పేదల ఇళ్లను తొలగించారు

ABN , First Publish Date - 2021-01-19T05:46:05+05:30 IST

ప్రభుత్వం పేదలకు అందించే లే-అవుట్‌లో అక్రమంగా ఇళ్లు నిర్మించారని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు వాటిని నేలమట్టం చేశారు.

పేదల ఇళ్లను తొలగించారు
అడ్డుకుంటున్న చిన్నారులను సైతం పక్కకు తోసివేస్తున్న మహిళ పోలీసులు


- అడ్డంగా బైఠాయించిన బాధితులు 

- బలవంతంగా పోలీసుల తొలగింపు

గిద్దలూరు టౌన్‌, జనవరి 18 : నవరత్నాలలో భాగంగా ప్రభుత్వం పేదలకు అందించే లే-అవుట్‌లో అక్రమంగా ఇళ్లు నిర్మించారని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు వాటిని నేలమట్టం చేశారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే  ఇళ్లు తొలగించడం ఏమిటంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులతో అక్కడి ఇళ్లవారు వాగ్వాదం చేశారు. పట్టణంలోని నల్లబండ బజారు చివరన ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా 3.30 ఎకరాలలో లేఅవుట్‌ను సిద్ధం చేస్తోంది.  అయితే ఇప్పటికే అక్కడ కొందరు ఇళ్లు నిర్మించుకొని ఉన్నారు. అయితే సోమవారం రెవెన్యూ అధికారులు వాటిని తొలగించాలంటూ తెల్లవారుజాము నుంచి పోలీసుల సహకారంతో, ప్రొక్లయిన్లతో 3 ఇళ్లను తొలగించేందుకు సిద్ధం చేశారు. బాధితులు అడ్డుపడుతున్నప్పటికీ వారిని పక్కకు తోసివేసి ఇళ్లను నేలమట్టం చేశారు. శ్రీనివాసులు, వీరయ్య అనే వ్యక్తులతోపాటు మరో వ్యక్తికి చెందిన మొత్తం మూడు ఇళ్లను  నేలమట్టం చేశారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చి వేస్తున్నారంటూ అధికారులతో వాదనలకు దిగారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు లే-అవుట్‌ నుంచి ఆ ఇళ్లను తొలగించారు. ఈ విషయం గురించి స్థానిక తహసీల్దార్‌ రాజారమేష్‌ ప్రేమ్‌కుమార్‌ను వివరణ కోరగా 3.30 ఎకరాలలో పేదలకు ఇచ్చే ఇళ్ల కోసం తాము లేఅవుట్‌ను సిద్ధం చేయగా రాత్రికి రాత్రి కొందరు ఇళ్ల నిర్మాణం చేపట్టారని, వాటిని తొలగించామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-01-19T05:46:05+05:30 IST