అడ్డగోలు వాదనలు

ABN , First Publish Date - 2020-08-04T06:53:46+05:30 IST

మరోమూడునెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర వివాదాన్ని సృష్టిస్తున్నాయి. కరోనా విపత్తును చాలాకాలం పాటు...

అడ్డగోలు వాదనలు

మరోమూడునెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర వివాదాన్ని సృష్టిస్తున్నాయి. కరోనా విపత్తును చాలాకాలం పాటు గుర్తించ నిరాకరించి, దానిని ఎదుర్కోవడంలో విఫలమైన ట్రంప్‌, ఇప్పుడు దానిని కారణంగా చూపి ఎన్నికల వాయిదా గురించి మాట్లాడటం అనేకులను విస్మయపరుస్తున్నది. ‘మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌’ విధానం మీద పలు అనుమానాలు వ్యక్తంచేస్తూ, తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన. కరోనా కారణంగా ఓటర్లలో అత్యధికులు స్వయంగా పోలింగ్‌ బూత్‌లకు వచ్చి లైన్లలో నిరీక్షించి ఓటు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నందున, ఈ మెయిల్‌ ఇన్‌ సౌకర్యం వైపు చాలా రాష్ట్రాలు దృష్టిసారిస్తున్నాయి. రిజిస్టర్డ్‌ ఓటర్లందరికీ బ్యాలెట్‌ పత్రాలు పంపి, వారు కచ్చితంగా ఓటువేసేట్టు చేయాలని అనుకుంటున్నాయి. అమెరికాలో అనాదిగా ఉన్న విధానమే అయినప్పటికీ, ఇంతకాలమూ ఒక అవకాశంగా మాత్రమే ఉపకరిస్తున్న ఈ మార్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది వివిధ వ్యవస్థల ఆలోచన. కానీ, ఓటరు ప్రత్యక్షంగా బ్యాలెట్‌బాక్సులో ఓటువేసినప్పుడే తాను గెలుస్తాననీ, మెయిల్‌ ఓట్లకు అనుమతించడం తనను ఓడించే కుట్రేనని ట్రంప్‌ వాదన. రిజిస్టర్‌ చేసుకున్న ఓటర్లందరికీ, వారు కోరినా కోరకున్నా బ్యాలెట్‌ పత్రాలు వారి చెంతకే పంపాలని నెవడా తీసుకున్న నిర్ణయాన్ని సైతం ట్రంప్‌ న్యాయస్థానంలో సవాలు చేస్తానంటున్నారు.


కరోనాను అడ్డుపెట్టుకొని తనను ఓడించడానికి కుట్రలు జరుగుతున్నాయని ట్రంప్‌ అంటున్నారు. తగిన సంసిద్ధత లేనిపక్షంలో పోస్టాఫీసులు ఈ బ్యాలెట్‌ పత్రాల తిరుగుటపాను తట్టుకోలేవని ఆయన వాదన. ట్రంప్‌ కూడా గతంలో ఇదే విధానంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భాన్ని అక్కడి మీడియా గుర్తుచేస్తున్నది. తాము ఓటు చేసిన బ్యాలెట్ పత్రాలను తిరిగి పంపేందుకు ఓటర్లకు చాలా మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఓటర్లుగా గుర్తింపు పొందినవారికి మాత్రమే బ్యాలెట్‌ పేపరు చేరుతుంది కనుక, అమెరికా చరిత్రలో గతంలో కూడా భారీ అక్రమాలు జరిగిన దాఖలాలు లేవు. స్వయంగా పోలింగ్‌ కేంద్రానికి పోయి బ్యాలెట్‌ పత్రంతోనో, ఓటింగ్‌ మెషిన్‌ ద్వారానో ఓటు హక్కు వినియోగించుకోలేని స్థితిలో ఈ విధానాన్ని గతంలో లక్షలాది మంది ఎంపిక చేసుకున్నారు. గత ఇరవైయేళ్ళలో పాతికకోట్ల మంది ఈ విధానంలో ఓటుచేస్తే, అక్రమాలు జరిగింది లెక్కకు కూడా అందనంత తక్కువ. ఈ విధానం ఏదో ఒకపార్టీకి లబ్ధిచేకూరుస్తుందన్న విమర్శలు కూడా ఎన్నడూ తలెత్తలేదు. ఇప్పుడు ట్రంప్‌ మాదిరిగా ఇదేదో డెమోక్రాట్లకు మాత్రమే మేలు చేకూర్చి, తమకు నష్టం తెచ్చిపెట్టేదిగా రిపబ్లికన్లు సైతం ఎన్నడూ వ్యాఖ్యానించలేదు. అందువల్లనే, ట్రంప్‌ వాదనలో తన ఓటమిభయంతో పాటు, ఈ ప్రక్రియను బూచిగా చూపి ఏకంగా ఎన్నికలనే వాయిదావేయించే కుట్ర ఉన్నదని పలువురు అనుమానిస్తున్నారు.


ఇప్పటివరకూ జరిగిన పలు సర్వేల్లో డెమోక్రాట్‌ ప్రత్యర్థి జో బిడెన్‌ కంటే ట్రంప్‌ బాగా వెనకబడ్డారు. కరోనా వైఫల్యం, ఆర్థిక పతనం కలగలపి తన ఓటమి ఖాయమని ట్రంప్‌ నిర్థారణకు రాబట్టే, దాపురించబోయే ఓటమికి ఆయన ముందుగా కారణాలు వెతుకుతున్నట్టు కనిపిస్తున్నది. తాను నెగ్గే అవకాశం లేని ఎన్నికలమీద ప్రజల్లో అవిశ్వాసం కలిగించడం ఆయన లక్ష్యం కావచ్చు. ఎన్నికలు రద్దుచేయడం లేదా వాయిదా వేయడం ట్రంప్‌ చేతిలో లేనిపని. అమెరికా రాజ్యాంగం ఆ అవకాశాన్ని అధ్యక్షుడికి ఇవ్వలేదు. కచ్చితంగా అవి నవంబరు 3న జరగాల్సిందే. అయినా ట్రంప్‌ సంగతి బాగా తెలుసు కనుక ఆయన వ్యాఖ్యలను బట్టి ఆ విపత్తు గురించి కూడా భయపడుతున్నారు. ‘నేను ఓడిపోయే ప్రసక్తే లేదు, అటువంటి పరిస్థితే కనుక ఏర్పడితే ఏం చేయాలో నాకు బాగా తెలుసు’ అని ఈ మధ్యన ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు ప్రముఖంగా ముందుకు వస్తోంది. ట్రంప్‌ అడ్డుతోవలో ఎన్నికల వాయిదా విన్యాసానికి కనుక పూనుకుంటే, పెద్ద రాజ్యాంగ సంక్షోభమే ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థలపట్లా ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తి ట్రంప్‌. అమెరికాకు గతకాలపు ఘనకీర్తి తెచ్చిపెడతానని మాటలు చెప్పిన ఆయన పాలనలో ఉన్న ఆ పాటి కీర్తిని కూడా అది కోల్పోయింది. తన విజయానికి విదేశీశక్తుల సాయం తీసుకోవడం, విపక్ష నేతను భ్రష్టుపట్టించేందుకు మరో దేశాన్ని బ్లాక్‌బెయిల్‌ చేయడం, ప్రతినిధుల సభ అభిశంసించినా నిస్సిగ్గుగా ఎదురుదాడిచేయడం వంటివి ఆయనకు మాత్రమే సాధ్యం. ఎన్నికలు వాయిదా వేయాలన్న ట్రంప్‌ కోరిక నెరవేరకపోవచ్చు కానీ, ఈ వ్యాఖ్యల ద్వారా తాను ఓటమి అంచున ఉన్నానని ఆయన తనకుతానుగా బయటపెట్టుకున్నట్టు అయింది.

Updated Date - 2020-08-04T06:53:46+05:30 IST