Abn logo
Jul 16 2020 @ 06:40AM

చెరువులు స్వాహా..!

నదులు, కొండలు, గుట్టలు సైతం కబ్జా

బోర్లు వేసి దర్జాగా సాగు

ఏడాదిగా పెరిగిన ఆక్రమణలు

పట్టించుకోని అధికారులు


రాజంపేట, జూలై 15: ఏడాదిగా రాజంపేట ప్రాంతంలో భూదందాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఆక్రమణలకు కాదేదీ అనర్హం అన్న రీతిలో రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో చెరువులను, కొండలను, గుట్టలను సైతం దర్జాగా కబ్జా చేసి సాగుకు అనువుగా మార్చుకుంటున్నారు. చెన్నై-కడప హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్న నందలూరు చెరువులో అక్రమ కట్టడాలు అనేకం వెలుస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఈ చెరువు 450ఎకరాలు విస్తీర్ణం ఉండగా 25ఎకరాలు ఆక్రమించుకొని పక్కా గృహాలు, ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. చిట్వేలి మండలం నగరిపాడులో సుమారు 20శాతం చెరువులు ఆక్రమించి అరటి, బొప్పాయి, మామిడి సాగు చేస్తున్నారు. బోర్లు సైతం వేసి, తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమి తమదేనని బుకాయిస్తున్నారు.


చెయ్యేరు పరీవాహక ప్రాంతంలో..

ఇకపోతే పెన్నానది తరువాత చెయ్యేరు నది ప్రధానమైనది. వర్షాభావపరిస్థితుల వల్ల ప్రస్తుతం చెయ్యేటిలో నీరు లేదు. ఒకటిన్నర కిలోమీటరు వెడల్పుతో ఈ నది సుమారు 100 కి.మీ మేర విస్తరించి ఉంది. అటువంటి నదికి ఆనుకొని నందలూరు మండలం టంగటూరు వద్ద 15ఎకరాలు, ఆడపూరు వద్ద 10ఎకరాలు, లేబాక వద్ద సుమారు 50ఎకరాలు, నందలూరు పాత బ్రిడ్జి చెయ్యేరులో 5ఎకరాలు... ఇలా నదికి ఇరువైపులా సుమారు 200ఎకరాల పైబడి కబ్జా చేశారు. దీనిపై అక్కడక్కడా కొందరు ఫిర్యాదు చేస్తే లేబాక పరిసర ప్రాంతాల్లో ఒకటిరెండు చోట్ల అధికారులు ఆక్రమణలు తొలగించి చేతులు దులుపుకున్నారు. నదికి ఇరువైపులా మామిడి, ఇతరత్రా చెట్లను నాటి, బోర్లు వేసి కరెంటు తీయించుకొని ఎంచక్కా సాగు చేసుకుంటున్నారు. 


చక్రాలమడుగు కూడా..

గుంజనేరుపరిస్థితి కూడా ఇంతే. ఇక పుల్లంగేరు, చక్రాల మడుగు గురించి చెప్పాల్సిన పనిలేదు. రాజంపేట పట్టణం ఆనుకొని వెళ్లే చక్రాల మడుగంతా ఆక్రమణలమయమే... నట్టినడి ఏట్లో భారీ ఎత్తున భవంతులు కట్టారు. ఇక గ్రామంలోని ఆవులు, మేకలు, గొర్రెలకు మేతనిచ్చే కొండలు, గుట్టలను వదలకుండా చదును చేసి సాగు చేసుకుంటున్నారు. కొండలను తొలగించి ఏకంగా మామిడి, నిమ్మ లాంటి పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇటీవల ఈ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఇదేమని అడిగితే ఏదో ఒక పత్రాలు సృష్టించి ఇదంతా తమ పూర్వీకుల పట్టాలని, తమకు ప్రభుత్వం కేటాయించిందని చెబుతున్నారు.


ఆక్రమణలు జరగకుండా కార్యాచరణ:  ధర్మచంద్రారెడ్డి, ఆర్డీవో, రాజంపేట

కరోనా లాక్‌డౌన్‌ దృష్ట్యా నాలుగు నెలలుగా కొందరు నదులు, చెరువులు ఆక్రమించుకుంటున్న విషయమై మాకు వాట్స్‌పలు, ఇతర మెస్సేజ్‌ల ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నాం. నందలూరు మండలం టంగుటూరు వద్ద చెయ్యేటిని ఆక్రమించుకున్నట్లు తెలిసిన వెంటనే తొలగించాం. ప్రధానంగా ఓబులవారిపల్లె, పుల్లంపేట, నందలూరు ప్రాంతాల్లో ఈ ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. సంబంధిత ఇరిగేషన్‌, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో చెరువులు, గుట్టలు, నదులకు హద్దులను గుర్తించి అక్కడ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. త్వరలో దీనిపై కార్యాచరణ చేసి డివిజన్‌లో ఎక్కడా ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.


చెరువుల ఆక్రమణలు (ఎకరాల్లో..)

చెరువు విస్తీర్ణం ఆయకట్టు ఆక్రమణ

వత్తలూరు చెరువు 180 150 30

అనంతసముద్రం చిన్నచెరువు 60 100 20

అనంతసముద్రం చెరువు 170 220 20

దేవసముద్రం చెరువు 300 280 30

నందలూరు చెరువు 450 ----- 25

పాటూరు ఎర్రజెరువు 200 ------ 30

చెయ్యేరు --- ---- 200

Advertisement
Advertisement
Advertisement