ప్రభుత్వ భూముల కబ్జా!

ABN , First Publish Date - 2021-10-23T05:30:00+05:30 IST

ఉలిందకొండలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. గ్రామంలోని సర్వే నెం 559, 552, 620, 653, 654, 650, 651లో ఉన్న ప్రభుత్వ భూములు అక్రమార్కులకు అడ్డాగా మారాయి.

ప్రభుత్వ భూముల కబ్జా!

  1. ఉలిందకొండలో భారీగా ఆక్రమణలు
  2. దశాబ్దాలుగా సాగులో ఉన్నవారికి బెదిరింపులు
  3. దళారులతో కుమ్మక్కైన కొందరు రెవెన్యూ ఉద్యోగులు


కల్లూరు, అక్టోబరు 23: ఉలిందకొండలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. గ్రామంలోని సర్వే నెం 559, 552, 620, 653, 654, 650, 651లో ఉన్న ప్రభుత్వ భూములు అక్రమార్కులకు అడ్డాగా మారాయి. జిల్లాలోని ఓ రియల్టర్‌ ఆధ్వర్యంలో ఈ భూముల క్రయ విక్రయాలు జరుపుతున్నారని తెలిసింది. కొందరు రెవెన్యూ సిబ్బంది, అధికారులు వీరికి భూ వివరాలను తెలియజేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 651-1 సర్వే నెంబరులో సాగుకు యోగ్యం కాని బంజరు భూములను నాలుగు దశాబ్దాలకు పైగా కొందరు సాగు చేసుకుంటున్నారు. ఈ పేద రైతు కుటుంబాలకు డీ పట్టా ఇచ్చేందుకు ఓ రెవెన్యూ సిబ్బంది ఎకరానికి రూ.1.50 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని అంటున్నారు. 


45 ఎకరాలు కబ్జా


ఉలిందకొండ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఒకే కుటుంబం 45 ఎకరాలకు పైగా కబ్జా చేసిందని సమాచారం. మూడు సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆ కుటుంబం ఆక్రమించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కొండ భూమిని యంత్రాలతో చదును చేసి రోజుల వ్యవధిలో రికార్డులు సృష్టించే పనిలో ఉన్నట్లు సమాచారం. 


ఎకరా పట్టాకు రూ.1.50 లక్షలు?


ఉలిందకొండలో ఓ సర్వే నెంబరులో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని బోయ నడిపి నాగన్న, భార్య వెంకటేశ్వరమ్మ 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. తమను సాగుదారుగా రికార్డు చేయాలని కోరితే ఒక ఎకరానికి డీ పట్టా ఇచ్చేందుకు రూ.1.50 లక్షలు ఖర్చు అవుతుందని ఓ రెవెన్యూ సిబ్బంది డిమాండ్‌ చేశారని బాధితులు తెలిపారు. దీంతో వారు మిన్నకుండి పోయారు. ఇదే అదనుగా భావించిన ఆ రెవెన్యూ సిబ్బంది ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి సంబంధించిన బ్రోకర్లతో చేతులు కలిపినట్లు సమాచారం. మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని ఎకరా రూ.3.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అమ్మేసుకున్నాడని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న తమను బ్రోకర్లు వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని నలుగురు రైతులు తెలిపారు. 


40 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నాం..


సర్వే నెంబరు 651-1లో 8 ఎకరాల భూమిని 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నాం. రూ.లక్షలు వెచ్చించి భూమి చదును చేసుకున్నాం. రెవెన్యూ అధికారులు గ్రామంలో విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకోవాలి. డీ పట్టా ఇవ్వాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. ఎకరానికి రూ.1.50 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. చివరికి గ్రామంలోని కొందరు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లతో చేతులు కలిపి మా పొలాన్ని అమ్మినట్లు ప్రచారం చేస్తున్నారు. మాపై దాడికి తెగబడి మా కుమారుడిని గాయపరిచారు. 


- వెంకటేశ్వరమ్మ, ఉలిందకొండ


న్యాయం చేస్తాం.. 


ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులు ఎవరైనా ఉంటే గ్రామంలో విచారించి న్యాయం చేస్తాం. పేదలకు న్యాయం చేసే క్రమంలో ఏ ఒక్క అధికారికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్హులైన వారికి అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా భూ పంపిణీ కార్యక్రమంలో భూమి కేటాయింపునకు చర్యలు తీసుకుంటాం. సర్వే నెంబర్లు 599, 552, 620లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాం. రెవెన్యూ చట్టం, నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వ భూములను ఆక్రమించి విచ్చలవిడిగా సాగు చేస్తున్న వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.


- టీవీ రమేశ్‌ బాబు, తహసీల్దారు, కల్లూరు

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST