పూడికతీతకు అడ్డంకులు

ABN , First Publish Date - 2022-05-23T05:09:59+05:30 IST

జూరాల ప్రాజెక్టు కుడి కాలువలో పూడికతీత, మరమ్మతుల కోసం నిధులు మంజూరైనా లీకేజీలు అడ్డంకిగా మారాయి. కాల్వ గేటు పూర్తిగా మూసివేసినా బేస్‌కు, గేట్లకు మధ్య గ్యాప్‌ ఉండటంతో కాల్వల్లో నీరు నిలిచి, పూడిక తీత చేపట్టలేక పోతున్నారు.

పూడికతీతకు అడ్డంకులు
జూరాల కుడి కాలువలోకి వస్తున్న గేట్ల లీకేజీ నీళ్లు

జూరాల కుడి కాల్వ గేట్ల వద్ద లీకేజీలు

కాల్వలో నిలిచి ఉన్న నీరు

షిల్ట్‌ తొలగించడానికి ఇక్కట్లు

గేట్ల వద్ద మరమ్మతులు చేయిస్తున్న అధికారులు


గద్వాల, మే 22: జూరాల ప్రాజెక్టు కుడి కాలువలో పూడికతీత, మరమ్మతుల కోసం నిధులు మంజూరైనా లీకేజీలు అడ్డంకిగా మారాయి. కాల్వ గేటు పూర్తిగా మూసివేసినా బేస్‌కు, గేట్లకు మధ్య గ్యాప్‌ ఉండటంతో కాల్వల్లో నీరు నిలిచి, పూడిక తీత చేపట్టలేక పోతున్నారు. పూడిక తీత, గేట్ల మరమ్మతు కోసం రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. ప్రాజెక్టు నుంచి 29 కిలో మీటరు వరకు  పూడికతీతకు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్‌ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా, చాలా ఏళ్లుగా గేట్లకు మరమ్మతులు చేయకపోవడంతో నీరు లీక్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జములమ్మ రిజర్వాయర్‌ నుంచి కాలువలోకి నీటిని వదిలే గేట్లను మూసి వేసినా, అక్కడా గేట్ల నుంచి నీరు లీక్‌ అవుతోంది. వీటి కారణంగా కాలువలలో ఫీటు నుంచి అక్కడక్కడ రెండు ఫీట్ల వరకు నీళ్లు నిలిచి ఉన్నాయి. అవి పూర్తిగా తొలగిపోతే తప్ప పూడికతీత పనులు సాఫీగా సాగవు. అక్కడక్కడ దెబ్బతిన్న కాలువలకు మరమ్మతులు కూడా చేపట్టాల్సి ఉంది. బస్రా చెరువు నుంచి ఇటిక్యాల వరకు కాలువలో జమ్ము, గుర్రపుడెక్క ఉండటంతో చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు చేయడం లేదు. నీళ్లన్నీ డిస్ర్టిబ్యూటర్ల ద్వారా వృథాగా కృష్ణా నదిలోకి వెళ్తున్నాయి. వీటిని తొలగిస్తే తప్ప రైతులకు నీళ్లు సాఫీగా చేరవు.


గేట్ల లీకేజీలు అరికట్టేందుకు పనులు

గేట్ల వద్ద ఏర్పడిన లీకేజీలను సరి చేసుకేందుకు ప్రా జెక్టు అధికారులు రెండు రోజుల నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. గేట్లు పూర్తిగా మూసే సినా బేస్‌కు, గేటుకు మధ్య గ్యాప్‌ ఉండ టాన్ని గుర్తించి మూసివేసే పనులు చేపడుతు న్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో దాదాపు 2.915 టీఎంసీల నీళ్లు ఉండటం, గేట్ల దగ్గర కూడా భారీగా లోతు ఉండటంతో ప్రత్యేక నిపుణులు పనులు చే స్తున్నారు. లీకేజీలు పూర్తిగా అరికడుతున్నామని, సోమవారం నాటికి పూర్తి చేస్తామని చెబుతు న్నారు. పూడిక తీత పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. 


ఈ సీజన్‌ నాటికి పూర్తి చేస్తాం

గేట్ల నుంచి వచ్చే లీకేజీలను అరికట్టాము. ఎక్కడైనా కాలువలో నీళ్లు నిలిస్తే వాలు కట్టలు వేసి పనులు చేస్తాం. ఖరీఫ్‌కు నీళ్లు విడుదల చేసేలోపే పనులన్నీ పూర్తి చేస్తాం. ఏమేరకు అనుమతులు ఉన్నాయో అక్కడి వరకు పూడికతీత, మరమతులు పూర్తి చేస్తాం.

- ఖాజా జుబేర్‌ అహ్మద్‌, పీజేపీ ఈఈ 

Updated Date - 2022-05-23T05:09:59+05:30 IST