ఆనకట్టకు అడ్డంకులు

ABN , First Publish Date - 2020-10-20T05:35:44+05:30 IST

దేవాదుల ప్రాజెక్టు కింద సాగు విస్తీర్ణం పెంచేందుకు తుపాకులగూడెం వద్ద ప్రభుత్వం చేపడుతున్న సమ్మక్క బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

ఆనకట్టకు అడ్డంకులు

2017లో రూ.1,625 కోట్లతో తుపాకులగూడెం వద్ద బ్యారేజీకి శ్రీకారం

దేవాదుల వద్ద గోదావరి బేసిన్‌లో బ్యాక్‌ వాటర్‌ పెంచాలనే లక్ష్యం

అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని పనులు 


ఆంధ్రజ్యోతి భూపాలపల్లి,  అక్టోబరు 19:

దేవాదుల ప్రాజెక్టు కింద సాగు విస్తీర్ణం పెంచేందుకు తుపాకులగూడెం వద్ద ప్రభుత్వం చేపడుతున్న సమ్మక్క బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. 2017లో రూ.1,625 కోట్ల వ్యవయంతో చేపట్టిన ఈ ఆనకట్టతో గోదావరి బేసిన్‌లో 6.9 టీఎంసీల నీటి నిల్వ పెరగనుంది. ఫలితంగా దేవాదుల ద్వారా నాలుగు పాత జిల్లాలోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ఏడాది మే వరకే పనులు పూర్తి కావాల్సి ఉండగా కరోనాతో కూలీల వలసతో పనులకు బ్రేక్‌ పడింది. గత రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరదకు కాఫర్‌ డ్యాం తెగిపోయి పనులకు మరిన్నీ ఆటంకాలు ఎదురవుతున్నాయి.  


ఎత్తిపోతలకు తుపాకులగూడెం

2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం వరంగల్‌ జిల్లాలోని ఏటూరునాగారం మండలం దేవాదుల వద్ద చొక్కారావు ఎత్తిపోతల పథకంకు శ్రీకారం చుట్టింది. వరంగల్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాలోని 6.50 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు చేపట్టారు. అయితే రూ.12.8 వేల కోట్లుకు పైగా ఖర్చు చేసినప్పటికీ 180 రోజులు మోటార్లు నడవటానికి దేవాదుల వద్ద గోదావరిలో నీటిమట్టం సరిపోవటం లేదు. దీంతో గోదావరి బ్యాక్‌ వాటర్‌ను పెంచి నీరు నిల్వ ఉండేలా ఆనకట్ట కట్టాలని గత కాంగ్రెస్‌ ప్రభుత్వం 2006లో కంతనపల్లి వద్ద ప్రతిపాదనలు చేసింది. రూ.48 కోట్ల వరకు ఖర్చు కూడా చేసింది. కానీ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పనులు ముందుకు సాగలేదు. 


టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు 180 రోజులు గోదావరిలో దేవాదుల వద్ద నీటి లభ్యత ఉండాలని కంతనపల్లి బ్యారేజీని రీ డిజైన్‌ చేసి తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. రూ.1,625 కోట్ల వ్యయంతో ఆనకట్ట నిర్మించేందుకు సూ రిత్విక్‌ కంపెనీలకు పనులు అప్పగించారు. 1,132 మీటర్ల పొడవు ఆనకట్టకు 60 పీయర్స్‌, 59 రేడియల్‌ గేట్లతో 92 మీటర్ల ఎత్తు, 10 మీటర్ల వెడల్పుతో ఈ బ్యారేజీ పనులు చేపట్టారు. బ్యారేజీ పైన ఛత్తీ్‌సగఢ్‌ వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కూడా చేస్తున్నారు. ఈ బ్యారేజీ పూర్తయితే తుపాకులగూడెం నుంచి దేవాదుల వరకు 8 కిలో మీటర్ల వరకు 6.94 టీఎంసీల నీరు నిల్వ ఉండనుంది. ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టు మిగులు జలాలతో పాటు ఇంద్రావతి నది నుంచి వచ్చే వరద తుపాకులగూడెం వద్ద స్టోరేజీ కానుంది. దీంతో వేసవిలోనూ దేవాదుల నుంచి 6.50లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు వరంగల్‌ నగరానికి తాగునీటిని అందిచనున్నారు.


ఆగుతూ.. సాగుతూ...

అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల పట్టింపులేని తనమో కానీ... మూడున్నరేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. 2017లో పనులు ప్రారంభమయ్యాయి. భూసేకరణలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వటంతో 2018లో పనులు స్పీడందుకున్నాయి. 2019 ఆగస్టు నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అప్పటి వరకు 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. మరోసారి గడువు పెంచుతూ 2020ఫిబ్రవరి వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ, 60 శాతం పనుల మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం 60 ఫీయర్స్‌కు 55 పూర్తయ్యాయి. మరో ఐదు పీయర్స్‌ ఛత్తీ్‌సగఢ్‌ వైపు నీటిలో మునిగి ఉన్నాయి. ఇక మొత్తం 59గేట్లకు 19 మాత్రమే బిగించారు. ఇంకా 40 గేట్లు బిగించాల్సి ఉంది. అయితే ఇన్నాళ్లు అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆగుతూ.. సాగుతూ వస్తున్న పనులకు కరోనాతో బ్రేక్‌ పడింది. ఏప్రిల్‌ నెలలో తుపాకులగూడెం బ్యారేజీ వద్ద పని చేసే కూలీలు కరోనాతో తమ స్వరాష్ర్టానికి వలస వెళ్లారు. దీంతో పనులకు బ్రేక్‌ పడింది. ఆగస్టులో కూలీలు తిరిగి వచ్చినప్పటికీ భారీ వర్షాలతో పనులకు అంతరాయం కలుగుతోంది. 


సెప్టెంబరులోని భారీ వర్షాలకు కాఫర్‌ డ్యాం తెగిపోయింది. ఇటీవలే కాఫర్‌ డ్యాంను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా తాజాగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద పెరగుతోంది. దీంతో పనులకు మళ్లీ తాత్కాలికంగా వాయిదా వేశారు. అధికారులు బ్యారేజీ నిర్మాణానికి మరోసారి గడువు పొడిగించారు. 2021 మే వరకు పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. గడువు పెరుగుతున్న కొద్దీ అంచనా వ్యయం పెరుగుతోంది. మెటీరియల్స్‌ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి అదనపు భారం పడుతోంది. మరోవైపు దేవాదుల ఫేస్‌-3 పనులు కూడా పూర్తయ్యాయి. రామప్ప నుంచి గణపసముద్రం, లక్నవరం, పాకాల, రంగా నాయక చెరువులోకి 6టీఎంసీల నీటిని మళ్లించాల్పి ఉంది. తుపాకులగూడెం బ్యారేజీ పనులు పూర్తి కాకపోవటంతో నీటిని మళ్లించటం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే వేసవి పంటలకు కూడా దేవాదుల నీళ్లు అందే అవకాశం లేదు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దేవాదుల నీళ్లు ఈసారి కూడా పొలాల్లోకి చేరే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-10-20T05:35:44+05:30 IST