స్టేడియం నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

ABN , First Publish Date - 2022-04-28T04:05:48+05:30 IST

క్రీడాకారులకు నిలయమైన జిల్లాలో స్టేడియం నిర్మాణానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. మంచిర్యాలలో స్టేడియం ఏర్పాటు చేయాలనే డిమాండ్లు దశాబ్దాలుగా ఉన్నాయి.

స్టేడియం నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
. స్టేడియం నిర్మాణానికి మున్సిపాలిటీ కేటాయించిన స్థలం

- స్థలాభావంతో ఇంతకాలం ఆటంకాలు
- ఫలించిన అధికారులు, ప్రజా ప్రతినిధుల కృషి
- పదెకరాలు కేటాయించిన మున్సిపాలిటీ
- నెరవేరనున్న క్రీడాకారుల దశాబ్దాల కల

మంచిర్యాల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులకు నిలయమైన జిల్లాలో స్టేడియం నిర్మాణానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. మంచిర్యాలలో స్టేడియం ఏర్పాటు చేయాలనే డిమాండ్లు దశాబ్దాలుగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ముఖ్య పట్టణంగా విరాజిల్లిన మంచిర్యాల పట్టణంలో క్రీడా కారులకు కొదువ లేదు. మంచిర్యాల పట్ట ణం మీదుగా హైదరాబాద్‌-న్యూ ఢిల్లీ ప్రధాన రైల్వే మార్గం వెళుతుం డడంతో క్రీడాకారుల రాకపోకలకు అనువైనదిగా పేరుగాంచింది. ఉమ్మడి జిల్లాలోని తూర్పు ప్రాంతమైన మంచిర్యాలకు చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి పతకాలు సాధిం చారు.  మంచిర్యాల జిల్లా ఏర్పాటు అనంతరం క్రీడల పట్ల మరింత ఆస క్తి నెలకొంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వివిధ అంశాల్లో 10వేల మం ది క్రీడాకారులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. వివిధ క్రీడలతోపాటు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ కెడేట్లకు ఇక్కడ కొదువ లేదు. ఎన్‌సీసీకి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా మంచిర్యాల కేంద్రంగా ప్రత్యేక బెటాలియన్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపా దనలు సైతం ముందుకు వచ్చాయి.

- జిల్లా కేంద్రంలో..
శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌, బెల్లంపల్లిలో స్టేడియాలు ఉన్నప్పటికీ అవి పూర్తిస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు అనుకూలంగా లేవు. దీంతో జిల్లా కేంద్రంలో ప్రధాన స్టేడియం ఏర్పాటు చేయాలని పాలకులు, అధికారులు ఆలోచనలు చేశారు. ఇందు కోసం కనీసం 10 ఎకరాలు స్థలం అవసరం ఉండడంతో కేటాయింపులు లేక ఆ అంశం మరుగున పడింది. దీంతో మినీ స్టేడియం నిర్మాణం తెరపైకి వచ్చింది. తక్కువ స్థలం అవసరం కావడంతో స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని ఇందుకు ఎంపిక చేశారు. స్థానిక నివాసి గడ్డం దుర్గయ్య అనే వ్యక్తి నుంచి 10-03-1969న పట్టణంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాలు నిర్వాహకులు 6.02 ఎకరాల స్థలాన్ని కొనుగోలుచేసి పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం ఆ స్థలంలో పాఠశాల భవనాన్ని నిర్మించగా మరో 4. 5 ఎకరాల్లో విద్యార్థుల ఉపయోగార్థం క్రీడా మైదానం ఏర్పాటు చేశారు. ఆ మైదానంలో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాధనలు తెరపైకి రాగా క్రీడలశాఖ  2 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది. అయితే స్టేడియం నిర్మాణ ప్రతిపాధనలకు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు 15-11-1988న విచారణ జరిపిన అప్పటి ఉమ్మడి జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎస్కే సిన్హా పాఠశాలకు కేటాయించిన స్థలం ప్రభుత్వ భూమికాదని స్పష్టం చేశారు. దీంతో స్టేడియం నిర్మాణానికి అడ్డంకి ఎదురైంది. ఈ మేరకు  మంజూరైన నిధులు కూడా వెనక్కి మళ్లాయి.

- శాశ్వత పరిష్కారం దిశగా..
మినీ స్టేడియం నిర్మాణంలో తరుచుగా అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో శాశ్వత పరిష్కారం దిశగా అప్పటి యంత్రాంగం చర్యలు చేపట్టింది. 2014లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంచిర్యాల తహసీల్దార్‌ పాఠశాల స్థలాన్ని అధికారికంగా స్పోర్ట్స్‌ అథారిటీకి అప్పగిస్తూ ప్రొసీడింగ్‌ ఇచ్చారు. దీంతో స్టేడియం నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ కాగా క్రీడలశాఖ నుంచి అవసరమైన నిధులు మంజూ రయ్యాయి. స్టేడియం నిర్మాణం కోసం 2015లో 2.10 కోట్ల రూపాయలు మంజూర య్యాయి. అంచనా వ్యయం పెరగడంతో మరో 55 లక్షల రూపాయలు అదనంగా కేటాయించారు. స్పోర్ట్‌ అథారిటీ చైర్మన్‌ హోదాలో జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి 2019లో మినీ స్టేడియం నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. 2. 65 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 4.5 ఎకరాల మైదానంలో 1000 చదరపు గజాల స్థలంలో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. ఇండోర్‌ గేమ్స్‌తో పాటు రెండు బ్యాడ్మింటన్‌ కోర్టులు, కబడ్డీ, టెన్నిస్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ కోర్టు, 200, 100 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌, లాంగ్‌ జం్‌ పకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రహరీని ఆనుకొని వాకింగ్‌ ట్రాక్‌నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉటుందని భావించారు.

- హైకోర్టు ఉత్తర్వులతో నిలిచిన పనులు..
స్టేడియం పనులు నిలిపివేయాలని ఏడాది క్రితం స్కూల్‌ మేనేజ్‌మెం ట్‌ కమిటీ చైర్మన్‌ కలవేన బాలాజీ హై కోర్టును ఆశ్రయించారు. మైదానం పట్టణ నడిబొడ్డున ఉన్నందున అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజలకు అనువుగా ఉన్న ఒక్కగానొక్క స్థలాన్ని స్టేడియం నిర్మాణనికి వినియోగిస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, పైగా స్టేడియం నిర్మించే స్థలం ప్రభుత్వ భూమి కానందున పనులను నిలిపి వేస్తూ ఆదేశిలివ్వాలని అభ్యర్థించారు. పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం  పనులు ఆపివేయాలని గత ఏడాది అక్టోబర్‌ 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

- ఎట్టకేలకు స్థలం కేటాయింపు..
జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కలెక్టర్‌ భారథి హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అవసరమైన స్థలం కేటాయించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. దీంతో పట్టణంలోని రాళ్లవాగు సమీపంలోని పాత మంచిర్యాలలోగల మున్సిపల్‌ స్థలం 22. 14 ఎకరాల నుంచి సర్వే నెంబర్లు 183, 184, 186 నుంచి మొత్తం 10.14 ఎకరాలను కేటాయిస్తూ అధికారులు ఈ నెల 26న జరిగిన మున్సిపల్‌ సాధారణ సమావేశంలో ఆమోదం కోసం కౌన్సిల్‌ ముందు పెట్టారు. కౌన్సిల్‌ సభ్యులు ఆమోదం తెలపడంతో  స్టేడియం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయినట్లయింది.

స్థలం కేటాయించడం హర్షణీయం
- డి రాజలింగు, హ్యాండ్‌బాల్‌ కోచ్‌

మంచిర్యాలలో స్టేడియం కోసం స్థలం కేటాయించడం హర్షణీయం. ప్రజా ప్రతినిధులు, అధికారులకు అభినందనలు, స్టేడియం నిర్మాణంతో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుంది.  స్థానికంగానే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.  

క్రీడాకారులకు కొదువ లేదు
- కనపర్తి రమేశ్‌, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి

జిల్లాలో క్రీడాకారులకు కొదువ లేదు. స్టేడియం అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో మంచిర్యాల క్రీడా హబ్‌గా వెలుగొందుతుందనడంలో అతిశ యోక్తిలేదు. ఇప్పటికే జిల్లా నుంచి పలువురు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు.

Updated Date - 2022-04-28T04:05:48+05:30 IST