‌ ఏఈ రామలక్ష్మణ, వీఆర్వో విజయశ్రీ ఆక్రమిత స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం సమగ్ర సర్వే చేసి గెడ్డవాగు, ప్రభుత్వ స్థలం సరిహద్దులు గుర్తిస్తామన్నారు. కబ్జాకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐ తెలిపారు. కాగా కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో మంచి డిమాండ్‌ ఉందని, దాని విలువ సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.




Updated Date - 2021-10-29T04:59:29+05:30 IST