ఆలయ భూములను అమ్మేస్తున్నారు

ABN , First Publish Date - 2021-01-08T04:32:19+05:30 IST

రాజాంలో భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ పుణ్యమా.. భూముల ధరలు క్రమేపీ పెరగడంతో భూ బకాసురులు అవకాశం ఉన్న చోటల్లా స్థలాలు ఆక్రమిస్తున్నారు. ఆలయ భూములను సైతం ఆక్రమించి.. విక్రయిస్తున్నారు. అధికారులు అడ్డుకుంటే మిన్నకుంటున్నారు. లేకుంటే కొంతమంది అనుభవిస్తున్నారు. మరికొంతమంది బేరం పెడుతున్నారు. ఇదే తరహాలో రాజాం పట్టణ నడిబొడ్డున కోట్ల విలువ చేసే దేవదాయ శాఖ భూమిని కొంతమంది అక్రమార్కులు ఆక్రమించారు.

ఆలయ భూములను   అమ్మేస్తున్నారు
దేవదాయశాఖకు చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాల కోసం వేసిన మెటీరియళ్లు

- రాజాంలో భూ బకాసురుల హవా

- దేవుడి స్థలంలో అక్రమ నిర్మాణాలకు యత్నం

- అడ్డగోలుగా స్థలాల విక్రయం

(రాజాం రూరల్‌)

రాజాంలో భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ పుణ్యమా.. భూముల ధరలు క్రమేపీ పెరగడంతో భూ బకాసురులు అవకాశం ఉన్న చోటల్లా స్థలాలు ఆక్రమిస్తున్నారు. ఆలయ భూములను సైతం ఆక్రమించి.. విక్రయిస్తున్నారు. అధికారులు అడ్డుకుంటే మిన్నకుంటున్నారు. లేకుంటే కొంతమంది అనుభవిస్తున్నారు. మరికొంతమంది బేరం పెడుతున్నారు. ఇదే తరహాలో రాజాం పట్టణ నడిబొడ్డున కోట్ల విలువ చేసే దేవదాయ శాఖ భూమిని కొంతమంది అక్రమార్కులు ఆక్రమించారు. కొంతమంది హద్దులు వేశారు. మరికొంతమంది నిర్మాణ సామగ్రి సిద్ధం చేశారు. మరో ఇద్దరు ప్రబుద్ధులు ఏకంగా ఈ స్థలాన్ని అమ్మకానికి పెట్టారు. బండారం బయటపడడంతో తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేశారు. ఇంత అక్రమాలు జరుగుతున్నా, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. 

గుళ్లసీతారాంపురంలోని సీతారామస్వామి దేవస్థానానికి బొబ్బిలి సంస్థానాధీశులు సమకూర్చిన వందల ఎకరాలలో రాజాం నగర నడిబొడ్డున సత్యనారాయణపురం (తెలగవీధి)లో సర్వే నెంబరు 112లో 1, 2లలో సుమారు 1.20 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం రాజాంలో కొనసాగుతున్న బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ధరల ప్రకారం ఈ స్థలం సుమారు రూ.3 కోట్ల పైమాటే. ఇలాంటి స్థలాన్ని కాపాడుకోవడంలో దేవదాయ శాఖ శ్రద్ధ చూపకపోవడం ఆక్రమణదారులకు కాసులు కురిపిస్తోంది. ఆర్థిక బలం, రాజకీయ బలం ఉన్న అక్రమార్కులు ఈ స్థలంలో పాగా వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా స్థానిక రియల్‌ఎస్టేట్‌ ప్రముఖుడు.. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న రాజాంకి చెందిన ఓ వ్యక్తికి 14 ఇళ్ల స్థలాలను సుమారు రూ.60 లక్షలకు విక్రయించాడు. ముందుగా రూ.10 లక్షలు ఇచ్చి.. మిగిలిన రూ.50 లక్షలు రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చేలా అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అగ్రిమెంట్‌లో మాత్రం దేవదాయశాఖ భూమిని ఆనుకుని ఉన్న జిరాయితీ భూమి సర్వేనెంబరు 112లో 3 అని తప్పుగా వేశారు. రిజిస్ట్రేషన్‌ సమయం దగ్గర పడుతున్న సమయంలో ఆ భూమి దేవాదాయ శాఖకు చెందినదిగా రెవెన్యూ యంత్రాంగం ద్వారా తెలుసుకుని బోరుమనడం కొనుగోలుదారుడి వంతైంది. దీనిపై కొనుగోలుదారుడు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని నిలదీశారు. దీంతో చేసేది లేక బొబ్బిలి రోడ్డులోని బొమ్మినాయుడువలసకు వెళ్లే మార్గంలోని తన రియల్‌ఎస్టేట్‌లో 14 స్థలాలను కేటాయించాడు. ఇదిలా ఉండగా, గతంలోనూ ఇదే స్థలంలో కొంతభాగాన్ని అదే వీధికి చెందిన ఓ పెద్దమనిషి అమ్మకానికి వీలుగా అగ్రిమెంట్‌ చేశాడు. విషయం తెలుసుకున్న దేవదాయశాఖ అధికారులు రంగంలోకి దిగి లావాదేవీలను అడ్డుకున్నారు. ఈ స్థలం దేవదాయశాఖకు చెందినది అంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొంతమంది ఈ బోర్డులను పీకేసి.. అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికైనా దేవదాయశాఖ అధికారులు స్పందించి.. ఆక్రమణదారుల చెర నుంచి ఈ స్థలాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. 


చర్యలు తీసుకుంటాం


ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, మళ్లీ మొదటికే వస్తున్నారు. గతంలో నిర్మాణాలు చేస్తుంటే అడ్డుకున్నాం. ఇటీవల కాలంలో స్తంభాలు వేశారు. అక్కడి  పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తా. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. 

-పొన్నాడ శ్యామలరావు, ఇన్‌చార్జి ఈవో, సీతారాంపురం దేవస్థానం

Updated Date - 2021-01-08T04:32:19+05:30 IST